Home » Rasi Phalalu »  వృషభం రాశిఫలాలు 2015

వృషభరాశి -  కృత్తిక 2,3,4 (ఈ,ఊ,ఏ)
రోహిణి 1,2,3,4(ఓ,వా,కీ,వూ)-మృగశిర 1,2(వే,వో)
ఆదాయము 8  వ్యయం 8 రాజపూజ్యం 6 అవమానం
6

   

 

ఈ రాశివారికి గురువు వత్సరాది 14.7.15 అనగా అధిక ఆషాఢ బ.త్రయోదశి మంగళవారము వరకు 3 స్థానములో తామ్రమూర్తిగా యుండును. తదుపరి వత్సరాంతము 4వ స్థానములో రజితమూర్తిగా ఉండును. శని వత్సరాది వత్సరాంతం 7వ స్థానమున తామ్రమూర్తిగా ఉండును. రాహు, కేతువులు 29.1.2016 అనగా పుష్య బ. పంచమి శుక్రవారము వరకు రాహువు 5వ స్థానములో కేతువు 11వ స్థానములో రజితమూర్తులై ఉందురు. తదుపరి వత్సరాంతము రాహువు 4వ స్థానంలో కేతువు 10వ స్థానములో రజిత మూర్తులుగానే ఉందురు.
   
ఈ విధమైన గ్రహస్థితిని పరిశీలించి చూడగా శుభా శుభ మిశ్రమ ఫలితములు కనబడుచున్నవి. గ్రహ గమనము ఒకరికొరకు ఆగదు. శాస్త్రము, కాలము ఎవరి విషయములోనూ పక్షపాతము చూపదు. జీవన సుఖ   దుఃఖ భ్రమణములో ధైర్యముగా సమస్యలను ఎదుర్కొంటూ అవాంతరాలను అధిగమిస్తూ శాస్త్రపరమైన పరిహారాలను ఆచరిస్తూ భగవదనుగ్రహము భాగవత మంగళాశాసనములతో మానవత్వపు విలువలు కలిగి, పరోపకార బుద్ధితో జీవనయానము సాగిస్తూ ఉండిన అనేకమైన గ్రహబాధలనుండి ఉపశమనము లభించును. అదియే జ్యోతిష మార్గ దర్శనము పరమార్థము.

    ఈ సంవత్సరము వృషభరాశి వారికి చాలా విషయాలతో సర్దుకుపోయే మనస్తత్వము కల్గియుండుట శ్రేయస్కరము. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ వృధాఖర్చులు చేస్తారు. ఈ విషయంలో ఒకింత జాగ్రత్త అవసరము. తమ శ్రేయోభిలాషులు, స్నేహితులు. మిమ్ములను అమితంగా ఇష్టపడేవారి యొక్క మాటలను సూచనలను పట్టించుకోకపోవడం ఇబ్బందికరంగా పరిణమించవచ్చును. గోముఖ వ్యాఘ్రాలను నమ్మి మోసపోయే అవకాశము గలదు. అవకాశము ఉన్నదని, అయాచిత ఋణము లభిస్తున్నదని అనాలోచితముగా ఋణములు చేసే అవకాశము గలదు. తస్మాత్‌ జాగ్రత్త. నూతన పరిచయాలు ఇబ్బంది గలిగించవచ్చును. కొత్త వ్యాపారాలతో పెట్టుబడులు పెట్టునపుడు ఒకింత ఆలోచించండి. స్వయంకృతాపరాధము సంభవించవచ్చును. ప్రస్తుత తమస్థాయిని తగ్గించడానికి అనేక ప్రయత్నాలు జరిగే అవకాశము గలదు. బాధ్యతలను విస్మరించకుండా జాగ్రత్త పడండి. మానసిక ప్రశాంతత లోపించవచ్చును. మనుజులు ఈ విధంగా కూడా ఉంటారా ! అని ఆశ్చర్యం కల్గుతుంది. దీనికి కారణం కొన్ని సందర్భాలలో మీ శ్రేయస్సుకోరే వారిని విస్మరించడమని తెలసుకోవాలి. ఆస్తులు, భవనాలు మొదలైన వాటిని వృద్ధి చేసుకోవాలని ఆరాటము ఎక్కువౌతుంది. విలాసాలు, సువర్ణాభరణముపై ఆసక్తి పెరుగుతుంది. తాము అనుకున్నది సాధించడానికి కొంత వక్రమార్గ ఆచరణ కూడా చేయవలసిన పరిస్థితి రావచ్చు. ఆస్తులు మార్పిడి చేసే అవకాశము గలదు. భూవ్యాపారాలు కొంతవరకు లాభిస్తాయి. మధ్యవర్తిత్వాలు, మధ్యవర్తి వ్యాపారాలు కొంతవరకు లాభిస్తాయి. ఏమి చేసి అయినా అవాంతరాలు ఎదురైనా తోటి వారిలో మీ స్థాయిని పెంచుకునే ప్రయత్నము చేస్తారు. సఫలమవుతారు. సంప్రదాయ విషయాలపై ఆసక్తి, శ్రద్ధ చూపిస్తారు. వ్యాపారాన్ని స్వంతంగా నిర్వహించాలని ప్రయత్నాలు చేస్తారు. వ్యాపార భాగస్వాములను దూరంగా ఉంచాలని ప్రయత్నాలు చేస్తారు. రాజకీయ పరపతి ఉన్నత వ్యక్తుల పరిచయాలు ఏర్పడుతాయి. మీకంటూ ఒక వర్గాన్ని స్థిరపరుచుకుంటారు. నూతన భవన నిర్మాణానికి బ్యాంక్‌ ఋణాలకై ప్రయత్నాలు చేస్తారు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మాకూడదో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. శక్తికి మించిన కార్యాలు చేయవలసిన పరిస్థితులు ఎదురవుతాయి. పేరుప్రతిష్టలకు లోపం ఉండదు. దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉంది. ప్రతిష్టలకు లోటు ఉండదు. రాజకీయంగా ఉన్నత స్థానంలో ఉన్నవారి వల్ల మీకు విశేషంగా సహకారం లభించవచ్చును. కండరాలు, కీళ్ళనొప్పులు అవస్థలు మాత్రం భరించక తప్పదు, బిపి, షుగర్‌ వంటి వ్యాధుల విషయంలో ఏమాత్రం అశ్రద్ధ, అజాగ్రత్త పనికిరాదు.నూతన విద్యలపై ఆసక్తి చూపిస్తారు.

