Home » Rasi Phalalu » తులారాశి రాశిఫలాలు 2015

తులారాశి - చిత్త 3,4 (రా,రి)

స్వాతి 1,2,3,4(రూ,రే,రో,తా)- విశాఖ 1,2,3 (తీ,తు,తే)

ఆదాయము 8 వ్యయం 8 రాజపూజ్యం 7 అవమానం 1

 

ఈరాశివారికి గురువు వత్సరాది 14.7.15 అనగా అధిక ఆషాఢ బ.త్రయోదశి మంగళవారం వరకు 10వ స్థానమున రజితమూర్తిగా యుండును. తదుపరి వత్సరాంతము 11వ స్థానమున రజితమూర్తిగానే యుండును. శని వత్సరాది వత్సరాంతము 2వ స్థానమున రజితమూర్తిగా యుండును. రాహుకేతువులు వత్సరాది 29.1.15 అనగా పుష్య బ.పంచమి శుక్రవారము వరకు రాహువు 12వ స్థానము నందు, కేతువు 6వ స్థానమందు లోహ మూర్తులై యుందురు. తదుపరి వత్సరాంతము రాహువు 11వ స్థానమున కేతువు, 5వ స్థానమున లోహమూర్తి గానే యుందురు.

    ఈ విధమైన గ్రహస్థితిని పరిశీలించి చూడగా శుభాశుభ మిశ్రమ ఫలములు కనపడుచున్నవి. గతం చాలా రోజుల నుండి అనుభవిస్తున్న అవస్థలు కొంతవరకు ఉపశమించినట్లు కనిపించినా ఇంకా ఫలితము చేతికి అందకపోయే సరికి ఒక విధమైన కంగారు ఏదో తెలియని అభద్రతా భావము ఏర్పడుతుంది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని అర్ధంకాని పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగ విషయంలో ఏ విధమైనటువంటి సాహస నిర్ణయాలు తీసుకోవడం మంచిదికాదు. సహనము, ఓర్పు ఇవి అలవరచుకోవాలి. చాలా కాలంగా ఉన్న సహనానికి ఒక పరీక్షా సమయము ఎదురుకావచ్చు. కాని మిమ్ములను అనేక విధాలుగా రెచ్చగోట్టే ప్రయత్నాలు చేస్తారు. తద్వారా మీరు చేసే పొరపాటును తమకు అనుకూలంగా త్రిప్పుకునే ప్రయత్నాలు జరగవచ్చు. తస్మాత్‌ జాగ్రత్త. పనిభారము మానసిక వత్తిడి పెరగవచ్చును. సహోద్యోగులు తమ క్రింద పనిచేసే వారు తమ మాటను పూర్తిగా వినక, పై అధికారులకు జవాబు చెప్పలేక సతమతమవుతారు. గృహంలో కూడ ఒక విధమైన సహకార లోపం ఏర్పడవచ్చును. క్రోధం తగ్గించుకోవాలి. అనవసర ఆవేశము అనర్థాలకు హేతువు కావచ్చును. వాహనములు నడుపునపుడు పరధ్యానము, అజాగ్రత్త ఏ మాత్రం శ్రేయస్సు కాదు. ఇంటర్నెట్‌ ఉపయోగంలో కూడా నియంత్రణ అవసరము. చాలా రహస్యాలు ముఖాముఖిగా మాట్లాడుకోవడం ఉచితము. తమను ఎక్కువగా ఇష్టపడే వారిని నిర్లక్ష్యము చేయడం, నిర్లక్ష్యం చేసేవారికోసం వెంటపడడం, వారికి అనేక విధాలుగా సహాయమందించడం చేస్తారు. కాని తమ ప్రయత్నానికి గుర్తింపుగాని, ఫలితముగాని ఉండకుండా పోతుంది. తమ పరభేదాన్ని గుర్తించండి.  