Home » Rasi Phalalu » మిధునరాశి రాశిఫలాలు 2015

మిధునరాశి - మృగశిర 3,4(కా,కి)
ఆర్ద్ర 1,2,3,4(కు,ఖం,ఙ్ఞ,చ్ఛ)-పునర్వసు 1,2,3(కె,కో,హ)
ఆదాయము 11  వ్యయం 5 రాజపూజ్యం 2 అవమానం
2

 

ఈ రాశివారికి గురువు వత్సరాది 14.7.2015 అనగా అధిక ఆషాఢ బ.త్రయోదశి మంగళవారము వరకు ద్వితీయస్థానమున రజితమూర్తియై ఉండును. తదుపరి వత్సరాంతము తృతీయస్థానమున సువర్ణమూర్తియై ఉండును. శని వత్సరాది వత్సరాంతము షష్ఠస్థానము (6)న రజిత మూర్తియై ఉండును. రాహు, కేతువులు 29.1.2016 అనగా పుష్య బ. పంచమి శుక్రవారము వరకు రాహువు 4వ స్థానమున, కేతువు 10వ స్థానమున లోహ మూర్తులై ఉందురు. తదుపరి వత్సరాంతము రాహువు 3వ స్థానము నందు, కేతువు 9వ స్థానము నందు లోహమూర్తులుగానే ఉందురు.
   
ఈ విధమైన గ్రహస్థితి పరిశీలించగా సంవత్సరము పూర్వార్థము అన్ని విధాలుగా యోగదాయకముగా ఉంటుంది. చాలా కాలంగా మీరు అనుభవిస్తున్న అవస్థలనుండి ఉపశమనము లభించే అవకాశము గలదు. జీవితములో అనేకమైన అనుభవాలు, ఉచితానుచితాలు తాము చూసిన, నమ్మిన మనుష్యులు మొదలైన అనేక విషయాలపై ఒక స్థిరమైన పారదర్శకమైన ఆలోచన దారి మీకు కనపడుతుంది. గోముఖ వ్యాఘ్రములను గుర్తిస్తారు. వారిని ద్వేషంతో కాకుండా మంచితనంతో దూరం ఉంచాలని నిర్ణయిస్తారు. జీవితాశయము నెరవేర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. దాదాపుగా సఫలమవుతారు. ఊహలలో విహరించడం మానుకొని తమ, పర భేదము తెలుసుకొని, హోదా ధనంతో మంచితనాన్ని మంచి స్నేహాన్ని పొందలేమని గ్రహిస్తారు.
   
స్థిరాస్తిని వృద్ధి చేస్తారు. సమాజంలో గతంలో నష్టపోయిన పరపతిని ప్రతిష్టను తిరిగి పొందుతారు. ఎవరైతే గతంలో అవమానపరిచారో వారు నిజము తెలుసుకొని పశ్చాత్తాప పడతారు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. మానసిక ఆనందముచే చక్కని స్థిర నిర్ణయాలు తీసుకుంటారు. దాంపత్య సౌఖ్యము ఏర్పడుతుంది. గతంలో ఉన్న అపోహలు, అవమానాలు సమసిపోతాయి. ఆస్తులు కొనుగోలు చేస్తారు. ప్రస్తుతమున్న ఆదాయానికి మరొక్క ఆదాయము తోడవును. తెలివితో చాకచక్యంతో శతృవులపై ఆధిపత్యాన్ని సాధిస్తారు. వారు తీసుకున్న గోతిలో వారే పడేలా ఎత్తుకు పైఎత్తులు వేస్తారు. అవివాహితులకు చక్కని వివాహ సంబంభాలు నిశ్చయము అవుతారు. మానసిక సంతృప్తి ఏర్పడుతుంది. సంతానప్రాప్తి కలుగుతుంది. పుత్రసంతాన ప్రాప్తి సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న వారి పరిచయాలు ఏర్పడుతాయి. మీకు ఉన్నత గౌరవాలు స్థాయి దక్కుతుంది. విలువైన విలాస వంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారంలో అనేక రకాలైన క్రొత్త మార్గాలు అవలంభించి వ్యాపారంలో లాభాలు సాధిస్తారు. నష్టాలలో ఉన్న వ్యాపారాన్ని లాభాల బాటలో నడిపిస్తారు. సమాజంలో ముఖ్యమైన అనవసరమైన  కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తారు. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ఉన్నతస్థాయి అధికారుల ప్రశంసలు పొందుతారు. అదనపు, భాద్యతలు నిర్వహించవలసి వస్తుంది. పని తీవ్రత, వత్తిడి పెరిగే అవకాశము గలదు. ఉద్యోగంలో ఉన్నతస్థాయికి (ప్రమోషన్‌) ఎదుగుతారు. నూతన వాహనాలు సమకూర్చుకుంటారు. చరాస్తులు వృద్ధి పరుచుకుంటారు. ప్రేమ వివాహాలు సఫలము కావచ్చును. నూతనంగా వ్యాపారపరంగా భూములపై బంగారంపై లేదా షేర్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెడతారు. తమ సంతానానికి వారి భవిష్యత్తుకై పటిష్టమైన ప్రణాళికను సిద్ధంచేసి అమలు పరుస్తారు.
   

