మకర రాశి - ఉ.షా 2,3,4 (భో,జా,జి)
శ్రవణం 1,2,3,4 (జూ,జె,జో,ఖ),ధనిష్ఠ 1,2 (గా,గీ)
ఆదాయము 5 వ్యయం 2 రాజపూజ్యం 2 అవమానం 4
ఈ రాశివారికి గురువు వత్సరాది 14.7.15 అనగా అధిక ఆషాఢ బ.త్రయోదశి మంగళవారము వరకు 7వ స్థానమున రజితమూర్తియై యుండును. తదుపరి వత్సరాంతమున 8వ స్థానమున సువర్ణమూర్తియై ఉండును. శని వత్సరాది వత్సరాంతము 11వ స్థానమున రజితమూర్తియై ఉండును. రాహుకేతువులు వత్సరాది 29.1.16 అనగా పుష్య బ.పంచమి శుక్రవారము వరకు రాహువు 9వ స్థానమున కేతువు 3వ స్థానము సువర్ణమూర్తులై యుందురు. తదుపరి వత్సరాంతము రాహువు 8వ స్థానమున, కేతువు 2వ స్థానమున రజితమూర్తులై యుందురు.
ఈ విధమైన గ్రహస్థితి పరిశీలించి చూడగా సంవత్సరము పూర్వార్థము జులై 14 వరకు చాలా అనుకూలముగా ఉన్నది. చాలా రోజులుగా ఆశలు వదలుకున్న పనులు అనూహ్యముగా సఫలమయ్యే అవకాశముగలదు. గతంలో ఏర్పడిన అనేక సమస్యల నుండి సునాయాసముగా బయటపడే అవకాశము గలదు. రావలసిన మొండి బకాయిలు చేతికందే అవకాశము గలదు. శతృవులు సైతం తమతో మైత్రి చేయడానికి ఆసక్తి చూపుతారు. తాము చేసిన పొరపాటును తెలుసుకొని పశ్చాత్తాపపడతారు. శ్రమకు తగిన ఆదాయం చేతి కందుతుంది. బిపి, షుగర్ వ్యాధుల పట్ల నిర్లక్ష్యం అశ్రద్ధపనికిరాదు. ఆత్మ స్థైర్యము పెరుగుతుంది. స్ధిరాస్థులు వృద్ది చేసుకుంటారు. వివాదములో ఉన్న ఆస్తులను పరిరక్షించుకుంటారు. దీర్ఘకాలికంగా బాధ పడుచున్న వ్యాధులకు వ్యాధి నిర్ధారణ జరిగి సరైన వైద్య సేవలు లభించును. చిన్న చిన్నసమస్యలు వేధించినను, మీ సమయస్ఫూర్తి చాకచక్యముచే వాటిని పరిష్కరించుకుంటారు. నూతన పనులకు శ్రీకారము చేస్తారు. ధార్మిక, సాంస్కృతిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ వంతు సేవ చేస్తారు. ఎంత మౌనముగా ఉన్నా అనవసరముగా రెచ్చగొట్టెవారు ఎదురు అవుతారు. ఉద్యోగస్థులకు వృత్తిపరమైన సంతృప్తి పెరుగుతుంది. తాము కోరుకున్న చోటికి స్థానచలనము జరిగే అవకాశము గలదు. మీ పై అధికారులు గతముకన్నా ఎక్కువగా ఆదరణచూపడం, మీ అవసరాన్ని గుర్తించడం జరుగుతుంది. తాము తమ విషయానికన్నా ఇతరుల విషయాలపై శ్రద్ధ చూపడం ఇబ్బందికరంగా మారుతుంది. సమాజికంగా పేరు ప్రతిష్ఠ పెరుగుతుంది. బ్యాంకుల ద్వారా ఋణాలు తీసుకొని క్రొత్త వ్యాపారాలు ఆరంభించాలని ప్రయత్నాలు చేస్తారు. వివాహ ప్రాప్తి, అనుకూల దాంపత్యము, అనుకూలవతియైన భార్య లేదా భర్త లభించే అవకాశము గలదు. ఆర్థికంగా విశేషమైన వృద్ధి ఏర్పడుతుంది. జ్ఞానము, ఏది వాస్తవము ఏది అవాస్తవము తెలుసుకునే విచక్షణ ఏర్పడుతుంది. నూతన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. చక్కని ఆరోగ్యము సిద్ధిస్తుంది. శారీరకమైన దారుఢ్యము కలుగుతుంది. తీర్థ యాత్రలు చేస్తారు. పర్వత ప్రాంతాలను సందర్శిస్తారు. ఒకటికి మించి ఆదాయ మార్గాలు ఏర్పడే అవకాశము గలదు. బంధువులు, మిత్రులు మరింత ఆత్మీయ అనురాగాలు పెరిగే అవకాశముగలదు. గతంలో విమర్శించిన వారు ప్రస్తుతం ప్రశంసించడము జరుగుతుంది. మీరు