    సంతానముయొక్క అభివృద్ధికై కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. సంతానం అభివృద్ధి పథంలో నడుస్తారు. వంశపారంపర్యంగా ఆస్తులు సంక్రమించవచ్చును. శుభకార్యములు చేస్తారు. శతృవులు ఏ స్థాయిలో ఉన్న చివరికి మీదే పై చేయి అవుతుంది. అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండండి. చతుష్పాత్‌ జంతువులవల్ల ఇబ్బంది తల్లితరపు బంధువులతో విరోధాలు, వివాహప్రాప్తి, సంతానప్రాప్తి. గర్భధారణ జరుగవచ్చును. వాహనాలు నడుపునపుడు జాగ్రత్తలు వహించండి. వ్యసనాలు, జూదాలు, షేర్‌మార్కెట్‌ విషయాలలో ఒకింత మెళకువగా ఉండండి. అనవసరమైన అపవాదాలు, నిందలకు సమర్ధవంతంగా ఎదుగుకుంటారు. శాఖాపరమైన విచారణను ఎదుర్కొనవలసిన పరిస్థితి ఎదురుకావచ్చును. ప్రయాణాలలో జాగ్రత్తలు అవసరము. నూతన ప్రదేశాలకు స్థానచలనము.ఉద్యోగస్తులకు విపరీతమైన పని వత్తిడి ఏర్పడవచ్చును. తండ్రిగారి ఆరోగ్యము విషయంలో జాగ్రత్తలు అవసరము. జీవిత భాగస్వామికి అనారోగ్య సూచనలు, భాగస్వామ్య వ్యాపారాల విషయంలో సం||ర మధ్యకాలము నుండి ఒకింత జాగ్రత్తగా ఉండవలెను. స్వస్థలము విడిచి అన్య ప్రదేశములో నివసించే పరిస్థితులు, మానసిక పరిపక్వత లోపించుట, నిర్ణయము తీసుకోవటములో ఎటూ అర్థంకాని పరిస్థితి అన్యుల సంపర్కముతో అనవసరమైన అనారోగ్యానికి స్వాగతం పలుకకండి. మాతృ సంబంధ వ్యాధుల పట్ల అశ్రద్ధ పనికిరాదు. ఉద్యోగస్తులకు పై అధికారుల వల్ల గుర్తింపులేకపోవుట, తీవ్రమైన వత్తిడి, గృహములో ప్రతి చిన్న విషయానికి వివాదాలు సృష్టించ కుండా, జాగ్రత్త పడండి. ఏదో తెలియని అభద్రత, భయము కలుగవచ్చును.