6వ స్థానంలో ఉన్న శని ప్రభావము వలన అనేక విషయాలలో మీదే పై చేయి అవుతుంది. గతంలో విమర్శించిన వారు ప్రశంసిచడం చూసి ఆశ్చర్యపడతారు. మీ అంచనాలకు మించి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. శతృవులు స్తబ్ధులై ఉంటారు. సుఖ, సౌఖ్యాలు పరిస్థితులను మీకు అనుకూలంగా మలుచుకుంటారు. జీవిత భాగస్వామితో చక్కని అనురాగ పూరితమైన వాతావరణం ఏర్పడుతుంది. శయ్యాసౌఖ్యము లభిస్తుంది. జనాకర్షణ పెరుగుతుంది. ప్రభుత్వపరంగా మీకు అందవలసిన ప్రయోజనాలను అందుకుంటారు. రాజకీయ లబ్ధి, పరపతి ఏర్పడుతుంది. నూతన గృహనిర్మాణానికై మీరు చేయు కృషి ఫలిస్తుంది. మీ వృత్తికి తగిన మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. కళాకారులకు చక్కని అవకాశాలు లభిస్తాయి. విలాసవంతమైన ఖరీదైన జీవితము గడిపే అవకాశాలు లభిస్తాయి. నూతన వాహనాలు కొనుగోలు చేసే అవకాశము గలదు. వ్యాపార భాగస్వాములపై మీదే పై చేయిగా ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలనే ప్రయత్నము సఫలమౌతుంది. తనకు మాలిన ధర్మం చేయరాదని శాస్త్ర వచనం ఈ విషయాన్ని అక్షరాలా పాటించండి. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంటా ఉంటాయి. గతంలో మధ్యలో వదలివేసిన పనులను మళ్ళీ ఆరంభిస్తారు. గతంలోని మీ ప్రవర్తనకు ప్రస్తుత ప్రవర్తనకు తేడాను చూసి మీరే ఆశ్చర్యపడతారు. గతంలో ఏర్పడిన కోర్టు వివాదాలు, కేసులు మొదలైన వాటిని సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకుంటారు. అత్యుత్సాహంతో పేరు ప్రతిష్టల కొరకు వెనకా, ముందు ఆలోచించక వృధాగా ధనాన్ని దుర్వినియోగపరిచే అవకాశాలున్నాయి. నూతన ఉద్యోగంలో కొంత పని వత్తిడి, అసంతృప్తి ఉంటుంది. చేయక తప్పని పరిస్థితి ఉంటుంది.
   

