English | Telugu
రవితేజ 'బలాదూర్'కి 15 ఏళ్ళు.. 'విక్రమార్కుడు' జోడీ రిపీట్!
Updated : Aug 14, 2023
సంచలన చిత్రం 'విక్రమార్కుడు'(2006)లో జంటగా ఆకట్టుకున్నారు మాస్ మహారాజా రవితేజ, స్టార్ బ్యూటీ అనుష్క. కట్ చేస్తే.. ఆ సినిమా విడుదలైన రెండేళ్ళకి మరో చిత్రంతో అలరించే ప్రయత్నం చేశారు. 'బలాదూర్' పేరుతో తెరకెక్కిన ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ సురేశ్ ప్రొడక్షన్స్ నిర్మించగా.. 'కలిసుందాం.. రా!' ఫేమ్ ఉదయ్ శంకర్ తెరకెక్కించారు. సూపర్ స్టార్ కృష్ణ ఇందులో రవితేజకి పెదనాన్నగా నటించగా.. చంద్రమోహన్, సునీల్, ప్రదీప్ రావత్, బ్రహ్మానందం, సుమన్ శెట్టి, పరుచూరి వెంకటేశ్వర రావు, గుండు హనుమంత రావు, ఆహుతి ప్రసాద్, ఎల్బీ శ్రీరామ్, చలపతిరావు, సత్యం రాజేశ్, సుమిత్ర, భార్గవి ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు.
కథాంశం విషయానికి వస్తే.. చంటికి (రవితేజ)కి నాన్న పురుషోత్తం (చంద్రమోహన్) కంటే పెదనాన్న రామకృష్ణ (కృష్ణ) అంటేనే ఎక్కువ గౌరవం. వ్యక్తిగా మంచివాడైనప్పటికీ.. నాన్న దృష్టిలో మాత్రం బలాదూర్ గా పేరు పొందుతాడు చంటి. మరోవైపు.. 20 ఏళ్ళ క్రితం నాటి ఓ ఘటన కారణంగా రామకృష్ణపై శత్రుత్వం పెంచుకుంటాడు ఉమాపతి (ప్రదీప్ రావత్). అందుకే.. రామకృష్ణపై పగతీర్చుకోవడానికి సరైన సమయం కోసం వేచిచూస్తుంటాడు. ఇలాంటి తరుణంలో.. చంటి కొన్ని అపార్థాల వల్ల ఇంటి నుంచి బయటికి రావాల్సి వస్తుంది. ఈ క్రమంలో.. రామకృష్ణని టార్గెట్ చేసుకుంటాడు ఉమాపతి. అయితే, చంటి రహస్యంగా ఉమాపతి ఎత్తుల్ని చిత్తు చేస్తాడు. తిరిగి కుటుంబ సభ్యులకు దగ్గరవుతాడు.
పాటల విషయానికి వస్తే.. కె.ఎం. రాధాకృష్ణన్ స్వరాలు సమకూర్చిన ఈ సినిమాకి చంద్రబోస్, అనంత శ్రీరామ్, పెద్దాడమూర్తి సాహిత్యమందించారు. "అందమైన", "నువ్వు కొంచెం", "గుండెల్లో ఇల్లుంది", "రంగు రంగు", "ఎటు పోదాం", "తెల్ల చీర" అంటూ సాగే పాటలు ఆకట్టుకున్నాయి. 2008 ఆగస్టు 14న విడుదలైన బలాదూర్.. నేటితో 15 వసంతాలు పూర్తిచేసుకుంది.