English | Telugu

గుర్రంపై నుంచి కింద‌ప‌డిపోయిన శాంతిప్రియ‌!

భానుప్రియ చెల్లెలు శాంతిప్రియ తెలుగులో వంశీ సినిమా 'మ‌హ‌ర్షి'తో హీరోయిన్‌గా ప‌రిచ‌య‌మై ఆక‌ట్టుకుంది. ఆ త‌ర్వాత తెలుగు, త‌మిళ భాష‌ల్లో కొన్ని సినిమాలు చేశాక బాలీవుడ్‌కు వెళ్లి అక్క‌డ రాణించింది. వివాహానంత‌రం సినిమాల‌కు దూర‌మైంది. పెళ్లయిన కొంత కాలానికే భ‌ర్త ప్ర‌మాదంలో మృతి చెంద‌డంతో ఇద్ద‌రు కుమారుల‌ను పెంచి పెద్ద‌చేసింది. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ కోసం ఎదురుచూస్తోంది.

కెరీర్ ఆరంభంలో ర‌ఘువ‌ర‌న్ స‌ర‌స‌న 'పెరియ‌వ‌ర్‌గ‌ళే తాయ్ మార్గ‌ళే' అనే త‌మిళ చిత్రంలో నాయిక‌గా న‌టించింది శాంతిప్రియ‌. అప్పుడు ఆమె స్క్రీన్ నేమ్ నిశాంతి. మ‌ద్రాస్ వైఎంసీఏలో షూటింగ్ జ‌రుగుతోంది. అందులో శాంతిప్రియ గుర్ర‌పు స్వారీ చేసే స‌న్నివేశాన్ని చిత్రీక‌రిస్తున్నారు. ఈ సీన్ తీసే ముందు ద‌ర్శ‌కుడు, నిర్మాత ఆమెకు డూప్ పెడ‌తామ‌న్నారు. కానీ ఆమె ఒప్పుకోలేదు. ఎందుకంటే, ఆమెకు గుర్ర‌పు స్వారీలో మంచి ప్ర‌వేశం ఉంది.

అందుక‌ని తానే స్వ‌యంగా గుర్ర‌పు స్వారీ చేస్తాన‌ని, డూప్ లేకుండా ఆ స‌న్నివేశంలో న‌టించేందుకు రెడీ అయ్యింది. చేసేది లేక ద‌ర్శ‌కుడు, నిర్మాత స‌రేన‌న్నారు. గుర్రాన్ని తెప్పించారు. స్టైల్‌గా గుర్ర‌మెక్కి క‌ళ్లాన్ని ప‌ట్టుకుంది శాంతిప్రియ‌. గుర్ర‌పు స్వారీలో త‌న ప్రావీణ్యం చూపించాల‌ని క‌ళ్లాన్ని అదిలించి, స్పీడుగా గుర్రాన్ని ప‌రుగెత్తించింది. గుర్రం ఫాస్ట్‌గా ప‌రుగెత్తుతోంది. కొంత‌దూరం వెళ్లిన త‌ర్వాత ఆ గుర్రం చేసిన జంప్‌కు ఆమె కాళ్లు రికాబులోంచి జారి పైకి ఎగిరింది. బ్యాలెన్స్ దొర‌క‌లేదు. ఆలోగా చేతిలో క‌ళ్లెం జారిపోయింది. గుర్రం ముందుకు ప‌రుగెత్తింది. అంతే.. శాంతిప్రియ ద‌బ్బున నేల‌మీద ప‌డింది.

యూనిట్ మొత్తం ఆమెవైపు ప‌రుగెత్తుకుంటూ వ‌చ్చారు. అంత‌లోనే ఆమె నేల‌మీద లేచి నిల‌బ‌డ్డంతో వాళ్లంతా ఆశ్చ‌ర్య‌పోయారు. గుర్రం మీద‌నుంచి ప‌డినా ఆమెకు ఒక్క దెబ్బ కూడా త‌గ‌ల్లేదు మ‌రి. ఎప్పుడైతే కాలు ప‌ట్టుత‌ప్పిందో అప్పుడే తాను కింద‌ప‌డ‌తాన‌ని ఊహించి, తెలివిగా తానే గుర్రం మీద‌నుంచి జారి కింద‌ప‌డి దెబ్బ‌లు త‌గ‌ల‌కుండా త‌ప్పించుకుంద‌న్న మాట శాంతిప్రియ‌!