English | Telugu

కృష్ణ, శ్రీదేవి కాంబో లాస్ట్ ఫిల్మ్ కి 35 ఏళ్ళు.. ఆ సినిమా ఏంటో తెలుసా!

 కృష్ణ, శ్రీదేవి కాంబో లాస్ట్ ఫిల్మ్ కి 35 ఏళ్ళు.. ఆ సినిమా ఏంటో తెలుసా!

సూపర్ స్టార్ కృష్ణ, అతిలోక సుందరి శ్రీదేవి.. తెలుగునాట తిరుగులేని కాంబినేషన్ ఇది. వీరిద్దరి కలయికలో వచ్చిన పలు చిత్రాలు బాక్సాఫీస్ ముంగిట మ్యాజిక్ చేశాయి. వాటిలో 'మహారాజశ్రీ మాయగాడు' ఒకటి. ఈ సినిమా.. కృష్ణ, శ్రీదేవి కాంబోలో లాస్ట్ ఫిల్మ్ కావడం విశేషం.  కన్నడ చిత్రం 'భాగ్యద లక్ష్మి బారమ్మ' (రాజ్ కుమార్, మాధవి) ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.  ప్రముఖ దర్శకుడు విజయబాపినీడు తెరకెక్కించిన ఈ చిత్రంలో నూతన్ ప్రసాద్, ప్రసాద్ బాబు, హరి ప్రసాద్, ఈశ్వర రావు, రాళ్ళపల్లి, బ్రహ్మానందం, పద్మనాభం, వంకాయల, మహారథి, బాలయ్య, శుభలేఖ సుధాకర్, రాజ్ భరత్, జయమాలిని, రోహిణి, తాతినేని రాజేశ్వరి, రాజ్యలక్ష్మి, శైలజ, దుర్గ, కళ్యాణి, అనిత, కోట శంకర్రావు, థమ్, విజయ దుర్గ, అశోక్ కుమార్ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు.   కైకాల సత్యనారాయణ అతిథి పాత్రలో అలరించారు. సింగీతం శ్రీనివాసరావు కథను అందించిన ఈ సినిమాకి కాశీ విశ్వనాథ్ సంభాషణలు సమకూర్చారు.

రాజ్ - కోటి బాణీలకు వేటూరి, భువనచంద్ర సాహిత్యమందించారు. "సత్యభామలా బుంగమూతి పెట్టి నాకు గాలమెయ్యకు", "బొమ్మనిపిస్తావ్ ఓ సారి", "ఆనంద ఆనంద", "చిటుకు లటుకు" అంటూ మొదలయ్యే పాటలు ఆకట్టుకున్నాయి. శ్రీనివాస ప్రొడక్షన్స్ పతాకంపై అట్లూరి రాధాకృష్ణమూర్తి, కొమ్మన నారాయణ రావు ఈ చిత్రాన్ని నిర్మించారు.  1988 సెప్టెంబర్ 9న విడుదలైన 'మహారాజశ్రీ మాయగాడు'.. శనివారంతో 35 వసంతాలు పూర్తిచేసుకుంటోంది.