English | Telugu

చిరంజీవి 'రోషగాడు'కి 40 ఏళ్ళు.. గుప్తనిధి చుట్టూ తిరిగే సినిమా!


మెగాస్టార్ చిరంజీవి ద్విపాత్రాభినయంలో రూపొందిన పలు చిత్రాలు బాక్సాఫీస్ ముంగిట వసూళ్ళ వర్షం కురిపించాయి. వాటిలో 'రోషగాడు' ఒకటి. యాక్షన్ డ్రామాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ప్రముఖ దర్శకుడు కె.ఎస్. ఆర్. దాస్ రూపొందించిన ఈ సినిమాలో మాధవి నాయికగా నటించగా.. సిల్క్ స్మిత ఓ కీలక పాత్రలో అలరించింది. కన్నడ ప్రభాకర్, ఇందిర, త్యాగరాజు, టెలిఫోన్ సత్యనారాయణ, జయవాణి, వీరభద్రరావు, జగ్గారావు, మాస్టర్ ప్రసాద్ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. ఎం.ఆర్.ఎన్. ప్రసాదరావు కథను అందించిన ఈ చిత్రానికి పరుచూరి బ్రదర్స్ సంభాషణలు సమకూర్చారు.

కథ విషయానికి వస్తే.. సికిందర్ (చిరంజీవి) ఓ గజదొంగ. తను దోచిన సొమ్మునంతా ఓ చోట దాచిపెడతాడు. ఆ వివరాలన్నీ ఓ డైరీలో రాస్తాడు. ఈ క్రమంలో.. అదే పోలికలతో ఉన్న శ్రీకాంత్ (చిరంజీవి) తన ప్రేయసి శైలజ (మాధవి) సహాయంతో ఆ నిధిని ఎలా పోలీసులకు అప్పగించాడు? అనేది మిగిలిన కథ.

సత్యం స్వరాలు సమకూర్చిన 'రోషగాడు'కి రాజశ్రీ సాహిత్యమందించాడు. ఇందులోని "అచ్చట్ల ముచ్చట్ల బుల్లెమ్మ", "చిన్నదాని కొనచూపు", "నేనంటే చూడు నేనే", "యవ్వనం నీకు స్వాగతం" అంటూ సాగే పాటలు ఆకట్టుకున్నాయి. వీటిని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సుశీల, జానకి ఆలపించారు. పి.ఎన్. ఆర్. పిక్చర్స్ పతాకంపై పింజల నాగేశ్వరరావు నిర్మించిన 'రోషగాడు'.. హిందీలో 'దావ్ పేచ్' (జితేంద్ర, భానుప్రియ) పేరుతో రీమేక్ అయింది. 1983 జూలై 29న విడుదలై ప్రజాదరణ పొందిన 'రోషగాడు'.. శనివారంతో 40 వసంతాలు పూర్తిచేసుకుంటోంది.