Home » Rasi Phalalu » వృశ్చికరాశి రాశిఫలాలు 2015

వృశ్చికరాశి -  విశాఖ 4 (తో)
        అనూరాధ 1,2,3,4(నా,నీ,నూ,నే), జ్యేష్ఠ 1,2,3,4 (నో,యా,యి,యు)
   ఆదాయము 14  వ్యయం 14 రాజపూజ్యం 3 అవమానం
1

 

ఈ రాశివారికి గురువు వత్సరాది 14.7.15 అనగా అధిక ఆషాఢ బ.త్రయోదశి మంగళవారము వరకు 9వ స్థానమున లోహమూర్తిగా యుండును. తదుపరి వత్సరాంతము 10వ స్థానమున లోహమూర్తిగానే యుండును. శనివత్సరాది వత్సరాంతము 1వ స్థానమున లోహమూర్తిగానే యుండును. రాహు, కేతువులు వత్సరాది 29.1.16 అనగా పుష్య బ.పంచమి శుక్రవారం వరకు రాహువు 11వ స్థానమున కేతువు 5వ స్థానమున తామ్రమూర్తులై ఉందురు. తదుపరి వత్సరాంతము రాహువు 10వ స్థానమున కేతువు 4వ స్థానమున సువర్ణమూర్తులై యుందురు.

    ఈ విధమైన గ్రహస్థితిని పరిశీలించి చూడగా జన్మమందు శని సంచారము వలన చికాకులు ఉన్ననూ జులై 14వరకు బృహస్పతి అనుకూలత. జనవరి వరకు రాహువు అనుకూలత ఇత్యాది యోగము చేత ఏలినాటి శని ప్రభావము అంతగా ఉండదు. ముఖ్యముగా ఏలినాటి శని గురించి ఎక్కువగా భయము చెందనవసరములేదు. సదాచారము, భగవత్‌ ప్రార్థన ద్వారా శని వ్యతిరేక ప్రభావము తగ్గును. తనపై తనకు ఒక రకమైన నమ్మకము లేకపోవుట. ఆత్మ విశ్వాసము తగ్గుట వలన లేని సమస్యను ఉన్నట్లుగా భ్రమించి బాధపడే అవకాశము గలదు. ఊహలు, ఆలోచనలు సరియైన మార్గములో ఉన్ననూ వాటిని అమలు పరచుటలో సఫలముకాకపోవచ్చును. స్థిరాస్థికి, చరాస్థులకు కొంత భద్రత లోపించవచ్చును. స్థిరాస్థులు అమ్మకానికి పెట్టాలని సలహాలు ఇచ్చేవారుంటారు. తస్మాత్‌ జాగ్రత్త, క్రొత్తది సంపాదించుకున్నా ఉన్నది కాపాడుకోవడము ఉత్తమము కదా! మీకు ఉన్న ఆర్థిక చికాకులు ఏ మాత్రము ఆలోచించకుండా పైకి మాత్రము కోటీశ్వరులుగా తమ ప్రవర్తన ఉండడము వలన మీ బాధలు అర్థం చేసుకునేవారి ఉండరు. తమ సంతానము యొక్క వివాహార్థము ప్రయత్నాలు ఆరంభము చేస్తారు. ఎంత కష్టపడి ఎన్ని రకాలుగా ఆలోచనలు చేసినా ఆర్థికపరమైన వృద్ధి కనపడకపోవడం చిరాకు కల్గిస్తుంది. జీవిత భాగస్వామితో అకారణ కలహాలు ఏర్పడే అవకాశము గలదు. తమకు తెలిసిన సత్యాన్ని నిర్భయంగా వ్యక్తపరచలేని స్థితి ఏర్పడవచ్చును. తాము ఎంత అంకితభావంతో ఉన్ననూ, ఎదుటివారు గుర్తించకపోవడం బాధ కల్గిస్తుంది. కొన్ని సందర్భములలో ఆత్మ విశ్వాసము లోపించవచ్చును. మానసిక నిరాశ, నిస్పృహ వెంటాడుతాయి. ఆత్మ బంధువులకు అనారోగ్య సూచనలు కలత చెందించును. ఆరోగ్య సమస్యలు ముఖ్యముగా ఎముకలు, రక్త సంబంధ  సమస్యలు, కీళ్ళ నొప్పులు విపరీతముగా బాధించును. బృహస్పతి అనుకూలత. మరియు తమ కులదేవతారాధన వల్ల క్లిష్టమైన సమస్యల నుండి ఉపశమనము లభించును. విపరీతము మంచి నీళ్ళ వలే ధనవ్యయము సంభవించును. ప్రభుత్వానికి చెల్లించవలసిన పన్నులు సకాలములో చెల్లించండి. లేనిచో అనవసర సమస్యలకు మీరే స్వాగతము పలికెదరు. దీనికి కారణం మతిమరుపు, వాయిదా వేసే తత్వము కావచ్చును. మీరు సామాజికంగా, ఆర్థికంగా ఎదగకుండా కుతంత్రాలు చేస్తారు. తాంత్రిక బాధలకు లోనవుతారు.