అయితే దాదాపుగా శుభ ఫలితాలు కనపడుచున్ననూ రాహు, కేతువుల ప్రభావము కొంత వరకు కనిపించు చున్నది. సమయము బాగున్నదని అత్యుత్సాహము మితిమీరిన ఆత్మ విశ్వాసము పనికిరాదు. ఈ విధమైన ప్రవర్తన ఎదుటివారికి అవకాశముగా మారగలదు. మధ్య మధ్యలో ఆరోగ్య విషయంలో ఏదో తెలియని అభద్రత ఏర్పడే పరిస్థితులు కనపడుతున్నవి. ఉదర సంబంధ సమస్యలు బాధించే అవకాశము గలదు. అకాల భోజనము విషయంలో తగు జాగ్రత్తలు అవసరము. మానసికముగా తరుచూ చికాకులు ఎదురుకావచ్చును. తరుచుగా మధ్య మధ్యన చంచల మనస్సు ఏర్పడవచ్చును. ధైర్యము తగ్గుట మొదలైన చికాకులు ఏర్పడిననై తమ గాంభీర్యాన్ని మాత్రము తగ్గనీయరు. విద్యార్థులు జాఢ్యాన్ని వదిలి కృషిచేయండి. పోటీ పరీక్షలలో చక్కని ఫలితాలు పొందుతారు. శ్రీ హయగ్రీవ స్తోత్రము పారాయణము చేయండి. ఊహించని విధంగా తమ మేధా సంపత్తి, జ్ఞాపక శక్తి వృద్ధి చెందుతుంది. ఉద్యోగ అవకాశములు గలవు. జన్మ స్థలాన్ని విడచి దూరప్రాంతములలో నివసించే అవకాశము. నూతన కార్యములు ఆరంభించే ముందు శ్రేయోభిలాషుల సలహామేరకు నడుచుకునుట మంచిది. ఎలక్ట్రానిక్‌ మొదలైన సాంకేతిక రంగములో ఉన్న వారికి తమ ప్రతిభకు తగిన వ్రతఫలం లభించును. ఉపాధ్యాయ వృత్తి ప్రభుత్వ రంగములో ఉద్యోగము చేయువారికి అనుకూలము. చాలాకాలంగా మీకు రావలసిన బకాయిలు లేదా స్థాయి పెరిగే ఉత్తర్వుల అందుకుంటారు. సంతానము యొక్క ఆరోగ్య విషయంలో ఒకింత జాగ్రత్త అవసరం. ఒక సమయంలో వైద్యుణ్ణి సంప్రదించుట, ఔషధ సేవనం తప్పకపోవచ్చును. ఒకానొక సందర్భంలో విద్యావిఘ్నము కలిగే పరిస్థితులు ఎదురవుతాయి. అయిననూ తమ సమయస్పూర్తి అచంచల దీక్ష. ఒక శ్రేయోభిలాషి సహకారము సలహాచేత ముందడుగు వేస్తారు. వాహనాలు నడుపునపుడు ఒకింత జాగ్రత్త అవసరం. సంవత్సర ఉత్తరార్థంలో అనూహ్యంగా ధనము చేతికందుతుంది. వివాహప్రాప్తి కోరిన వారితో వివాహము. గతంలో ఉన్న వివాహపరమైన వివాదాలు తీరుతాయి. తమ లక్ష్యాలను చేరుకుంటారు. దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనము లభిస్తుంది. బంధు వర్గమువారి సహాయ సహకారాలు అందుకుంటారు. తమ సోదరుల విద్యా అవకాశాలు మెరుగుపడతాయి. విద్యా విషయమై  తమ ప్రయత్నాలు సఫలమవుతాయి. ముద్రణ, ప్రమాణాలు మొదలైన వాటిలో లాభాలు చూస్తారు.ధైర్యము పెరుగుతుంది. సంప్రదాయేతర స్నేహాలు, స్త్రీ పురుషుల విషయంలో తమ ధర్మాన్ని కాదని ఇతర ధర్మాలు స్నేహాలు చేస్తారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు అశ్రద్ధ చేయడం చెల్లించండి. వృత్తిలో కొంత అసంతృప్తి కేతువు స్థితి వల్ల ఏర్పడును. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారికి అదాయ సూచనలు కలవు. తమకులము లేదా మతము వారితో వివాదాలు అకారణ ఆవేశాలకు లోనుకాకండి. అహంభావి అనే ముద్రపడే అవకాశం గలదు. విషజంతు ప్రమాదము, విదేశాలలో ఉన్నవారు అచట చట్టపరమైన వివాదాలు ఎదుర్కొనుట సంభవించవచ్చు. తండ్రిగారి ఆరోగ్య విషయంలో అజాగ్రత్త పనికిరాదు. అగ్ని, జల సంబంధ విషయాలలో ఒకింత జాగ్రత్త అవసరం మొత్తం మీద ఈ రాశివారలకు శుభాలు ఎక్కువగా  ఉన్నాయి. కొద్దిగా కొన్ని విషయాలలో జాగ్రత్త వహించినా ఇంకా ఉత్తమ ఫలితాలు పొందుతారు. శ్రీరామ రక్షా స్తోత్రం పారాయణం సర్వదారక్ష. రాహు, కేతు, గురు జపధ్యానం చేయుట గోసేవ వికలాంగులకు సహాయము, వృద్ధులకు సహకారం నిత్యం శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రదక్షిణ మేలు చేయును.