ఏపీలో ఫ్యాన్ కు గాలాడటం లేదా?

ఏపీలో వైసీపీకి గాలాడటం లేదు. ఆ పార్టీ శ్రేణుల్లోనే వైసీపీ ఓటమి ఖాయమన్న భావన వ్యక్తం అవుతోంది. చివరాఖరికి ఐప్యాక్ తాజాగా జగన్ కు సమర్పించిన నివేదికలో కూడా అదే విషయాన్ని పేర్కొంది.  ఇంత కాలం ఆ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న జగన్ సొంత సామాజిక వర్గం కూడా అధికార పార్టీకి దూరమైపోయింది.  దాదాపు అన్ని వర్గాలలోనూ పార్టీ పట్ల, జగన్ ప్రభుత్వం పట్ల వ్యక్తమౌతున్న వ్యతిరేకతతో ఫ్యాన్ కు గాలాడని పరిస్థితి ఏర్పడిందని వైసీపీ వర్గాలు అంటున్నాయి. 

ముఖ్యంగా వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులలో అధికార పార్టీ తీరు పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. 2014 నుంచి పార్టీ కోసం కష్టనష్టాలకోర్చి పని చేసిన తమను పక్కన పెట్టేసిన జగన్ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం అవుతోంది. వలంటీర్లను నమ్ముకుని తమను నిర్లక్ష్యం చేశారన్న కోపం వైసీపీ శ్రేణుల్లో కనిపిస్తోంది. గత కొన్నేళ్లుగా పార్టీ శ్రేణులలో ఈ తీరు కనిపిస్తున్నా వాలంటీర్లు ఉండగా భయమేల? చింతేల? అనుకున్న జగన్ కు ఇప్పుడు వాలంటీర్లు కూడా మొండి చేయి చూపడానికి రెడీ అయిపోయారని పరిశీలకులు అంటున్నారు.  చంద్రబాబు ప్రకటించిన పదివేల రూపాయల హామీ, వారిని తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మార్చేసిందా? ప్రభుత్వం చెప్పినట్లల్లా చేయకుండా తటస్థంగా ఉండటమే మేలన్న నిర్ణయానికి వచ్చేశారా? అంటే రాజీనామాలు చేసేది లేదని భీష్మిస్తున్న వారిని చూస్తే అదే నిజమని అనిపించకమానదు. వచ్చే ఎన్నికలలో వైసీపీ ఓటమి ఖాయమని వాళ్లూ వీళ్లూ కాదు.. ఏకంగా  ఐ ప్యాక్ తేల్చేసిందని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఈ మేరకు ఇప్పటికే ఐ ప్యాక్ తన తాజా నివేదికను వైసీపీకి అందించిందని అంటున్నారు.

ఆ నివేదిక తరువాత వైసీపీలో ఇంకా దింపుడు కళ్లెం ఆశ మిగిలిందని అంటున్నారు. ఎందుకంటే మహిళల్లో అత్యధిక శాతం వైసీపీ పట్లే మొగ్గు చూపుతున్నారనీ, అదే సమయంలో మిగిలిన అన్ని వర్గాలూ తెలుగుదేశం కూటమికి మద్దతు ప్రకటిస్తున్నారనీ ఐప్యాక్ పేర్కొంది. మహిళల మద్దతు ఉంటే చాలు గెలుపు తధ్యమని వైసీపీ అగ్రనాయకత్వం భావిస్తోందని  పార్టీ  వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే వైసీపీ శ్రేణులు మాత్రం మొత్తం వైసీపీ పని అయిపోయిందన్న నివేదిక ఇస్తే జగన్ ఆగ్రహానికి గురౌతామన్న జంకుతోనే ఐప్యాక్ మహిళల మద్దతు అంటూ నివేదికలు ఇచ్చిందనీ, వాస్తవానికి మహిళల్లోనే జగన్ పాలన పట్ల ఆగ్రహం ఎక్కువగా కనిపిస్తోందని అంటున్నాయి. ఐప్యాక్ కంటే తామే ఎక్కువగా క్షేత్ర స్థాయిలో ఉంటామనీ, తమకు కనిపించిన ఆగ్రహం ఐప్యాక్ కు ఎందుకు కనిపించలేదో అర్ధం కావడం లేదనీ చెబుతున్నాయి.

అంతే కాదు..  క్రైస్తవ సమాజంలోనూ జగన్ పట్ల వ్యతిరేకత కానవస్తోందని చెబుతున్నాయి. ఐప్యాక్ తన నివేదికలో క్రైస్తవుల ఓట్లన్నీ గంపగుత్తగా వైసీపీవైపే ఉన్నాయని పేర్కొందనీ, అయితే వాస్తవం అందుకు భిన్నంగా ఉందనీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  ఒక్క బీజేపీ పోటీ చేసే స్థానాలలో మాత్రమే కూటమికి ఒకింత ఇబ్బందికరమైన పరిస్థితి కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే కూటమి వ్యతిరేక ఓట్లు గంపగుత్తగా వైసీపీ వైపు మళ్లే అవకాశం లేదనీ, ఆయా స్థానాలలో వారు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారనీ అంటున్నారు. 

ఇక ముస్లిం మైనారిటీల విషయంలో వారిలో అధికార వైసీపీ పట్ల తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తోంది. నిన్న మొన్నటి వరకూ ముస్లిం మైనారిటీలంతా కూటమికే మద్దతుగా నిలిచారనీ, అయితే గత రెండు రోజులుగా సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజస్థాన్ లో ప్రధాని మోడీ ఏపీ పేరు ప్రస్తావిస్తూ ముస్లిం రిజర్వేషన్లపై చేసిన వ్యాఖ్యలు వారిలో కూటమి పట్ల విముఖతకు కారణమయ్యాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో ముస్లిం మైనారిటీలు కాంగ్రెస్ వైపు మళ్లే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు. 

 కడప, గుంటూరు, కర్నూలు, నంద్యాల వంటి ముస్లిం ప్రభావిత నియోజకర్గాల్లో సైతం అధికారపార్టీ పట్ల స్పష్టమైన వ్యతిరేకత కనిపిస్తోంది.   బీజేపీ పోటీ చేసే నియోజకవర్గాల్లో  కూడా మైనారిటీలు వైసీపీ వైపు కాకుండా కాంగ్రెస్ వైపు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోందని చెబుతున్నారు. అయితే తెలుగుదేశం, జనసేన అభ్యర్థులు పోటీ చేసే నియోజకవర్గాలలో మాత్రం ముస్లింల మద్దతు కూటమి అభ్యర్థులకే ఉంటుందని అంటున్నారు. మొత్తం మీద రాష్ట్రంలోని అన్ని వర్గాలలోనూ అధికార వైసీపీపై వ్యతిరేకత వ్యక్తమౌతోందని ఐప్యాక్ నివేదిక సహా ఇప్పటి వరకూ వెలువడిన సర్వేల ఫలితాలన్నీ తేల్చేయడంతో మానసికంగా వైసీపీ నేతలు కూడా ఓటమి తప్పదన్న నిర్ణయానికి వచ్చేశారనీ, అది వారి ప్రచార సరళిలో ప్రస్ఫుటంగా కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.