నగరిలో వైసీపీ ఖాళీ.. రోజాకు జబర్దస్త్ ఓటమి ఖాయం?!

నగరిలో రోజా ఓటమే ధ్యేయంగా వైసీపీ స్థానిక నేతలు పని చేస్తున్నారా? వారికి మంత్రి పెద్దిరెడ్డి మద్దతు ఫుల్ గా ఉందా? అన్న అనుమానాలు చాలా కాలంగా ఉన్నాయి. ఆమెపై సొంత పార్టీ నేతలు గతంలో చేసిన అవినీతి ఆరోపణలు ఇందుకు నిదర్శనం. నగరిలో తనకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందనీ, సొంత పార్టీలోని కొందరు ఇందుకు సూత్రధారులనీ రోజా ఎంత మొరపెట్టుకున్నా వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ పట్టించుకోలేదు. ఒక దశలో ఆమెకు నగరి టికెట్ కూడా నిరాకరిస్తారన్న వార్తలు పార్టీ వర్గాల నుంచే వచ్చాయి. ఏమైతేనే మొత్తం మీద రోజా నగరి నుంచి పోటీలో నిలిచారు. ముచ్చటగా మూడో సారి విజయం సాధించి హ్యాట్రిక్ కొడతానని ధీమా కూడా వ్యక్తం చేశారు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు ఏ మాత్రం అనుకూలంగా లేవని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

తాజాగా నగరి లో ఐదు మండలాల వైసీపీ ఇన్ చార్జులు, ఆయా మండలాల్లోని నేతలూ పార్టీకి గుడ్ బై చెప్పాశారు. వైసీపీకి రాజీనామా చేయడమే కాదు, మీడియా సమావేశం ఏర్పాటు చేసి రోజాను నగరిలో ఓడించడమే తమధ్యేయమని ప్రకటించారు. నగరి బరిలో నిలిచిన రోజా నియోజకవర్గంలో తనను వ్యతిరేకించే పార్టీ నేతలను సస్పెండ్ చేయించగలిగారు. నియోజకవర్గంలో తనకు వ్యతిరేకంగా పని చేస్తూ, పార్టీకి నష్టం చేకూరుస్తున్నారంటూ జగన్ కు ఫిర్యాదు చేసి తన వ్యతిరేకులను సస్పెండ్ చేయించారు.

అలా సస్పెన్షన్ కు గురైన వారంతా మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు కావడంతో.. రోజా  నియోజకవర్గంలో పై చేయి సాధించారని అంతా భావించారు. అయితే ఇప్పుడు సీన్ తిరగబడింది. సస్పెన్షన్ కు గురైన వారితో పాటు వారి అనుచరులు కూడా పెద్ద సంఖ్యలో వైసీపీకి రాంరాం చెప్పేశారు. పార్టీలో ఉన్నంత కాలం అంతర్గతంగా రోజాకు వ్యతిరేకంగా పని చేసిన వీరంతా ఇప్పుడు బాహాటంగానే రోజాపై విమర్శలు గుప్పిస్తున్నారు.

ఆమె అవినీతిని విపక్షాలకు మించి ఎండగడుతున్నారు. రోజా ఓటమే లక్ష్యమంటూ శపథం చేస్తున్నారు. నగరి నుంచి వరుసగా రెండు సార్లు వైసీపీ నుంచి విజయం సాధించిన రోజాకు ఆ రెండు సార్లూ కూడా పెద్దపెద్ద మెజారిటీ ఏమీ రాలేదు. తొలి సారి బొటాబొటీగా గెలిచిన రోజా, 2019 ఎన్నికలలో జగన్ వేవ్ లో కూడా రెండు వేల ఓట్ల ఆధిక్యతతోనే విజయం సాధించారు. అటువంటిది ఇప్పుడు రోజాకు ఇంటా బయటా వ్యతిరేకత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో  ఏదో అద్భుతం జరిగితే తప్ప ఈ సారి ఆమె గట్టెక్కే పరిస్థితి లేదని పరిశీలకులు అంటున్నారు.      

తాజాగా రోజా ఓటమే లక్ష్యం అంటూ ఐదు మండలాల వైసీపీ ఇన్ చార్జ్ లు, వారితో పాటు ఆ మండలాల స్థానిక వైసీపీ నేతలు రాజీనామా చేశారు. ఇప్పుడు ఆ ఐదు మండలాల్లో రోజా కనీసం ప్రచారానికి వెళ్లే పరిస్థితి కూడా లేదని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి.