English | Telugu

కృష్ణ 'నేరము శిక్ష'కి 50 ఏళ్ళు.. యాక్సిడెంట్ చుట్టూ తిరిగే సినిమా!


"మనిషికి మనసే సాక్షి.. మనిషి విధించే శిక్ష తప్పినా.. మనసు వేధించే శిక్ష తప్పదు. నేరానికి శిక్ష తప్పదు.." అనే పాయింట్ తో రూపొందిన చిత్రం 'నేరము శిక్ష'. రష్యన్ నవల 'క్రైమ్ అండ్ పనిష్మెంట్' ఆధారంగా కళాతపస్వి కె. విశ్వనాథ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో సూపర్ స్టార్ కృష్ణ, భారతి జంటగా నటించారు. కాంతారావు, బాలయ్య, సత్యనారాయణ, రావుగోపాల రావు, అర్జా జనార్థన రావు, కృష్ణకుమారి, పండరీ బాయి, పుష్ప కుమారి, పి. ఆర్. వరలక్ష్మి, ఏడిద నాగేశ్వరరావు, పి. జె. శర్మ, మాస్టర్ విశ్వేశ్వరరావు ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. ఎం. బాలయ్య కథను అందించిన 'నేరము శిక్ష'కి సముద్రాల జూనియర్, మోదుకూరి జాన్సన్ సంభాషణలు సమకూర్చారు.

కథాంశం విషయానికి వస్తే.. ధనవంతులైన రాజశేఖరం (కాంతారావు), శాంతమ్మ (పండరీ బాయి)కి విజయ్ (కృష్ణ) ఏకైక సంతానం. అందుకే ఆ ఇంట్లో విజయ్ ఆడిందే ఆట.. పాడిందే పాట.. అలాంటి విజయ్ చేతికి ఓ కొత్త కారు వస్తుంది. ఈ క్రమంలోనే.. స్నేహితుడు సత్యం (సత్యనారాయణ)తో కారు డ్రైవింగ్ లో పోటీపడతాడు. సరిగ్గా ఇదే సమయంలో.. అనుకోకుండా ఓ యాక్సిడెంట్ చేస్తాడు విజయ్. ఈ ప్రమాదంలో చిన్నయ్య (బాలయ్య) కళ్ళు పోగొట్టుకోగా.. అతని అన్నయ్య కన్నుమూస్తాడు. దీంతో విజయ్ ఇంట్లో చాలా కాలంగా పనిచేసే డ్రైవర్.. శాంతమ్మ మీద అభిమానంతో ఆ నేరం తన మీద వేసుకుంటాడు. మరోవైపు నిజం తెలిసి.. రాజశేఖరం కొడుకుని ఇంటి నుండి గెంటివేస్తాడు. పౌరుషంతో ఇంటి నుండి బయటికి వచ్చిన విజయ్.. మరో శ్రీమంతుడు నారాయణ రావు (రావు గోపాల రావు)కి కూతురు అయిన సుజాత (భారతి)ని ఓ విషయంలో సపోర్ట్ చేస్తాడు. అలా.. నారాయణ రావు ఇంట్లో బట్లర్ గా చేరతాడు. విజయ్ మంచితనం చూసి సుజాత క్రమంగా అతణ్ణి ప్రేమిస్తుంది. మరోవైపు.. తన కారణంగా ఇబ్బందుల్లో పడ్డ డ్రైవర్ ఫ్యామిలీకి, చిన్నయ్య కుటుంబానికి దేవుడయ్య, పిచ్చయ్య పేర్లతో దగ్గరవుతాడు విజయ్. ఆర్థిక సహాయం కూడా చేస్తుంటాడు. అంతేకాదు.. చిన్నయ్యకి తిరిగి కళ్ళు వచ్చేలా చేస్తాడు. అయితే విజయ్ ని చంపాలన్న పంతంతో ఉన్న చిన్నయ్య.. చివరకి అసలు నిజం తెలుసుకుని మనసు మార్చుకుంటాడు. విజయ్ మాత్రం తను చేసిన నేరానికి శిక్ష అనుభవించేందుకు సిద్ధమవడంతో కథ ముగుస్తుంది.

పాటల విషయానికి వస్తే.. ఎస్. రాజేశ్వరరావు స్వరాలు సమకూర్చిన ఈ సినిమాకి దేవులపల్లి కృష్ణశాస్త్రి, సి. నారాయణ రెడ్డి, దాశరథి, కొసరాజు, పి. గణపతి శాస్త్రి, సముద్రాల జూనియర్ సాహిత్యమందించారు. "దిక్కులేని", "చేసిన పాపం నీది చితికిన బ్రతుకింకొకరిది", 'దాగుడు మూత దండాకోర్", "వన్ టూ వన్ టూ", "రాముని బంటునురా", "వేశావు భలే వేషాలు", "ఏమండి సారూ ఓ బట్లర్ దొరగారూ" అంటూ సాగే పాటలు ఆకట్టుకున్నాయి. ఎం. బాలయ్య సమర్పణలో అమృతా ఫిలింస్ పతాకంపై అలపర్తి సూర్య నారాయణ, మన్నవ వెంకట్రావు నిర్మించిన 'నేరము శిక్ష'.. తమిళంలో 'నీతిక్కు తలైవనంగు' (ఎంజీఆర్, లత), హిందీలో 'శిక్ష' (రాజ్ కిరణ్, సుష్మ వర్మ) పేర్లతో రీమేక్ అయింది. 1973 జూలై 27న విడుదలై మంచి విజయం సాధించిన 'నేరము శిక్ష'.. గురువారంతో 50 వసంతాలు పూర్తిచేసుకుంటోంది.