Home » Rasi Phalalu » మేషం రాశిఫలాలు 2015

మేషరాశి  -  అశ్విని 1,2,3,4 (చూ,చే,చో,లా)
భరణి 1,2,3,4 (లీ,లూ,లే,లో)- కృత్తిక 1వ పాదము (అ)
ఆదాయము 14  వ్యయం 14 రాజపూజ్యం 3 అవమానం
6

 

ఈ రాశివారికి గురువు వత్సరాది 14.7.15 అనగా అధిక ఆషాఢ బ.త్రయోదశి మంగళవారం వరకు చతుర్థ స్థానమున సువర్ణమూర్తియై ఉండును. తదుపరి వత్సరాంతం తమ 5వ స్థానమున తామ్రమూర్తియై ఉండు. శని వత్సరాది, వత్సరాంతము 8వ స్థానమున సురవ్ణమూర్తియై ఉండును. రాహువు, కేతువు 29.1.2016 అనగా పుష్య బ.పంచమి శుక్రవారము వరకు రాహువు 6, కేతువు 12వ స్థానములో తామ్రమూర్తులై ఉందురు. తదుపరి వత్సరాంతం రాహువు 5వ స్థానంలో కేతువు 11వ స్థానములో సువర్ణమూర్తులై ఉందురు.

    ఈ విధమైన గ్రహస్థితిని పరిశీలించి చూడగా శుభాశుభ మిశ్రమ ఫలితము కనపడుచున్నవి. గ్రహగమనము ఒకరికొరకు ఆగదు. కాలము, శాస్త్రము ఎవరి విషయంలోనూ పక్షపాతము చూపించదు. జీవన సుఖ, దుఃఖ భ్రమణముతో ధైర్యముగా సమస్యలను అధిగమిస్తూ శాస్త్రపరమైన పరిహారాలను ఆచరిస్తూ, భగవదనుగ్రహము భాగవత మంగళాశాసనములతో మానవత్వపు విలువలు కలిగి పరోపకార బుద్ధితో జీవనయానం సాగిస్తూఉండిన అనేక గ్రహబాధల నుండి ఉపశమనము లభించును. అదియే జ్యోతిషమార్గ దర్శనము.
   