మాత్రము ఏ మాత్రం మార్పు లేకుండా ఉంటారు. సామాజికంగా, రాజకీయంగా ఉన్నత స్థానంలో ఉన్నవారి సహాయసహకారాలు అందుతాయి. స్త్రీ జన సహవాసము, స్త్రీ సౌఖ్యము ఆహార, భోజన లాభము, నూతన వాహనాల కొనుగోలు చేయుట, మధురమైన సంభాషణలు. మీ వాక్కు ఎదుటి వారిని ఆకర్షించుట. భూ వ్యవహారాలలో అనుకూలం, కోర్టు వ్యవహారాలలో విజయాలు, విద్యాభివృద్ధి నూతన అంశాలు, నూతన విద్యా విధానాలు అన్వేషించుట, సమాజంలో బంధువర్గములో పేరు, ప్రఖ్యాతులు సంపాదిస్తారు. అభీష్టములను సిద్ధి చేసుకుంటారు. ఉద్యోగస్తులు చాలాకాలంగా వేచి చూస్తున్న ప్రమోషన్లు అందుకునే అవకాశము గలదు. గతంలో నిరాదరించిన మీ పై అధికారులు మీ సలహాకై మీ దరి చేరతారు. ఇంక్రిమెంట్లు, ఆర్థిక పరమైన వృద్ధి కలుగవచ్చును. అయితే గతం తాలూకు అనుభవాలను దృష్టిలో ఉంచుకొని మీ వ్యక్తిత్వాన్ని ఆంతరింగక విషయాలను కాపాడుకునే ప్రయత్నం చేయండి. పని వత్తిడి ఉన్నా కాని ఆనందంగా మీ విధి మీరు నిర్వర్తిస్తారు. ఆరోగ్యాన్ని మాత్రము అశ్రద్ధ చేయడం పనికిరాదు. నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి గలదు. ఉద్యోగస్తులకు మరొక్క ఆదాయం ప్రారంభం కావచ్చును. లేదా తమ సంతానమునకు ఆదాయం ప్రారంభం కావచ్చును. భావోద్రేకము పెరుగుతుంది. చాలా కాలంగా మిమ్ములను వేధిస్తున్న కోర్టు సమస్యలు తెలివిగా మద్యే మార్గంగా పరిష్కరించు కుంటారు. సమయం అనుకూలంగా ఉన్నప్పుడు ఎక్కువగా కష్టపడి మీరేమిటో నిరూపించాలనే పట్టుదల పెరుగుతుంది. సంతానప్రాప్తి, వివాహప్రాప్తి. బంధువర్గంలో గతంలో మీరు అనుభవించిన అవమానాలకు సరియైన గుణపాఠం చెబుతారు. కళాకారులకు అనుకూలంగా ఉన్నది. స్త్రీలకు సహజంగా అనుభవించే కొన్ని ఆరోగ్య సమస్యల పట్ల జాగ్రత్త అవసరం. విలాసవంతమైన ఖరీదైన వస్తువులు ఖరీదు చేసే అవకాశము గలదు. వాహనప్రాప్తి కలదు. నూతన వ్యాపారములోకి అడుగుపెడతారు. స్త్రీ విభేదాలు గతంలో ఉన్నవి సమసిసోతాయి. ప్రభుత్వ పరమైనటువంటి విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. రాజకీయంగా పరపతి పెరుగుతుంది. పదవులుకూడా లభించవచ్చును. జనాకర్షణ పెరుగుతుంది. కుటుంబ వాతావరణము ప్రశాంతంగా ఉంటుంది. గృహనిర్మాణ యోచన కార్యరూపం దాలుస్తుంది. సంతానము వృద్ధిలోకి వస్తారు. వారి భవిష్యత్తుకై మీరు చేసే కృష్టి సత్ఫలితమిస్తుంది. వారికోసం పటిష్టమైన ప్రణాళికలు రచిస్తారు. భార్యా మూలంగా అనగా అత్తవారింటి నుండి, జీవిత భాగస్వామియొక్క ఆదాయము ద్వారాగాని స్థిరాస్థి పొందే అవకాశముగలదు. యంత్ర, లోహ, వర్తకులు లాభాలను పొందుతారు. బంధుమిత్రుల ద్వారా కూడా సహాయ సహకారం. చక్కని ఆరోగ్యం కాని అకాల భోజనం, ఉదర సమస్యలు బాధించవచ్చును. ఆత్మస్థైర్యము పెరుగుతుంది. స్త్రీ సంతానప్రాప్తి. శతృవుల నుండి కూడా మద్దతు లభించుట, పేరు ప్రతిష్ట పెరుగుట, దాంపత్య సుఖ జీవనమును పొందుతారు. అయితే ఒకానొక సందర్భంలో స్త్రీ చేత వంచింపబడటం. అపనిందలు వచ్చే అవకాశము, ఆదాయ మార్గాలను విసృతం చేస్తారు.