    ఉద్యోగస్తులకు పని తీవ్రత, వత్తిడి పెరుగవచ్చును. కొన్ని సందర్భాలలో సోమరితనము, నిర్లక్ష్యము పెరుగవచ్చును. తమను అన్ని విధాలుగా ఉపయోగించుకొని తమ తెలివి తేటలను వాడుకొని, మీకు మాత్రము ఏ మాత్రం గుర్తింపులేకపోవడం కొంత బాధ కల్గిస్తుంది. రావలసిన ప్రమోషన్లుగాని, ఇంక్రిమెంట్లుగాని వచ్చినా మీకు పరిపూర్ణముగా సంతృప్తి ఉండకపోవచ్చును. ఇప్పటి మీ కృషి భవిష్యత్తులో ఉపయోగిస్తారు. మీ విద్యుక్త ధర్మాన్ని మీరు నిర్వహించండి. ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలున్ననూ ఎక్కువగా కంగారు పడతారు. రావలసిన ధనం ఒకేసారి కాకుండా అంచెలంచెలుగా చేతకందుతుంది. వంశపారంపర్య వృత్తులు, ఆస్తుల విషయంలో సత్ఫలితాలు పొందుతారు. ప్రభుత్వపరంగాగాని, ఏదేని పేరుపొందిన సంస్థల ద్వారాగాని గుర్తింపు, అవార్డులు లభించవచ్చును. సోదరుల నుండి పరిపూర్ణ సౌఖ్యము లభిస్తుంది. పూర్వీకుల ఆస్తులు సంక్రమించుట, ఆధ్యాత్మిక సాంప్రదాయపరమైన గుర్తింపువచ్చుట, ఉపాసనా బలము సిద్ధించుట, గొప్ప పండితునిగా గుర్తింపువస్తుంది. వ్యవసాయ లాభాలు, ఉద్యోగములో ప్రమోషన్లు, ఉన్నత విద్యలకై సదవకాశాలు మొదలైన ఫలితాలు కూడా మీకు లభించవచ్చును. విలువైన వస్తువులుగాని, ధనముగాని జాగ్రత్తగా దాచుకునే ప్రయత్నము చేయండి. లేదా బ్యాంకులను ఉపయోగించుకోవాలి. చోరభయం కలదు. సంవత్సర ఉత్తరార్థము ఉద్యోగములో ఒకింత అసంతృప్తి స్థానచలనము, మీ పరపతిని, ఖ్యాతిని ప్రతిష్టను భంగపరచాలనే ప్రయత్నాలు జరుగవచ్చును. వాహనములు నడుపునపుడు జాగ్రత్తలు మాత్రం ఏ మాత్రం మరువకూడదు. ఊపిరితిత్తులు, శ్వాససంబంధ సమస్యలు, రక్త దోషములు బాధించవచ్చును. ఔషధసేవనము తప్పకపోవచ్చును. వృత్తిపైనా, ఉద్యోగముపైనా ఆసక్తితగ్గుట, కేవలం బాధ్యతగా పనులు నిర్వర్తించుట సంవత్సరం చివరలో జరుగవచ్చును. ప్రయాణాలపై అనాసక్తి ఏర్పడుట, సాంఘికసేవా కార్యక్రమాలు తరుచుగా చేస్తారు. ఏదేని ఒక సేవా సంస్థకు మీ మార్గదర్శనము అవసరమగుట సంభవించవచ్చును. విదేశీ ప్రయత్నాలు రెండవ ప్రయత్నంగా లాభించవచ్చును. విదేశాలలో ఉన్న మీ స్నేహితులు శ్రేయోభిలాషుల వల్ల ధనసహాయము లభించవచ్చును. అతి ప్రయాసపైన స్థిరాస్థిని వృద్ధి చేసుకునే ప్రయత్నము చేస్తారు. ఈ సం||ము మీలో  ప్రధాన లోపము ప్రతి పనిని వాయిదా వేయటము, భక్తి మార్గ పయనము. బంగారు ఆభరణములలో పెట్టుబడి పెట్టాలనే ఆలోచనలు రావడము. షేర్‌ మార్కెట్‌ రంగములో ప్రయాణించుట, మీలో కార్యసామర్థ్యము ఉన్న దానిని గుర్తించి ఉపయోగించుకోలేకపోవుట ఒక సమస్యగా మారుతుంది. అనాలోచితంగా కొంత ధనాన్ని సద్వినియోగించలేకపోవడం, ప్రభుత్వ పరంగా అందవలసిన ప్రయోజనాలు వాయిదాల రూపంలో అందుట, నిర్ణయం తీసుకోవడంలో ఒకరి సహాయం అవసరము, వృత్తి ఉద్యోగములో ఉన్నతి. సంవత్సర పూర్వార్ధంలో లభించును. విదేశీ అవకాశాలు లభించును. సంతానప్రాప్తి, వివాహ ప్రాప్తి, కొందరికి ఇటు తల్లిదండ్రులను, అటు ధర్మపత్నిని సమన్వయ పరచలేక సతమతమయ్యే అవకాశాలు గలవు. అకాల భోజనము, ఉదర సంబంధ సమస్యలు. నేత్ర సంబంధ చికాకులు, కాలేక సంబంధ వికారాలు, నీచ జన సహవాసాలు, అన్యస్త్రీ పరిచయాలు, స్త్రీలకు ముఖ్యంగా గర్భసంబంధమైన చికాకులు బాధించినా సరైనా వైద్యసలహాల చేత రోగ నివృత్తి చేసుకుందురు. తక్కువ శ్రమంతో ఎక్కువ లాభాన్ని పొందాలనే ఆలోచనలు చేస్తారు. జూదములు, లాటరీలకు దూరంగా ఉండండి. విద్యాపరంగా కొంత ఆదాయము లభించును. పాఠశాలలు, కళాశాలలు నడుపువారికి అనుకూలము, ఇంట్లో అగ్నిసంబంధ పనులుచేయునపుడు జాగ్రత్త. ఆధ్యాత్మిక విద్యలపై ఆసక్తి, ప్రవేశము లభించవచ్చును. తండ్రిగారి ఆరోగ్యము కొంత కలవరపెట్టవచ్చును. విద్యార్థులు ఊహలలో విహరింపక వాస్తవంలో జీవించండి. ప్రతి క్షణాన్ని ఉపయోగించుకోవాలి. పూర్వార్ధంలో పోటీ పరీక్షలలో చక్కని ఫలితము కలుగుతుంది. తాము కోరుకున్న కళాశాలగాని, కోర్చుగాని పొందగలరు. నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి. విదేశాలలో ఉన్నవారికి శాశ్వతనివాస యోగ్యత లభించును. మొత్తం మీద ఈరాశి వారలకు శని, కేతు ప్రతికూలంగా ఉన్ననూ రాహు, గురువు కొంత అనుకూలత వల్ల లభించవలసిన ఫలితం లభిస్తుంది. కాని అది చేతికందే వరకు ఆరాటము, పోరాటము, నమ్మకము లేకపోవుట జరుగును. ప్రతి విషయాన్ని ఒకటికి రెండుసార్లు ఆలోచించి చేయాలి. రాజకీయ నాయకులకు ప్రత్యేక గుర్తింపు రావచ్చును. ఏలినాటి శని ద్వితీయ భ్రమణము వారికి వృద్ధి కలుగును. తృతీయ భ్రమణము వారికి ఒకింత ఆరోగ్య సమస్యలు తమ సంతానము యొక్క ఉన్నత విద్యలకై ధనాన్ని ఖర్చు చేయవలసిన స్థితి. స్థానచలనము కలిగే సూచనలు. తనవారు ఒకచోట తాము మరొక చోట ఉండవలసిన స్థితి. చాలా వరకు సమస్యలను పరిష్కరించుకోవడానికి సమయం గడుస్తుందని నిరాశపడతారు. నూతన గృహ నిర్మాణానికి కొంత ప్రయాసచే పూర్తి చేస్తారు. అంచనాలను మించి ధనం ఖర్చు అయ్యే అవకాశం గలదు. ఎవరి ద్వారానైతే విశేష ఫలితాలని ఆశించారో వారే ముఖం చాటు వేయడం, ఊహించని వారు సహాయ మందించడం వంటి సంఘటనలు ఏర్పడతాయి. దైవలీలలు అర్ధం కావని విశ్వసిస్తారు. చాలా విషయాలను రహస్యంగా ఉంచి మీరేమిటో నిరూపిస్తారు. స్వార్థం పెంచుకోవాలని నిర్ణయించుకుంటారు. దాంపత్య సమస్యలు ఉత్పన్నమయినా పరిష్కారం లభిస్తుంది. సంతానానికి శాశ్వత పరిష్కార దిశగా వారి అభివృద్ధి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. కోర్టు తీర్పులు ఎటూతేలక అసహనాన్ని కల్గించవచ్చును. మొత్తం మీద ఈ రాశి వారికి శుభాశుభ మిశ్రమ ఫలితాలు. ఏలినాటి శని ప్రభావం కొంత వరకు ఉంటుంది. గోసేవ, సుందరకాండ పారాయణం, అంజనేయస్వామికి ఆకుపూజ, దేవతా వృక్షాలను పెంచడం మేలు చేస్తుంది.