Read more!

త్వరలో ఎండమిక్ దశకు కరోనా..!!

ప్రపంచాన్ని దడదడలాడిస్తున్న కరోనా మహమ్మారి త్వరలోనే ఎండమిక్ గా మారుతుందట. వచ్చే మార్చి నెల రెండో వారం నుంచి కరోనా నుంచి ప్రపంచ మానవాళికి కాస్త ఉపశమనం కలుగుతుందని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు.  అది కూడా కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించకుండా, అశ్రద్ధ చేయకుండా ఉంటే.. కొత్త వేరియంట్లు ఉనికిలోకి రాకపోతే మార్చి 11 నాటికి ఎండమిక్ గా మారుతుందని ఐసీఎంఆర్ వైద్య నిపుణుడు సమీరన్ పాండా అంచనా వేశారు.

వైద్య నిపుణులు చెప్పిన దాని ప్రకారం.. డిసెంబర్ 11 నుంచి మొదలైన కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేవ్ మూడు నెలలు ఉండే ఛాన్స్ ఉందట. ఆ లెక్క ప్రకారం చూస్తూ.. మార్చి 11 నుంచి ఎండమిక్ గా మారి కొంత ఉపశమనం కలిగించవచ్చట. దేశ రాజధాని ఢిల్లీ, దేశ ఆర్థిక రాజధాని ముంబైలలో కరోనా పీక్ స్థాయికి చేరిందా? అనే విషయం చెప్పేందుకు ఇంకో రెండు వారాలు వేచి చూడాలట. ఆ రెండు మహా నగరాల్లో కరోనా కేసులు, పాజిటివిటీ రేటు తగ్గుతున్నట్లు కనిపిస్తున్నా.. ఇప్పటికిప్పుడే ఓ నిశ్చితాభిప్రాయానికి రాలేమని ఐసీఎంఆర్ వైద్య నిపుణులు చెబుతుండడం గమనార్హం.

దేశంలో ఇప్పుడు కరోనా ఉగ్రరూపం దాల్చింది. కొత్త కేసులు రోజు రోజుకూ పెరిగిపోయి ఆందోళన కలిగిస్తున్నాయి. బుధవారం ఒక్క రోజులోనే మూడు లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవడం అందరినీ భయకంపితులను చేస్తోంది. బుధవారం ఒక్క రోజునే 491 మంది బాధితులు మృత్యువాత పడ్డారు.