Home » Rasi Phalalu » మీన రాశి రాశిఫలాలు 2015

మీన రాశి -  పూ.భా.4 (దీ)
     ఉ.భా.1,2,3,4(దూ,షం,ఝా,థా),రేవతి 1,2,3,4(దే,దో,చా,చి)
   ఆదాయము 2  వ్యయం 8 రాజపూజ్యం 1 అవమానం
7

 

ఈ రాశివారికి గురువు వత్సరాది 14.7.15 వరకు అనగా అధిక ఆషాఢ బ.త్రయోదశి మంగళవారము వరకు 5వ స్థానములో లోహమూర్తియై ఉండును. తదుపరి వత్సరాంతము 6వ స్థానములో లోహమూర్తియై ఉండును. రాహుకేతువులు వత్సరాది 29.1.16 అనగా పుష్య బ.పంచమి శుక్రవారము వరకు రాహువు 7వ స్థానమున కేతువు 1వ స్థానమున సువర్ణమూర్తులుగా యుందురు. తదుపరి వత్సరాంతము రాహువు 6వ స్థానమున  కేతువు 12వ స్థానమున రజితమూర్తులై యుందురు.

    ఈ విధమైన గ్రహస్థితి పరిశీలించి చూడగా ఈ సంవత్సరము గురుబలముచేత పూర్వార్థము అనుకూలంగా ఉన్నది అయిననూ మూర్తి నిర్ణయము ద్వారా విచారించిన తెలియనటువంటి ఆవేదన, ఆరాటము, నైరాశ్యము చోటు చేసుకునే అవకాశము గలదు. కాలయాపన, జాఢ్యము మీకు ప్రధాన శతృవులుగా మారకుండా జాగ్రత్త పడాలి. తమకు తెలియకుండానే ఊహలలో విహరించడము వలన సమయము వృధా అయ్యే అవకాశము గలదు. విదేశీ ప్రయత్నాలు సంవత్సరము చివర భాగంలో అనుకూలించవచ్చును. విద్యలో ముందడుగు వేస్తారు. సంతాన పురోగతి బాగుంటుంది. శుభ కార్యాచరణచేత ధనవ్యయము, అంచనాలకు మించి ధనము ఖర్చు అయ్యే సూచన గలదు. చాలా కాలంగా వాయిదా పడిన పనులను పూర్తి చేస్తారు. అపరిష్కృతముగా ఉన్న  సమస్యలు పరిష్కార దిశగా అడుగులు వేస్తాయి. కాని ప్రయాసచేత పనులు పూర్తి చేసే అవకాశము గలదు. మితిమీరిన ఆత్మ విశ్వాసము పనికిరాదు. వత్సరారంభములో ముఖ్యంగా బృహస్పతి పంచమస్థాన స్థితిచేత, గతములో జరిగిన అన్ని సంఘటనలలో నిజానిజాలు తెలుసుకుంటారు. స్థిరాస్థులు వృద్ధి చేసుకుంటారు. సంతానప్రాప్తి కలదు. అవివాహితులకు వివాహ ప్రాప్తి కలదు. సమాజంలో స్థాయి మరియు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ప్రభుత్వ పరంగా రావలసిన బకాయిలు కాని ఇతరమైన ప్రయోజనాలు కాని పొందుతారు. జీవిత భాగాస్వమియొక్క ఆరోగ్యము కొంత కలత చెందించవచ్చును. ఉద్యోగస్తులకు ప్రమోషన్లుగాని, తమ ఆధీనములో పనిచేయువారి సహకారాలు కాని లభించవచ్చును. ఇష్ట కన్యా ప్రాప్తి, నూతన వస్త్ర భూషణాదులు లభించుట, ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశము గలదు. ఉన్నత విద్యా ప్రాప్తి. విదేశీయాన ప్రయత్నాలు సఫలము కావచ్చును. చక్కని విశ్వ విద్యాలయంలో ప్రవేశము లభించవచ్చును. పుత్ర సంతానప్రాప్తి, గతంలో తాము పెట్టిన పెట్టుబడులకు చక్కని లాభాలు రావచ్చును. సమాజంలో ఉన్నతస్థాయిలో ఉన్న వారియొక్క పరిచయము, సాంగత్యము లభించవచ్చును. తీర్థయాత్ర సందర్శనము ఆదాయము యొక్క వనరులు పెరుగుట. నీతి, నిజాయితీగల వారియొక్క సహచర్యము లభించవచ్చును. తాము శ్రమించిన కార్యానికి తగిన ప్రశంసలు