ఈ సం||ము మేషరాశి వారికి వత్సరారంభములో ఆరోగ్య విషయంలో శ్రద్ధ చూపాలి. ఏ మాత్రం అజాగ్రత్త పనికిరాదు. వాహనములు నడుపునపుడు జాగ్రత్తలు పాటించాలి. ఎవరు ఎన్ని విధాలుగా మిమ్ములను రెచ్చగొట్టె ప్రయత్నము చేసినా సహనంగా ఉండాలి. అదే మీకు శ్రీరామరక్ష నొప్పంపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అని కదా పెద్దల వాక్యము. అందుచేత ఈ న్యాయమును పాటించిన అన్ని విధాలా శ్రేయస్కరము. తమకు సంబంధము లేని విషయాలపై ఆసక్తి చూపి తమకు తాము అరిష్టమును స్వాగతించెదరు. స్నేహాల విషయంలో ఒకింత జాగ్రత్తగా ఉండాలి. స్నేహ ధర్మఉ కొరకు ఎదుటివారు చేసిన పొరపాటుకు మీరు సంజాయిషీ చెప్పవలసిన పరిస్థితి రావచ్చును. కోర్టు వివాదాలు. పోలీస్‌ స్టేషనులు విసుకు కల్గించవచ్చును. అనవసర నేరారోపణలు ఎదుర్కొనవలసి వచ్చే అవకాశము ఇందుకు మీ అతి మంచితనము కారణము కావచ్చును. ప్రతి చిన్న విషయానికి నిష్ఠూరపు మాటలు వినవలసివచ్చును.  మానావమానములను సమానంగా చూస్తారు. ఆవేశపూరిత సంభాషణలకు దూరంగా ఉండండి. మిమ్ములను మీరు మరిచి అత్యుత్సాహంతో పరిసరాలను మరిచి మీరు మాట్లాడే మూటలు వివాదాస్పదము కావచ్చును. స్రీ, పురుష పరిచయాలు, స్నేహాల విషయంలో అపోహలు, అవమానాలు ఏర్పడే సూచనలు గలవు. కుటుంబములోని తమ ఆత్మీయ ఆరోగ్యవిషయమై ధనము ఖర్చు కావడము. మానసిక అలజడి ఎదురుకునే అవకాశము గలదు. సమాజంలో ఉన్నతస్థాయిలో ఉన్నవారి పరిచయాలు లాభించవచ్చును. ఆర్థిక సమస్యలు తలనొప్పిగా మారవచ్చును. మీరు అనుభవించకున్నా ఇతరులకు సహాయము  చేయవలసి రావడం సంభవించవచ్చును. దగ్గరి బంధువుల ఆరోగ్యము కలత చెందించవచ్చును. దాంపత్య సమస్యలు విభేదాలు ప్రేమికుల మధ్యన అభిప్రాయ భేదాలు రావచ్చును. క్రూరమైన ఆలోచనలు రాకుండా మరియు ఆ విధమైన ఆలోచనలు ఉన్న వారితో దూరంగా ఉండండి. సంసారిక జీవితములో ఒకింత అసంతృప్తి. సంతానము యొక్క ఆరోగ్య విషయమై ఔషధపరమైన ఖర్చులు ఏర్పడవచ్చును. వ్యసనాలకు దూరంగా ఉండండి. అజీర్తి సంబంధిత సమస్యలు బాధించవచ్చును. అకాల భోజనము కలిగించును. ఉదర సంబంధిత సమస్యలు తలెత్తవచ్చును. హోటలు భోజనములకు వీలయినంతవరకు స్వస్తి పలకండి. పాదములకు గాయములు, వృధాఖర్చులు, ధనవ్యయము సూచించుచున్నది. మీకు తెలియకుండానే ధనాన్ని ఖర్చు చేసే అవకాశముగలదు. చేతులు కాలిన తరువాత జాగ్రత్త పడితే ఏమి లాభము? తరచు అసత్యము పలుకవలసిన పరిస్థితులు, జంతువుల వలన ప్రమాద సూచన గలదు.  అష్టమ శని ప్రభావము జులై, 14వ తేదీ నుండి 5 స్థానములో బృహస్పతి బలము వలన చాలా సమస్యలు ఉపశమించును. జులై 14 వరకు మాత్రము మానసిక సమతుల్యత కాపాడుకోవాలి. కలహాలకు దూరంగా ఉండండి కొందరికి స్థానచలన సూచనలు కనబడుచున్నవి.
   
అయితే జులై 14వ తేదీ నుండి మాత్రము మీకు చాలా వరకు శుభము కనబడుచున్నవి. మీ ఆత్మ స్థైర్యము మీకు శ్రీరారక్షయని తెలుసుకొనండి. మీలో ఉన్న సృజనాత్మకత సమయోచిత నిర్ణయాలు అనేక నిర్ణయాలలో మీకు సహాయపడవచ్చు పంచమ బృహస్పతిచే ఇష్టకామ్యార్థ సిద్ధి ఏర్పడుతుంది. ఇష్ట దేవతా అనుగ్రహము, కుల విద్యపై  ఆసక్తి పెరగుతుంది. విద్యావిషయంలో అనేక క్రొత్త నిర్ణయాలకు శ్రీకారము. ధనప్రాప్తి అనూహ్య ధనాగమము సూచన కనిపించుచున్నది. కార్యానుకూలత బంధువర్గములో మీ పేరు ప్రతిష్ఠ పెరుగవచ్చును. శారీరక సౌఖ్యము కలుగవచ్చును. మీయొక్క స్థాయి కూడా పెరుగవచ్చును. మీరు పనిచేయు సంస్థలో కొంత మందిపైన అధిపత్యము వహిస్తారు. అవివాహితులకు వివాహప్రాప్తి, సంతానప్రాప్తి. వస్త్ర భూషణప్రాప్తి, సమాజములో గౌరవము పెరుగుతుంది. ఉద్యోగములో ప్రమోషన్లు లభించవచ్చును. వ్యాపారములో నూతన మార్గాన్వేషణ, అందులో సఫలమవుతారు. గతంలో ఇచ్చిన ధనం తిరిగి చేతికి అందుతుంది. కాని అంచెలంచెలుగా అందవచ్చును. నూతన గృహ నిర్మాణానికై బ్యాంకుల ద్వారా ఋణ సదుపాయము లభించగలదు. సమాజంలో  ఉన్నతస్థాయిలో ఉన్న వారి పరిచయాలు కలుగుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. సజ్జనసాంగత్యం మీరు చేసిన పనికి తగిన సత్కారము, పురస్కారము లభించ వచ్చును. మీ యొక్క వ్యక్తిగత గౌరవమునకై చేయ ప్రయత్నాలు ఫలిస్తాయి.
   