అనుబంధాలకు విలువనివ్వండి. ఎండమావులకై ఆరాటపడకండి. బంధువులతో అకారణ ద్వేషాలు, వివాదాలు చిరాకు కల్గిస్తాయి. తమ ప్రయత్నాలలో ఫలితము చేతికందినట్లే అంది జారిపోవడం మానసిక వ్యధకు కారణ మవుతుంది. విలాసవంతమైన, ఖరీదైన గృహోపకరణాలు, అలంకార వస్తువులు అప్పు చేసైనా కొనుగోలు చేస్తారు. ఎదుటివారి ముందు తాము ఏమిటో నిరూపించుకోవాలనే ప్రయత్నం  చేస్తారు. విషమ పరిస్థితులలో కూడా తమ ఆత్మ విశ్వాసమును ధైర్యాన్ని తగ్గనీయరు. ఆకలితో ఉన్నా సింహం గడ్డితినదని, మీ ప్రవర్తన ద్వారా నిరూపిస్తారు. స్త్రీ విబేధాలు కనపడుచున్నవి. సంవత్సరము ఉత్తరార్థంలో వివాహ ప్రయత్నాలు సఫలము కావచ్చును. కుల దేవతారాధన చేస్తారు. అనుగ్రహము పొందుతారు. ధనం సంపాదించినట్లు కనపడినా చేతిలో అవసరానికి ధనం ఉండదు. లోకం దృష్టిలో ధనవంతులు. నిజ జీవితంలో అందుకు విరుద్ధంగా ఉంటుంది. నరఘోష విపరీతంగా ఉన్నది. శతృవులపై ఆధిపత్యానికై వారిని అదుపు చేయడానికై అనేక విధాలుగా ప్రయత్నించాల్సి వస్తుంది. స్థిరాస్థి అమ్మకానికి  పెడతారు. అయితే అప్రయత్నం కొంత వాయిదా పడవచ్చు. ఉత్తరార్థం జులై 14 తరువాత కార్యరూపం దాల్చవచ్చును. స్థిరాస్థిని తప్పని పరిస్థితులలో అయిష్టముగా అమ్మకానికి పెట్టవలసిన పరిస్థితులు రావచ్చును. విలువైన వస్తువులను భద్రపరచుకోవడంలో ఏ మాత్రం అశ్రద్ధ పనికిరాదు. మీ ముందు నిలబడే అర్హతలేనివారు కూడా మీకు సలహాలు ఇవ్వడము ఆశ్చర్యాన్ని కల్గిస్తుంది. ఉద్యోగంలో మాత్రం తొందరపాటు చర్యలు ఉండరాదు. కొందరికి తమ స్వయంకృతాపరాధములే రావలసిన ప్రమోషన్లు రాకపోవడం తమకన్నా తక్కువస్థాయివారు అందల మెక్కడం మనో వేదనకు కారణం అవుతుంది. అధికారుల నుండి తగిన గుర్తింపు ప్రోత్సాహము లభించును. ఎవరో చేసిన తప్పకు తాము సంజాయిషీ చెప్పవలసిన స్థితి ఏర్పడుతుంది. చట్ట వ్యతిరేకమైన పనులు చేసేవారు దరికి చేరకుండా ముందే గ్రహించి దూరం ఉంచండి. ప్రలోభాలకి లొంగి ప్రతిష్టను భంగపరచుకోవద్దు. ఊహలు తారు మారు కావచ్చును. గృహములో ఏదో తెలియని అశాంతి. బంధువుల అనారోగ్యము అరిష్ట సూచనలు. ఆస్తులు వివాదాస్పదమగుట, వంశపారంపార్య ఆస్తుల విషయంలో కలహాలు, కోర్టు గొడవలు కోరికలు పూర్తిగా తీరకపోవుట.