అందుకుంటారు. పేరు ప్రతిష్ఠ పెరుగుతుంది. తాము చేస్తున్న వృత్తిపట్ల పరిపూర్ణమైన సంతృప్తి కల్గియుంటారు. శతృవులపై విజయాన్ని సాధిస్తారు. అనగా శతృవులు తమకుతాము తమ ఓటమిని అంగీకరించని విధంగా మీ ప్రవర్తన ఉంటుంది. స్వాభిమానము పెరుగుతుంది. భాగస్వామ్య వ్యాపారాలలో లాభాలుగాని, సంతృప్తిగాని తాము ఆశించిన మేరకు ఉండకపోవచ్చును. స్థానచలనము కనపడుతున్నది. అనేక సమస్యలను తమ సలహాల వల్ల పరిష్కరిస్తారు. కొన్ని సందర్భాలలో అనగా వృత్తి ఉద్యోగాలలో అతిమంచితనము తమ అసమర్థతగా చేసుకునే అవకాశం గలదు. ఎముకలు, కీళ్ళకు సంబంధించిన అవస్థలు ఎదుర్కొనక తప్పని పరిస్థితి రావచ్చును. తమ సంతానము యొక్క పురోభివృద్ధికై దీర్ఘకాలిక, శాశ్వతంగా ఫలితమిచ్చే చక్కని ప్రణాళిక సిద్ధం చేస్తారు. ప్రశాంత జీవనానికై ఆరాటము, తపన పెరుగుతుంది. ఈ సంవత్సరమంతయు శని భాగ్యస్థాన స్థితివలన ప్రతి విషయం కూడా ప్రయాసచేత పూర్తిచేస్తారు. అయితే పనులలో కొంతవరకు సంతృప్తి పడవలసిన పరిస్థితి ఏర్పడవచ్చును. రావలసిన ధనము ఆలస్యమగును వాయిదాల రూపములో మిశ్రమ ఫలితముగా చేతికందవచ్చును. విద్యార్థులు ఉన్నత విద్యావిషయంలో కొంతవరకు సర్దుకుపోవలసిన పరిస్థితి ఎదురుకావచ్చును. శ్రీహయగ్రీవ స్తోత్ర పారాయణము చేయండి. సమయోచిత నిర్ణయాలు మేధాశక్తి, వృద్ధి అవుతాయి. వ్యాపారస్థులకు తొందరపాటు పనికిరాదు. రాత్రికి రాత్రి కోటీశ్వరులు కావాలనే ఆలోచన దరిరానీయకండి. సమయస్పూర్తి, సహనము అలవరచుకోవాలి. ఆలస్యంగానైనా పనులు పూర్తి చేసుకునే ప్రయత్నం చేయండి. విద్యార్థులు చిన్న చిన్న సంఘటనలకు నిరాశ చెందరాదు. ఆరోగ్యము అశ్రద్ధ చేయరాదు. స్నేహాల విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవాలి. నూతన గృహనిర్మాణము కొంత ప్రయాసచే సఫలము కావచ్చును. కోర్టు విషయాలు మధ్యమార్గంగా పరిష్కారమవుతాయి. రాజకీయ పరపతి కూడా లభిస్తుంది. దాంపత్య కలహాలు ఏర్పడే అవకాశము కలదు. పరోక్ష శతృవులను సమర్ధవంతంగా వారి మార్గములోనే ఎదురు కుంటారు. అనవసరమైన ఆవేశము అనర్థాన్ని కల్గిస్తుంది. కనుక సహనముతో మెదలండి. ఋణాలు ఇవ్వవలసిన దగ్గర ఋణముగా ఇచ్చిన ధనం రావలసిన దగ్గర చాలా ఓపిక అవసరము తొందరపాటు పనికిరాదు. స్థిరాస్థులు కొనుగోలు చేసే సమయంలో ఒకటికి రెండుసార్లు సంబంధిత పత్రాలను పరిశీలించండి. వృధా ప్రయాణాలు చేయవలసిన పరిస్థితి రావచ్చును. కులదైవాన్ని ఆరాధించండి. ఎక్కువగా నిర్వేదము ఏర్పడవచ్చును. అనాచారము, సంప్రదాయమునందు కొంత ఆసక్తి తగ్గుట, విలాసాలకు విహారాలకు క్షణిక సుఖాల కొరకు ప్రయత్నించుట జరుగ వచ్చును. వ్యాపారములు కొంత నెమ్మదిగా సాగే అవకాశముగలదు. ఎవరినైతే ఎంతగానైతే ఇష్టపడుచున్నారో వారి ప్రవర్తన అర్ధం కాకుండా ఉంటుంది. ఎదుటివారితో చెప్పుకోలేక తాను మ్రింగలేని పరిస్థితి ఎదురుకావచ్చును.
    
