Read more!

English | Telugu

అలా చేసినందుకు.. ఆమె నా చెంప చెళ్ళుమనిపించింది!

తెలుగు క్లాసిక్‌ సినిమాల గురించి చెప్పుకోవాల్సి వస్తే.. అందులో ‘శంకరాభరణం’ తప్పకుండా ఉంటుంది. ఆ సినిమాలోని ప్రతి క్యారెక్టర్‌కీ ఎంతో ప్రత్యేకత ఉంది. అలాగే శంకరశాస్త్రి కుమార్తెగా నటించిన రాజ్యలక్ష్మీకి కూడా ఆ సినిమా ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే అదే ఆమె నటించిన తొలి సినిమా. ఆ తర్వాత తెలుగు, తమిళ్‌, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 100కిపై సినిమాల్లో నటించింది. అంతేకాదు, పలు తమిళ్‌ ఛానల్స్‌లో ప్రసారమయ్యే సీరియల్స్‌లో కూడా తన నటనతో అందర్నీ ఆకట్టుకుంది. 

ఇదిలా ఉంటే.. తన 40 ఏళ్ళ కెరీర్‌లో మర్చిపోలేని ఓ సంఘటన గురించి ఓ ఇంటర్వ్యూలో వెల్లడిరచింది రాజ్యలక్ష్మీ. ‘అది ఒక మలయాళ సినిమా. నేను కూతురుగా, ఒక సీనియర్‌ నటి తల్లిగా నటించాం. తల్లి గతంలో ఎవరి వలనో మోసపోయింది. తన కూతురికి అలాంటి పరిస్థితి రాకూడదని భావిస్తుంది తల్లి. ఒకసారి ఆమె కూతురు పార్కులో ఒక కుర్రాడితో కబుర్లు చెబుతూ కనిపిస్తుంది. ఆ కోపంతోనే  ఇంటికి వస్తుంది. ఆ తర్వాత ఇంటికి వచ్చిన కూతుర్ని ‘ఎక్కడి నుంచి వస్తున్నావు’ అని అడుగుతుంది. ఆ కూతురు కాలేజీ నుంచి వస్తున్నానని చెప్తుంది. చెంప ఛెళ్లుమనిపిస్తుంది తల్లి. అదీ సీన్‌. షాట్‌ రెడీ చెప్పారు. కెమెరా ట్రాలీలో రన్‌ అవుతోంది. యాక్షన్‌ చెప్పారు. ఎక్కడి నుంచి వస్తున్నావు అని ఆమె అడిగింది. కాలేజి నుంచి అని నేను చెప్పాను. చెంప ఛెళ్ళుమనిపించింది. నేను షాక్‌ అయిపోయాను. నా కళ్ళ వెంట నీళొచ్చాయి. అంత గట్టిగా కొట్టింది. నన్ను ఎవరూ అంత గట్టిగా కొట్టలేదు. షూటింగ్‌లో కూడా అలాంటి సీన్‌ చెయ్యాల్సి వచ్చినపుడు ఆ ఆర్టిస్టులు ముందుగానే మమ్మల్ని ఎలర్ట్‌ చేస్తారు. చేతిని ఓవర్‌ లాప్‌ చేసి కొడతానని చెబుతారు. ఒక్కోసారి దెబ్బ కూడా తగలొచ్చు. దానికి ముందే ప్రిపేర్‌ అవుతాం కాబట్టి ఇబ్బంది ఉండదు. కానీ, ఆమె మాత్రం ఎలాంటి ఇండికేషన్‌ ఇవ్వకుండా లాగి కొట్టింది. ఆ తర్వాత సీన్‌ కంటిన్యూ అయింది. ఆమె తన డైలాగులు చెప్పేసింది. షాట్‌ ఓకే అయింది. సాధారణంగా ఇలాంటి పొరపాట్లు జరిగినపుడు, మనవల్ల ఎదుటివారు ఇబ్బంది పడినపుడు సారీ చెప్తాం. కానీ, ఆమె మాత్రం ఏం మాట్లాడకుండా బయటికి వెళ్ళి కూర్చుంది. అప్పుడు డైరెక్టర్‌ అన్నారు.. ‘ఏమ్మా.. మీ ఇద్దరి మధ్య ఏంటి ప్రాబ్లం’ అని. ‘మా మధ్య ఎలాంటి ప్ల్రాబ్లం లేదు. నావల్ల ఎవరికీ ఎలాంటి ప్రాబ్లమ్‌ ఉండదు. మీకు తెలుసు కదా’ అన్నాను. ‘అదేదో తేల్చుకో మరి’ అని ఆయన నవ్వుతూనే చెప్పారు. మరుసటి రోజు షూటింగ్‌కి వచ్చాను. ఆమె సెట్‌లోనే ఉంది.. ‘గుడ్‌ మార్నింగ్‌ అక్కా’ అన్నాను. దానికామె ‘గుడ్‌ మార్నింగా.. ఇది నిన్న  ఏమైంది’ అన్నారు. నాకు అప్పుడు స్ట్రైక్‌ అయింది. అంతకుముందు రోజు ఆమెకు గుడ్‌ మార్నింగ్‌ చెప్పలేదు. అందుకే ఆమె ప్రవర్తన అలా ఉందని అర్థమైంది. అలా షూటింగ్‌లో చెంపదెబ్బ తినాల్సి వచ్చింది’ అని వివరించారు రాజ్యలక్ష్మీ.