Read more!

హరీష్‌రావు రాజీడ్రామాలు చూసి జనం నవ్వుతున్నారు!

తెలంగాణలో అధికారం కోల్పోయిన షాక్ నుంచి ఇప్పటికీ తేరుకోని తండ్రీ కొడుకులు కేసీఆర్, కేటీఆర్ గత కొన్ని రోజులుగా జనంలోకి వచ్చి ఆడుతున్న డ్రామాలు చూస్తూ జనం ఫ్రీ ఎంటర్‌టైన్‌మెంట్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. ఆల్రెడీ కొద్దిరోజులు తండ్రి, అన్నలతో కలసి డ్రామాలాడిన బాలనటి కవిత ప్రస్తుతం తీహార్ జైల్లో రెస్టు తీసుకుంటోంది. ఇప్పుడు ఈ డ్రామా కంపెనీలోకి మరో ఛైల్డ్ ఆర్టిస్టు ఎంటరయ్యాడు. ఆ డ్రామా ఆర్టిస్టు మరెవరో కాదు... కేసీఆర్ ముద్దుల మేనల్లుడు హరీష్ రావు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ ఫ్యామిలీ ఎన్ని డ్రామాలు ఆడినా, ఉద్యమ స్ఫూర్తితో వున్న జనం నమ్మారు. ఎన్ని డ్రామాలు ఆడినా తెలంగాణ కోసమే కదా అని క్షమించారు. పదేళ్ళు అధికారంలో అహంకారంతో వ్యహరించినప్పుడు సమయం కోసం వేచి చూశారు. ఆ సమయం రాగానే గద్దె దించారు. అహంకారం, డ్రామాలు ఎప్పుడూ పనికిరావన్న విషయాన్ని తెలుసుకోలేని ఈ కుటుంబం ఇంకా తమ పంథా మార్చుకోకుండా జనంలో పరువు పోగొట్టుకుంటోంది.

రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీని ఆగస్టు 15వ తేదీ లోపల చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనను పట్టుకుని హరీష్ రావు డ్రామా క్రియేట్ చేశాడు. రేవంత్ రెడ్డి తాను చెప్పినట్టు ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తే తాను తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరాడు. అయితే రాజీనామా లేఖ రెడీగా పెట్టుకో, ఆగస్టు 15 తర్వాత నువ్వు ఇంటికి వెళ్ళడానికి సిద్ధంగా వుండు అని రేవంత్ రెడ్డి చెప్పడంతో హరీష్ రావు ఆత్మరక్షణలో పడ్డాడు. ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తే తాను తట్టాబుట్టా సర్దుకోవాల్సి వస్తుందని అర్థం చేసుకుని వెంటనే ప్లేటు తిప్పేశాడు. అయితే, నేను నా రాజీనామా లేఖ అమరవీరుల స్థూపం దగ్గరకి తెస్తా.. నువ్వూ నీ రాజీనామా లేఖ తీసుకుని  శుక్రవారం నాడు అక్కడకి రా అని సవాల్ విసిరాడు. ముఖ్యమంత్రి హోదాలో వున్న వ్యక్తి రాజీనామా లేఖ తీసుకుని అమరవీరుల స్థూపం దగ్గరకి వస్తాడా? కేసీఆర్ గవర్నమెంట్ అధికారంలో వున్నప్పుడు అలా ఎప్పుడైనా వచ్చిన దాఖలాలు వున్నాయా? ముఖ్యమంత్రి పరామర్శించాల్సిన సందర్భాల్లో అయినా ఆయన వెళ్ళిన చరిత్ర వుందా? వాళ్ళు మాత్రం ముఖ్యమంత్రి రాజీనామా లేఖ పట్టుకుని వాళ్ళు చెప్పిన దగ్గరకి రావాలి.

ముఖ్యమంత్రి ఎలాగూ రాడని తెలుసు, శుక్రవారం నాడు హరీష్ రావు అమరవీరుల స్థూపానికి ఏదో ముక్కుబడిగా నాలుగు పూలు చల్లేసి, ఒక నమస్కారం పారేసి సీఎం అక్కడకి రాలేదని ఫీలయ్యారు. స్పీకర్‌కి రాసిన రాజీనామా లేఖను అక్కడే వున్న మీడియా వాళ్ళకి ఇచ్చారు. రాజీనామా లేఖ అంటే స్పీకర్ ఫార్మాట్లో వుండాలి. తనకు చేతికి వచ్చినట్టు రాసి ఇదే రాజీనామా లేఖ అనుకో అంటే కుదరదు. హరీష్ రావు తన రాజీనామాలో ఏదేదో చేట భారతం అంతా రాశారు. ప్రస్తుతానికి ఇలా చేటభారతం రాజీనామా లేఖ రాశానని, రుణ మాఫీ చేశాక స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా లేఖ ఇస్తానని, ఆ తర్వాత ఉప ఎన్నికలో పోటీ కూడా చేయనని ప్రకటించారు. ఈ తిరకాసు వ్యవహారమంతా ఎందుకు? ఆ ఇచ్చేదేదో స్పీకర్ ఫార్మాట్లోనే రాజీనామా లేఖ ఇవ్వచ్చుగా.. 

మొన్నటి వరకు ‘ఆగస్టు 15 లోగా 2 లక్షల రైతు రుణ మాఫీ’ అనే పాయింట్ మీదే హడావిడి చేసిన హరీష్ రావు.. ఇప్పుడు అమరవీరుల స్థూపం దగ్గర ఇంకా ఏవేవో అంశాలను ప్రస్తావించి ఇవన్నీ నెరవేరిస్తేనే నా రాజీనామా లేఖను స్పీకర్ ఫార్మాట్లో ఇస్తా అని మెలిక పెట్టాడు. రాజీనామా చేసే దమ్ము లేనప్పుడు రాజీనామా సవాళ్ళు విసరసం ఎందుకు.. ఇప్పుడు రాజీనామా గండం నుంచి బయటపడటానికి పనికిరాని నాటకాలన్నీ ఆడటం ఎందుకు? రేపు ఆగస్టు 15 లోపు సీఎం రేవంత్ రెడ్డి రెండు లక్షల రుణమాఫీని చేయడంతోపాటు ఇంకెన్ని హామీలను అమలు చేసినా హరీష్ రావు ఏదో మెలికో, తిరకాసో పెట్టి రాజీనామా చేయకుండా తప్పించుకుంటాడని అందరికీ తెలిసిన విషయమే. ఈ మనుషులు ఎప్పటికి మారతారో!