అయితే జులై 14వ తేదీ తరువాత గురువు అష్టమస్థాన స్థితుడు అవడం చేత కొంత జాగ్రత్త అవసరము. అత్యుత్సాహము పనికిరాదు. ఆరోగ్యము జాగ్రత్తగా ఉంచుకోవాలి. వ్యసనాలకు, దురలవాట్లు, దుర్జన సహవాసం దరికి రానీయకండి. తోబుట్టువులతో కలహాలు మనఃస్పర్థలు రాకుండా జాగ్రత్త వహించండి. ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచించడం వలన మానసిక నిరాశ ఏర్పడవచ్చును. పాప కార్యాలపై ఆసక్తి పెరుగవచ్చును. తాంత్రిక విద్యలపై ఆసక్తి పెరుగుట, ప్రేమ విఫలము, భార్య లేదా భర్తకు ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరము. గర్భధారణ కల్గిన స్త్రీలు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. సమాజద్రోహులు పరిచయమయ్యే అవకాశం గలదు. వారిపట్ల జాగ్రత్త అవసరం. స్నేహితులు ప్రస్తుతం అధికంగా వాడుచున్న ఫేస్బుక్, వాట్సప్ల వాడకంలో జాగ్రత్త అవసరం. స్థాన చలనము, నష్టాన్ని కలిగించు వ్యాపారం వైపు అనగా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలని పొందాలని, తక్కువ సమయంలో కోటీశ్వరులవాలనే ఆలోచనల పట్ల అప్రమత్తత అవసరము. దైనందిన జీవితము మరియు నిత్య విధులపై సోమరితనము, వాయిదా తత్త్వము పెరుగుట. ధూమపాన, మద్యపానాలకి దూరంగా ఉండండి నోటి సమస్యలు బాధించవచ్చును. అయితే జులై 14 తరువాత గ్రహస్థితి ముఖ్యంగా గురు, రాహు, కేతు స్థితి అనుకూలము లేకున్ననూ శని 11వ స్థానంలో ఉండుట చేత అనేక సమస్యలు దగ్గరగా వచ్చినవి. మీ యొక్క ఆత్మస్థైర్యము చేత విచక్షణా జ్ఞానము చేత అధిగమిస్తారు. వంశపారంపర్య ఆస్తులు సంక్రమించవచ్చు. కుల విద్యపై ఆసక్తి పెరుగుతుంది. నూతన విద్యలపై ఆసక్తి, ప్రవేశము కలుగవచ్చును. విద్యార్థులకు అనుకూలంగా ఉన్నది. ప్రతిక్షణమును ఉపయోగించుకునే ప్రయత్నము చేయండి. పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. విదేశాలకు వెళ్ళాలనే ప్రయత్నం సం||ర పూర్వార్థంలో సఫలం కావచ్చును. విదేశాలలో ఉన్నవారికి శాశ్వత నివాసయోగ్యత లభించగలదు. తాము కోరుకున్న ప్రదేశానికి స్థానచలనము కలుగవచ్చును. విద్యార్థులు నిత్యం శ్రీహయగ్రీవ స్తోత్రం పారాయణం చేయండి. చక్కని అమోఘమైన మేధాసంపత్తి సమయస్పూర్తి చురుకుదనము పెరుగుతుంది. వ్యాపారస్థులు శ్రీ విష్ణుసహస్ర నామపారాయణం చేయండి. స్త్రీలు శ్రీ కనకధారా స్త్తోత్రపారాయణం, ఉద్యోగస్తులు శ్రీలక్ష్మినృసింహ కరావలంబ స్తోత్రం పారాయణం చేయండి. తీర్ధయాత్రా సందర్శన, ధైర్యసాహసాలు పెరుగుట కలవు. చర్మ సంబంధమైన చికాకులు ఏర్పడవచ్చును. మొత్తం మీద ఈ రాశివారికి ఎక్కువగా అనుకూలంగా ఉంది. మంచి సమయాన్ని పూర్తిగా ఉపయోగించుకోవడం విజ్ఞుల లక్షణం. గోసేవ, తులసి, వేప వృక్షములను పెంచుట, వికలాంగులు అంధులకు వీలు అయినంత సహాయం చేయండి. ఏదేని ఏమాత్రం పోషణలేని దేవాలయానికి ఆర్థికసహాయం అందించండి. శుభం కలుగుతుంది.