English | Telugu
శోభన్ బాబు 'తోడు నీడ'కి 40 ఏళ్ళు.. ఏ సినిమాకి రీమేకో తెలుసా?!
Updated : Aug 26, 2023
ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన కథానాయకుల్లో నట భూషణ్ శోభన్ బాబు ఒకరు. ఆయన నటించిన కుటుంబ కథా చిత్రాల్లో సింహభాగం విజయం సాధించాయి. వాటిలో 'తోడు నీడ' ఒకటి. 1981 నాటి హిందీ చిత్రం 'బసేరా' (శశి కపూర్, రాఖీ, రేఖ, పూనమ్ థిల్లాన్) ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో శోభన్ బాబు ద్విపాత్రాభినయం చేయగాసరిత, రాధిక, నళిని కథానాయికలుగా నటించారు. గుమ్మడి, ఎం. ప్రభాకర్ రెడ్డి, అల్లు రామలింగయ్య, సూర్యకాంతం, మిక్కిలినేని, రాళ్ళపల్లి, చలపతిరావు, సాయికుమార్, అత్తిలి లక్ష్మి, మాస్టర్ సురేశ్, మాస్టర్ మణి కుమార్ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. లీలా పన్సాల్ కర్ మూలకథకి గుల్జార్ స్క్రీన్ ప్లే సమకూర్చగా.. ఆచార్య ఆత్రేయ మాటలు అందించారు. ప్రముఖ నటుడు, దర్శకుడు వల్లభనేని జనార్థన్ ఈ ఫ్యామిలీ డ్రామాని డైరెక్ట్ చేశారు.
దిగ్గజ స్వరకర్త చక్రవర్తి బాణీలు కట్టిన ఈ చిత్రానికి ఆత్రేయ, వేటూరి సుందరరామ్మూర్తి సాహిత్యమందించగా.. ఎస్పీబీ, సుశీల గాత్రమందించారు. "నా తోడువైనా నీడవై", "పూజలెన్ని చేశాను", "కోకమ్మత్త", "అక్కగారూ చక్కాని చుక్క", "ఒళ్ళెంతో సుబ్బరం" అంటూ మొదలయ్యే పాటలు ఆకట్టుకుంటాయి. మహేశ్వరి ఫిలింస్ పతాకంపై ఎస్పీ వెంకన్నబాబు నిర్మించిన 'తోడు నీడ'.. 1983 ఆగస్టు 27న జనం ముందు నిలిచింది. ఆదివారంతో ఈ సినిమా 40 వసంతాలు పూర్తిచేసుకుంటోంది.