English | Telugu
'మాయలోడు'కి 30 ఏళ్ళు.. మళ్ళీ మ్యాజిక్ చేసిన కాంబో!!
Updated : Aug 18, 2023
నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ కి అచ్చొచ్చిన దర్శకుల్లో ఎస్వీ కృష్ణారెడ్డి ఒకరు. వీరి కలయికలో వచ్చిన తొలి రెండు చిత్రాలు ఘన విజయం సాధించాయి. ఆ సినిమాలే.. 'రాజేంద్రుడు - గజేంద్రుడు', 'మాయలోడు'. కేవలం ఆరు నెలల వ్యవధిలో విడుదలైన ఈ రెండు చిత్రాలకీ దాదాపుగా ఒకే టీమ్ పనిచేయడం విశేషం. ఈ రెండు సినిమాల్లోనూ సౌందర్య నాయికగా నటించగా.. మనీషా ఫిల్మ్స్ పతాకంపై కె. అచ్చిరెడ్డి నిర్మించారు. అలాగే దివాకర్ బాబు సంభాషణలు సమకూర్చగా, శరత్ ఛాయాగ్రహణం అందించారు. కె. రామ్ గోపాల్ రెడ్డి ఎడిటర్ గా పనిచేశారు. అదేవిధంగా కోట శ్రీనివాస రావు, బాబూ మోహన్, బ్రహ్మానందం, అలీ, గుండు హనుమంతరావు, శ్రీలక్ష్మి వంటి ప్రముఖ నటులు ఈ రెండు సినిమాల్లోనూ సందడి చేశారు.
కాగా, రాజేంద్ర ప్రసాద్ - ఎస్వీ కృష్ణారెడ్డి కాంబినేషన్ లో వచ్చిన రెండో చిత్రమైన 'మాయలోడు' (1993) ఆగస్టు 19తో 30 వసంతాలు పూర్తిచేసుకుంటోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆ సినిమా విశేషాల్లోకి వెళితే..
* 'రాజేంద్రుడు - గజేంద్రుడు' ఏనుగు సెంటిమెంట్ తో రూపొందితే.. 'మాయలోడు' చైల్డ్ సెంటిమెంట్ తో తెరకెక్కింది.
* ఇందులో హాస్యనటుడు బాబూ మోహన్, సౌందర్యపై చిత్రీకరించిన "చినుకు చినుకు అందెలతో" అనే వాన పాట అప్పట్లో ఓ సంచలనం. ఈ పాటకి వచ్చిన స్పందన చూసి.. తన దర్శకత్వంలోనే తెరకెక్కిన 'శుభలగ్నం' (1994) కోసం అలీ, సౌందర్యపై రీమిక్స్ చేశారు ఎస్వీ కృష్ణారెడ్డి. రెండు సినిమాల్లోనూ ఈ సాంగ్ ఓ ఎస్సెట్ గా నిలిచింది.
* 'ఉత్తమ బాలనటి' (బేబి నిఖిత), 'కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా'.. ఇలా రెండు విభాగాల్లో 'మాయలోడు' నంది పురస్కారాలు అందుకుంది.
* ఆరు పాటల ట్రెండ్ నడుస్తున్న ఆ సమయంలో.. 'రాజేంద్రుడు - గజేంద్రుడు' తరహాలోనే 'మాయలోడు'లోనూ ఐదు పాటలతో సరిపెట్టారు ఎస్వీకే. రెండు ఆల్బమ్స్ కూడా మ్యూజిక్ లవర్స్ ని భలేగా ఆకట్టుకున్నాయి.