అయితే ప్రతి విషయములోను మితి మీరిన ఆత్మవిశ్వాసము మాత్రము  పనికిరాదు. ఎదుటివారు ఎంత తక్కువస్థాయిలో ఉన్న మీరు ఏమాత్రం వారిని తక్కువ అంచనా వేయకండి. బృహస్పతి బలము సంవత్సర మధ్య కాలమునుండి అనుకూలముగా ఉన్ననూ, ప్రతి ప్రయత్నమునకు ఏ మాత్రము జాడ్యము చూపించక పట్టుదల అవసరము. ప్రతి విషయమున ఎక్కువగా కృషి చేయాలి. ఉద్యోగస్థులకు తీవ్రమైన పని ఒత్తిడి ఏర్పడవచ్చును. అదే విధంగా బాధ్యతలు కూడా పెరుగుతాయి. అనవసర, అప్రస్తుత మధ్యవర్తిత్వము చేసి మీకై మీరు అరిష్టాలకు స్వాగతం పలకకండి. కోర్టు వివాదములు కొంత బాధించగలవు.
   
విదేశీ ప్రయత్నాలు 2వ ప్రయత్నంగా ఫలించగలవు. నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి కూడా కొంత ప్రయత్ననంతరము కలుగగలదు. పశ్చిమ దిక్కుకు ప్రయాణములు చేయవలసిన అవసరాలు. ఋణబాధల నుండి ఒక అమృతహస్తం వల్ల బయటపడతారు. రోగ నివృత్త కలుగుతుంది. మేనమామ గారి ఆరోగ్యము విషయంలో జాగ్రత్తలు అవసరం ఇతర సంప్రదాయస్థులతో స్నేహాలు, సంతానము యొక్క ఆరోగ్య విషయమై ధనం ఖర్చు చేయ వలసిన స్థితి, స్త్రీలు ముఖ్యముగా గర్భవతులు తమ ఆరోగ్య విషయంలో ఏ మాత్రం అశ్రద్ధ పనికిరాదు. కొన్ని పరిస్థితులలో అర్థంకాని మానసిక స్థితి ఎదురుకుంటారు. ముఖ్యముగా వివాహ నిశ్చయ విషయంలో (వధూవరులు) నిర్ణయం తీసుకోవడం సమస్యగా మారుతుంది. స్త్రీ మూలక భయము, గర్భధారణ మేరకు వైద్యుణ్ణి సంప్రదించడం   ఔషధసేవనము, నేత్రబాధ ఎదురుకావచ్చును. సరియైన వైద్యుడిని సంప్రదించుట ఉత్తమము. అశ్రద్ధ పనికిరాదు. అగ్ని, విద్యుత్తుతో జాగ్రత్తగా ఉండాలి. మాటలు వాడిగా, వేడిగా రాకుండా జాగ్రత్త పడండి. వైరాగ్యభావాలు రావచ్చును. వత్సరాంతములో విదేశీ ప్రయత్నాలు లాభించవచ్చును. సఫలము కావచ్చును. పురాతన సంప్రదాయ విషయాలు, పురాణాలు ఇతిహాసాలపై ఆసక్తి, పుస్తక పఠనము, షేర్‌మార్కెట్‌లో కొంత సత్ఫలితము. వ్యవసాయ క్షేత్ర లాభము, ఉద్యోగములో స్థాయి పెరుగుట ఫలితము ఈ సంవత్సరము కపడుతుంది. విద్యార్థులకు పూర్వార్థము కన్నా ఉత్తరార్థము బాగుంటుంది. పోటీ పరీక్షలలో సత్ఫలితాలు సాధిస్తారు. ఈ సం||ము ఈ రాశివారలు ఒకనెల అయినా గోసేవకు సహాయము చేయండి. ఒక వృక్షాన్ని పెంచండి. వృద్ధులకు, అంధులకు పేద విద్యార్థులకు వికలాంగులకు వీలయినంత సహాయము చేస్తూ సదాచారము సజ్జన సాంగత్యము శాస్త్రహితమైన పరిహారాలు చేస్తూ నిత్యం ప్రత్యేక శనిస్తోత్రం రామ, కుజ, గురు, రవి, ధ్యాన శ్లోకాలను పఠించండి. హనుమాన్‌ చాలీసా మరువవద్దు.