చట్టపరమైన విషయాలలో కొంత జాగ్రత్తలు అవసరము. ఆధ్యాత్మిక విషయాలు, ధార్మిక కార్యక్రమాలు చేయడంలో అనేక ఆటంకాలు ఎదురవుట, ధార్మిక విషయాలలో తాము ఎంత నిస్వార్థముగా ఉన్ననూ తమపై అనేకమైన నిందారోపణలు ఎదురవుట, ప్రతిపనికి ప్రతి కార్యానికి అనేకమైన ప్రశ్నలు ఎదురవుట విదేశీయాన ప్రయత్నాలు ప్రయాసచే సఫలమగును. వత్సరారంభంలో రాహువు సప్తమస్థాన స్థితిచేత, దాంపత్యపరమైన వివాదములు చికాకులు, స్త్రీ మూలక భయము కొన్ని ప్రత్యేక పరిస్థితులలో తాము ఎదుటివారితో చెప్పలేక తాను మ్రింగలేక అవస్ధలు ఎదురుకావచ్చును. జనవరి నుండి మాత్రము విదేశీ ప్రయాణాలు సఫలమగుట, విదేశాలలో ఉన్నవారికి శాశ్వత నివాసయోగ్యత లభించడము, తమ ఆధిక్యత పెరుగుట, తమను ఆదరించువారు లభించుట, పశ్చిమ దిశ లాభించును. ఋణబాధల నుండి విముక్తులగుట, చాలా సంవత్సరాలుగా అనుభిస్తున్న వ్యాధులనుండి ఉపశమనము లభించుట, నూతన వ్యాపారము ఆరంభించుటకు సన్నాహాలు చేయుట, తల్లి తోబుట్టువులకు అనారోగ్యము, మత పెద్దల పరిచయం, సమాజంలో మాత్రము గౌరవము, ప్రతిష్ట పెరిగే సూచనలు కలవు. వత్సరాంతములో మాత్రము ప్రయాణాలలో కొంత జాగ్రత్త అవసరం. వృధా ప్రయాణాలు అర్థంలేని ప్రయోజనం లేని ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు. లోకం దృష్టిలో చాలా బిజీగా ఉండటము, కాని వాస్తవంగా అందుకు విరుద్ధంగా ఉండే పరిస్థితులు గలవు. అర్థంకాని పరిస్థితి ఏర్పడే అవకాశము తరచు కనిపిస్తాయి. తద్వారా మనోవ్యథ. తోబుట్టువులతో అకారణ కలహాలు ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి. నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడని పెద్దల వాక్యము అందుచేత ఈ న్యాయాన్ని పాటించండి. అనుకోకుండా అంతవరకు అనుకూలంగా పరిస్థితులు కాస్త ప్రతికూలంగా మారడం. అగ్ని, వాహన సంబంధిత ప్రయాణాలు జరుగకుండా జాగ్రత్తలు వహించండి. ఖర్చులు విపరీతంగా పెరిగే అవకాశములు గలవు. నేత్ర బాధ అనుభవించక తప్పని స్థితి, ఆర్థిక విషయాలలో అతి మంచితనం మీ అసమర్ధత కావచ్చును. కుటుంబంలోని అనేకమైన గొడవలు, అశాంతిని తమ చాకచక్యంతో సరిచేస్తారు. ఉద్యోగస్తులు తమ ఉద్యోగంలో కొంత సహనము చూపాలి. అనవసరమైన తొందరపాటు అవేశము పనికిరాదు. వేతనం వృద్ధి కావచ్చును. కోరికలు విపరీతము, తీరకపోయే సరికి అసహనము, తమ స్థానాన్ని స్థాయిని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయండి. చర్మసంబంధమైన చికాకకులు బాధించవచ్చును. వాహనములు నడుపునపుడు తగు జాగ్రత్తలు వహించండి. జీవితంలో కొన్ని విషయాలలో వాస్తవాలు, నిజానిజాలు గ్రహిస్తారు. తాము చేసిన పొరపాట్లు సరిదిద్ధుకోవడానికి ప్రయత్నిస్తారు. దైవభక్తి పెరుగుతుంది. వైరాగ్యం కలుగుతుంది. మొత్తం మీద ఈ రాశివారికి సంవత్సర ఆరంభంలో అనుకూలంగా ఉన్నది. అయిననూ ప్రతిపని ప్రయాసచే పూర్తి చేస్తారు. కొంత ఓపిక, సహనము అవసరం. వివాదాలకు దూరంగాఉండండి. మధ్యవర్తిత్వము జరుపునపుడు జాగ్రత్తలు అవసరం. గోసేవ చేయండి. వీలు అయినంతవరకు నిరుపేద కన్యకు వివాహ సహాయం చేయండి. తులసి, వేప వృక్షాలను పెంచండి. సుదర్శనస్తోత్రం, శ్రీ విష్ణుసహస్ర నామ స్తోత్రం మేలు చేస్తుంది.