    అయితే సం||రము మధ్యకాలము నుండి కొంత అనుకూలము ఉండవచ్చును. ఎన్ని అవాంతరాలు ఎదురైనా తాము అనుకున్నది సాధిస్తారు. శతృవుల బలహీనతను గుర్తించి తగిన సమాయానికై వేచిచూసి పై ఎత్తులు వేయడంలో సఫలమవుతారు. రక్త సంబంధీకుల ఆరోగ్యం కలత చెందించవచ్చును. ఎన్ని సమస్యలు ఉన్న కీర్తి ప్రతిష్టలకు లోటు రానివ్వదు. స్తుతికి లొంగకండి కోర్టుగొడవలు నిరాశకల్గించవచ్చును. కళాకారులకు రెండవ ప్రయత్నంలో మేలు జరుగవచ్చును. విదేశాలకు వెళ్ళాలనుకునేవారు ఒకింత వేచి ఉండాల్సిన పరిస్థితి. విలువైన డాక్యుమెంటులు, వస్తువులు భద్రపరచుకోవాలి. అజాగ్రత్త పనికిరాదు. యల్‌ఐసి మొదలగునవి నిర్లక్ష్యము చేయరాదు. ప్రభుత్వానికి చెల్లించవలసిన బకాయిలు సరియైన సమయంలో చెల్లించే ప్రయత్నం చేయండి. కొన్ని ముఖ్యమైన పనులకు ఇది అవరోధము కావచ్చును. విద్యార్థులు కొంత అలసత్వము, జాడ్యము వదలినట్లయితే చక్కని ఫలితాలు పొందె అవకాశము గలదు. అంతర్జాలము, వల్ల కొంత అనర్థము కలుగవచ్చును. పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగ ప్రాప్తి రెండవ ప్రయత్నంగా లభించవచ్చును. తక్కువ శ్రమతో ఎక్కువ లాభాన్ని పొందాలనే ప్రయత్నము మానుకోవాలి.

    గర్భవతులు వైద్యుని సలహామేరకు నడచుకొనుట ఉత్తమము. ప్రయాణాలు ఎక్కువగా చేయరాదు. స్త్రీ, జన దూషణ ఎదుర్కొనవలసిన పరిస్థితి. ఉదర సంబంధితమైన సమస్యలు బాధించే అవకాశము గలదు. మానసిక చికాకు కలుగవచ్చును. విద్యార్థులు అనవసరముగా కొందరి సలహామేరకు విద్యకు విఘాతము కల్గించే నిర్ణయాలు తీసుకొనరాదు. తస్మాత్‌ జాగ్రత్త, ఆధ్యాత్మిక ఆలోచనలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తారు. వృత్తిపరమైన సంతృప్తి. నూతన సాహిత్యము కళారంగాలలో ఆసక్తి. సం||ర చివరలో వ్యవసాయపరమైన ఆదాయం, స్థిరాస్థి వృద్ధి, ప్రభుత్వానికి అపరాధరుసుము చెల్లించాల్సిన స్థితి రావచ్చును. పర్వత ప్రాంతాలు ఎతైన ప్రదేశాలు సందర్శించే సమయంలో జాగ్రత్త అవసరము. విద్యుత్తు, అగ్ని మొదలైన విషయాలలో జాగ్రత్త అవసరం. సం||రము చివరలో మనోబలం పెరుగుతుంది. ప్రత్యక్ష మితృలు, పరోక్ష శతృవులుగా మారే అవకాశం కీర్తి కాంక్ష పెరుగుతుంది. అహంకారి అనే ముద్ర పడే అవకాశము గలదు. జీవిత గమనంలో స్నేహితుల విషయంలో కొందరికి వీడ్కొలు కొందరికి స్వాగతం. విద్యార్థులు ఊహలలో విహరించడం మాని వాస్తవంలోకి రండి. మొత్తం మీద ఈ రాశివారికి శుభాశుభ ఫలితములు ఏర్పడుచున్నవి. ఇంకా ఉత్తమ ఫలితాలకు అరిష్ట నివృత్తికి గో సేవకు సహాయంచేయండి. పేద విద్యార్థులకు అనాథ వృద్ధులకు సేవచేయండి. శని గురు, రాహు, కుజ జపహోమం నిర్వహించండి. ప్రత్యేక శని స్తోత్రం  అంగారక గురు, స్తోత్రం, శ్రీ సుదర్శనాష్టకం పారాయణం చేయండి.