    అయితే ఈ ఫలితాలు జులై 14 తరువాత 11వ స్థానములో బృహస్పతి స్థితివల్ల అనేక మార్పులు సంభవించును. చాలాకాలంగా అనుభవిస్తున్న అవస్థలు దూరమగును. తమపై తమకు ఆత్మ విశ్వాసము, ధైర్యము పెరుగును. గతంలో నిరాదరించినవారు ఆదరించుట, వారే మీ సహాయానికై అర్థించుట జరుగవచ్చును. అది మీకు గర్వంగా పరిణమించవచ్చును. గతంలో మీరు వహించిన సహనానికి ప్రతిఫలం లభిస్తుంది. మంచి తనానికి అలస్యంగానైనా గుర్తింపు సత్పలితం ఉంటుందని సంతోషపడతారు. కళాకారులకు రెండవ ప్రయత్నంగా ఫలితము దక్కవచ్చును. నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి, కాని లభించిన ఉద్యోగం సంతృప్తి నివ్వకపోవచ్చును. అయినా కొద్ది రోజులు ఓపికతో ఉండాలని నిర్ణయించుకుంటారు. వ్యాపారంలో వృత్తిలో పోటీ మాత్రము పెరుగుతుంది. నిలబడటానికి చేసే ప్రయత్నము ఫలిస్తుంది. సామాజిక, రాజకీయ పరంగా ఉన్నతస్థాయి వ్యక్తులను కలుస్తారు.   ఆధ్యాత్మికంగా ప్రముఖస్థానంలో ఉన్న గొప్ప వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. ఉదర, కటి క్రింది భాగపు అనారోగ్య సమస్యలు బాధించవచ్చును. కొన్ని సందర్భాలలో మిమ్ములను ఇష్టపడే వ్యక్తులను దూరం చేసుకున్నందుకు పశ్చాత్తాప పడతారు. సంతానం యొక్క అభివృద్ధి ఆనందాన్ని ఇస్తుంది. చాలా కాలంగా మీరు శ్రమిస్తున్న కృషికి ఫలితందక్కుతుంది. ఎక్కువగా రహస్యాలను అవలంభిస్తారు. తనవారే తమకు అపకారం చేసే ఉద్దేశంతో ఉన్నారని తెలుసుకుంటారు. కోల్పోయిన పరపతి లభిస్తుంది. సంతానం క్రమమార్గంలో నడుస్తారు. ఆకస్మిక అనూహ్య ధనప్రాప్తి కనబడుతుంది. శతృవులపై అధిపత్యాన్ని సాధిస్తారు. విద్యార్థులు ప్రధమార్ధం కన్నా ద్వితీయార్ధము చక్కని ఫలితాలు పొందుతారు. పోటీ పరీక్షలలో విజయాన్ని సాధిస్తారు. ఏలినాటి శని ప్రభావము ఉన్ననూ బృహస్పతి అనుకూలము, మరియు ఏలినాటి శని చివరి సమయము కనుక గతంలో అవస్ధలు అనుభవించిన వారికి చాలావరకు జులై తరువాత మేలు జరుగును. శనిధ్యానం నిత్యం చేయండి. ఇంకా ఉత్తమమైన ఫలితాలు పొందండి. విద్యార్థుల హయగ్రీవస్తోత్రం చేయండి. పోటీ పరీక్షలలో ఫలితాన్ని పొందండి. ఉద్యోగస్తులు లక్ష్మి  నృసింహకరావలంబ స్తోత్రం చేయండి. ఉన్నతస్థాయి పొందండి. స్త్రీలు శ్రీ కనకధారా స్తోత్రం చేయండి. సంఘ సేవా కార్యక్రమాలు చేస్తారు. మేధాశక్తి పెరుగుతుంది. పుత్ర సంతాన ప్రాప్తి. గౌరవప్రదమైన జీవితం. పర్వత ప్రాంతాలు, నీటి ప్రాంతాలు సందర్శించేటపుడు జాగ్రత్తలు అవసరము. వ్యాపారాన్ని విసృతపరుస్తారు. దాంపత్య జీవితానందాన్ని పొందుతారు. వత్సరారంభంలో మాత్రం శారీరక బలహీనత బాధిస్తుంది.మానసిక ప్రశాంతత లోపించుట పాపభూయిష్టమైన ఆలోచనలు భార్యలేక భర్త ఆరోగ్య సమస్యలు, తమ దగ్గర పనిచేయు పనివారు సరిగా స్థిరంగా ఉండకపోవుట, నేత్ర బాధ ఊహించని చికాకులు, మరియు రక్త సంబంధీకులకు అనారోగ్య సమస్యలు, తెలియని భయము, కాళ్ళకు గాయములు, స్థానమార్పు మొదలైన సమస్యలు వత్సరారంభమున ఉన్ననూ, సం||ర మధ్య కాలమునుండి చాలావరకు అనుకూలతలు ఏర్పడును. ఆదాయ మార్గాలు సుగమము అవుతాయి. పేరుప్రతిష్టలు పెరుగుతాయి. పండితులకు సన్మాన గౌరవాలు దక్కుతాయి. మేనమామ ఆరోగ్యానికి ఇబ్బందులు. ఆధ్యాత్మికత జ్ఞానము, శ్రద్ధ పెరుగుట, ఉదర సంబంధిత ఇబ్బందులు. లివరు, కామెర్లు, బిపి, షుగరు మొదలగు వాటి పట్ల అశ్రద్ధ పనికిరాదు. మత జాడ్యము పెరుగుట మొదలైన ఫలితము సరాసరిగా ఏర్పడుసూచన గలదు. ఈ రాశి స్త్రీలకు గత సం||రము కన్నా ఈ సారి అనుకూలముగా ఉంటుంది. అన్యుల సహాయమునకై ఆశపడక స్వంత శక్తిని నమ్ముకోని మీరు ఏమిటో నిరూపించుకొనే సమయమని గ్రహించండి. విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశాలలో ఉన్నవారికి శాశ్వత నివాసయోగ్యత లభించవచ్చును. భవిష్యత్తు గురించి ఉజ్జ్వలమైన భవిష్యత్తు గలదని చక్కని దారులు గలవని ఆ దిశలో ఆలోచిస్తారు. అవకాశాలు వస్తాయి. గోసేవ, మహాలక్ష్మి స్తోత్ర, శ్రీ సుందరకాండ పారాయణం, శని, రాహు, కేతు కుజ ధ్యాన శ్లోకాలు పఠించుట వల్ల మేలు జరుగుతుంది. వృద్ధులకు సహకరించండి. మాతాపితరులను గౌరవించండి.