English | Telugu

అంజలీదేవి అంటే సీతమ్మ.. తమ మనసుల్లో ఆమెకు గుడి కట్టిన ప్రేక్షకులు!

(ఆగస్ట్‌ 24 నటి అంజలీదేవి జయంతి సందర్భంగా..)

సాత్విక పాత్రలకు, కరుణ రసాన్ని పలికించే పాత్రలకు, పురాణ ఇతిహాసాల్లోని పతివ్రతల పాత్రలకు పెట్టింది పేరు అంజలీదేవి. పౌరాణిక చిత్రాల్లోని పాత్రలకు తన అద్వితీయమైన నటన ద్వారా జీవం పోశారు. లవకుశలో పోషించిన సీతమ్మతల్లి పాత్ర అంజలి జీవితాన్నే కాదు, ఎంతో మంది జీవితాలను కూడా ప్రభావితం చేసింది. ఒక దశలో సీత అంటే అంజలీదేవే అని ప్రజలు భావించేవారు. ఆమె బయట కనిపిస్తే కాళ్ళకు నమస్కరించేవారు. ఈ తరహా పాత్రల్లో అంజలికి వచ్చినంత పేరు మరే నటికీ రాలేదంటే అతిశయోక్తి కాదు. సాధారణంగా బిజీ హీరోయిన్లు త్వరగా పెళ్లి చేసుకోరు. అలా చేసుకుంటే అవకాశాలు తగ్గిపోతాయన్నది వారి బాధ. అంజలి మాత్రం ఇద్దరు ప్లిలలు పుట్టిన తర్వాత సినిమా రంగానికి వచ్చారంటే ఆశ్చర్యం కలగక మానదు. చిన్నతనం నుంచి నాటకాల్లో వివిధ పాత్రలు పోషిస్తూ వచ్చిన అంజలికి సినిమాల్లోకి వెళ్లాలన్న కోరిక ఉండేది కాదు. అలాంటి అంజలీదేవి సినిమాల్లోకి ఎలా ప్రవేశించారు, ఆమె కెరీర్‌ ఎన్ని మలుపులు తిరిగింది, సినిమాల్లో ఆమె సాధించిన విజయాలేమిటి? అనే విషయాల గురించి తెలుసుకుందాం.

1927 ఆగస్ట్‌ 24న తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో జన్మించారు అంజలీదేవి. ఆమె అసలు పేరు అంజనీకుమారి. ఈమె తండ్రి నూకయ్య రంగస్థల కళాకారుడు. నాటకాలు వేయడం, నాటకాలకు సంగీతం సమకూర్చడం వంటివి చేసేవారు. 9 ఏళ్ళ వయసులో మొట్టమొదటిసారి రంగస్థలంపై అడుగు మోపారు అంజలి. ఆ తర్వాత స్కూల్‌ మాన్పించి ఆమెకు సంవత్సరంపాటు సంగీతం, నృత్యం నేర్పించారు. అయితే వాటికంటే చదువుకోవడానికే ఆమె ఎక్కువ ఇష్టపడేవారు. అయినా కాకినాడలోని యంగ్‌ మెన్స్‌ హ్యాపీ క్లబ్‌లో వుండే ఆదినారాయణరావు దగ్గర నటనలో శిక్షణ ఇప్పించేందుకు చేర్పించారు నూకయ్య. అక్కడ నటన నేర్చుకుంటూనే చదువుకునేవారు. ఆదినారాయణరావు నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నారు అంజలి. ఆ క్రమంలోనే ఆయనంటే ఆమెకు ఆరాధనా భావం కలిగింది. యంగ్‌మెన్స్‌ హ్యాపీ క్లబ్‌ వేసే నాటకాల్లో, ఇతర నాటక పరిషత్‌లు వేసే నాటకాలతో బిజీ అయిపోయారు అంజలి.

అప్పుడు అంజలికి పెళ్లి చేయాలని తండ్రి నూకయ్య సంబంధాలు చూశారు. అయితే తను పెళ్ళంటూ చేసుకుంటే ఆదినారాయణరావునే చేసుకుంటాను అని పట్టుపట్టారు అంజలి. అప్పటికే పెళ్ళయి పిల్లలు కూడా ఉన్న ఆయన్ని పెళ్లి చేసుకోవడానికి నూకయ్య ఒప్పుకోలేదు. చివరికి తండ్రిని ఒప్పించి, ఆదినారాయణరావు కుటుంబ సభ్యుల్ని కూడా ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత వారికి ఇద్దరు పిల్లలు పుట్టారు. ఆ సమయంలో సి.పుల్లయ్య దర్శకత్వంలో రూపొందుతున్న గొల్లభామ చిత్రంలో నటించమని అంజలిని అడిగారు. సినిమాల్లో నటించడం అంజలికి, ఆదినారాయణరావుకు ఇష్టం లేకపోయినా పెద్దాయన అడిగారని ఒప్పుకున్నారు. ఈ సినిమా జరుగుతున్న సమయంలోనే అంజనీకుమారిగా ఉన్న ఆమె పేరును అంజలీదేవిగా మార్చారు సి.పుల్లయ్య. ఆ సినిమాలో ఆమెకు వ్యాంప్‌ క్యారెక్టర్‌ ఇచ్చారు. అది అంజలికి మంచిపేరు తెచ్చింది. దాంతో ఆ తర్వాత అన్నీ వ్యాంప్‌ క్యారెక్టర్సే వచ్చాయి. అలా మూడు సంవత్సరాలపాటు వ్యాంప్‌ క్యారెక్టర్స్‌ చేశారు. ఈ విషయంలో అంజలీదేవి ఎంతో బాధపడ్డారు. మంచి క్యారెక్టర్స్‌ చేసే అవకాశం వస్తే బాగుండేది అనుకున్నారు.

ఆ సమయంలోనే ఘంటసాల బలరామయ్య... శ్రీలక్ష్మమ్మ కథ పేరుతో రూపొందిస్తున్న సినిమాలో అంజలికి ప్రధాన పాత్ర ఇచ్చారు. ఆ సినిమా విజయం సాధించకపోయినా అంజలికి నటిగా మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత ఎన్టీఆర్‌ హీరోగా పల్లెటూరి పిల్ల చిత్రంలో అంజలికి హీరోయిన్‌ అవకాశం ఇచ్చారు. ఎన్టీఆర్‌, ఎఎన్నార్‌ కలిసి నటించిన తొలి సినిమా ఇదే. ఈ సినిమా తర్వాత అంజలీదేవి 15 సంవత్సరాలపాటు హీరోయిన్‌గా కొనసాగారు. అనార్కలి, సువర్ణసుందరి, జయభేరి, భీష్మ, చెంచులక్ష్మీ వంటి సినిమాల్లో అద్భుతమైన పాత్రలు పోషించారు. 1958లో సి.పుల్లయ్య దర్శకత్వంలో లవకుశ చిత్రంలో సీతగా నటించారు అంజలీదేవి. ఈ సినిమా ఆమె సినీ జీవితాన్ని ఒక్కసారిగా మలుపు తిప్పింది. ఈ సినిమా చిత్రీకరణ ఐదేళ్ళపాటు జరిగింది. 1963లో విడుదలైన లవకుశ అఖండ విజయం సాధించింది. ఇక అప్పటి నుంచి సీత అంటే అంజలీదేవేనని అందరూ ఫిక్స్‌ అయిపోయారు. మరో పక్క ఆదినారాయణరావు సంగీత దర్శకుడిగా చాలా బిజీ అయిపోయారు.

ఆ తర్వాత భక్త ప్రహ్లాద, బడిపంతులు, తాత మనవడు వంటి ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నటించారు అంజలి. నటిగానే కాదు, నిర్మాతగా కూడా ఎన్నో సినిమాలు నిర్మించారు. 1953లో అంజలి పిక్చర్స్‌ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి పరదేశి అనే చిత్రాన్ని నిర్మించారు. ఆ తర్వాత తెలుగు, తమిళ్‌, హిందీ భాషల్లో మొత్తం 28 సినిమాలు నిర్మించారు. విశేషం ఏమిటంటే ఈ సినిమాలన్నింటికీ ఆదినారాయణరావే సంగీత దర్శకుడు. 70, 80 దశకాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా కూడా అందరికీ గుర్తుండిపోయే పాత్రలు పోషించారు అంజలీదేవి. 1992లో వచ్చిన బృందావనం ఆమె నటించిన చివరి సినిమా. ఇక అవార్డుల గురించి చెప్పాలంటే.. ఉత్తమ నటిగా అనార్కలి, సువర్ణ సుందరి, చెంచులక్ష్మీ, జయభేరి చిత్రాలకు ఫిలింఫేర్‌ అవార్డులు అందుకున్నారు. అలాగే ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్‌, రఘుపతి వెంకయ్య పురస్కారం, రామినేని పురస్కారం, ఎన్‌.టి.ఆర్‌. జాతీయ పురస్కారం అంజలీదేవిని వరించాయి. 40 సంవత్సరాలకు పైగా నాటక రంగానికి, సినిమా రంగానికి విశేష సేవలు అందించిన అంజలీదేవి 2014 జనవరి 13న 86 ఏళ్ళ వయసులో గుండెపోటుతో మరణించారు. ఆమె తన అవయవాలను రామచంద్ర మెడికల్‌ కాలేజీకి దానమిచ్చారు.