Read more!

English | Telugu

'కేజీఎఫ్ 2' హిందీ వెర్ష‌న్‌.. 400 కోట్లు నాటౌట్‌!

 

హిందీలో 'కేజీఎఫ్ చాప్టర్-2' కలెక్షన్ల తుఫాన్ కొనసాగుతూనే ఉంది. య‌శ్ హీరోగా ప్ర‌శాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ తాజాగా రూ. 400 కోట్ల క్లబ్ లో చేరింది. ఈ ఫీట్ సాధించడానికి 'బాహుబలి-2'కి 12 రోజులు పడితే 'కేజీఎఫ్-2'కి 23 రోజులు పట్టింది. సౌత్‌లో నిర్మాణ‌మై, హిందీలో డ‌బ్బింగ్ అయ్యి, రూ. 400 కోట్ల క్ల‌బ్బులో చేరిన రెండో సినిమాగా 'కేజీఎఫ్-2' రికార్డు పుట‌ల్లోకి ఎక్కింది.

శుక్ర‌వారం ఈ సినిమా హిందీ వెర్ష‌న్ రూ. 3.85 కోట్ల నెట్‌ను సాధించింది. దీంతో ఈ మూవీ వ‌సూళ్లు రూ. 401.80 కోట్ల‌కు చేరుకున్నాయి. ఒక‌వైపు ఐపీఎల్ 2022 కొన‌సాగుతున్నా, ఇంకో వైపు ప్ర‌తి వారం కొత్త సినిమాలు వ‌స్తూ వున్నా 'కేజీఎఫ్ 2' హిందీ వెర్ష‌న్ అప్ర‌తిహ‌తంగా వ‌సూళ్ల‌ను సాధిస్తూనే ఉండ‌టం విశేషం.

ఈ వీకెండ్ కూడా ఈ మూవీకి మంచి వ‌సూళ్లు వ‌స్తాయ‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. ప్ర‌పంచ‌వ్యాప్తంగా చూస్తే, రూ. 1120 కోట్ల గ్రాస్ మార్క్‌కు ఈ సినిమా చేరువైంది. ఇప్ప‌టికే ఈ మూవీ రూ. 1119.50 కోట్ల గ్రాస్‌ను సాధించింది. దీంతో మోస్ట్ ప్రాఫిట‌బుల్ మూవీస్‌లో ఒక‌టిగా 'కేజీఎఫ్ 2' నిలిచింది.

సంజ‌య్ ద‌త్‌, ర‌వీనా టాండ‌న్‌, శ్రీ‌నిధి శెట్టి, ఈశ్వ‌రీ రావు, రావు ర‌మేశ్‌ కీల‌క పాత్ర‌లు చేసిన ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ను ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ‌ను సాధించి సౌత్ ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీ కీర్తిని మ‌రింత పెంచింది.