నీటి చర్చలు... ఆంధ్రాకి ఎంత శాతం ? తెలంగాణకి ఎంత శాతం?

కృష్ణా , గోదావరి నదీ బేసిన్ పరిధిలో తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాలపై మరో దఫా చర్చించేందుకు కేంద్ర జలశక్తి శాఖా సిద్ధమైంది. ఈ సమావేశానికి కేంద్ర ప్రతినిధితో పాటు రెండు రాష్ట్రాలకు చెందిన జల వనరుల శాఖా ముఖ్య అధికారులు హాజరవుతున్నారు. ఈ సమావేశాల్లో నీటి వినియోగంతో పాటు కొంత కాలంగా పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టుల అంశం కూడా చర్చకు వచ్చే అవకాశముంది. రెండు రాష్ట్రాల మధ్య నీటి వినియోగం విషయంలో పారదర్శకత ఉండటం కోసం ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తీసుకురావాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ విషయంలో ఏపీ కాస్త తటస్థంగా ఉన్నప్పటికీ తెలంగాణ మాత్రం ఒప్పుకోలేదు. 

ప్రాజెక్టులను బోర్డు పరిధి లోకి తీసుకొస్తే ప్రతి అంశం మరింత జటిలమవుతుంది తెలంగాణా అధికారులు వాదిస్తున్నారు. అంతేకాదు రాష్ట్ర విభజన సందర్భంగా ప్రాజెక్టుల వారీగా ఇంకా పూర్తిస్థాయిలో కేటాయింపులు జరగలేదు. దీంతో తెలంగాణ చేపడుతున్న కొత్త ప్రాజెక్టులకు ఇది ఇబ్బందికరంగా మారనుంది. దీంతో ఈ ప్రతిపాదనను మొదటి నుంచి వ్యతిరేకిస్తోంది. నేడు జరగబోయే మీటింగ్ లో దీనిపై మరింత క్లారిటీ వచ్చే అవకాశముంది. ఇప్పటికే రబీ సీజన్ ప్రారంభం కావటంతో ప్రధాన ప్రాజెక్టులోని నీటి వాడకం విషయంలో కృష్ణా బోర్డులో మరోసారి చర్చకు వచ్చే అవకాశముంది. ప్రస్తుతం శ్రీశైలం, నాగార్జున సాగర్ లో కనీస నీటి మట్టానికంటే అదనంగా 250 టీఎంసీల నీరు ఉంది. ఈ నీటిని కూడా రెండు రాష్ట్రాలు ఏ నిష్పత్తిలో వినియోగించుకోవాలనే అంశం కూడా చర్చించనున్నారు. ఇప్పటి వరకూ తెలంగాణ 34 శాతం, ఏపీ 66 శాతం పద్ధతిలో కృష్ణా జలాలను వాడుకుంటున్నాయి.

ఇప్పటి వరకు తెలంగాణకు కేటాయించిన జలాల కంటే తక్కువగా వాడుకున్న నేపధ్యంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటిలో 150 టీఎంసీలను కేటాయించాలని తెలంగాణ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రధానంగా కృష్ణా నది నీటి యాజమాన్య బోర్డును విజయవాడకు తరలించాలని విభజన చట్టంలో స్పష్టంగా ఉంది. దీని తరలింపునకు అయ్యే ఖర్చును రెండు రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలని చట్టం చెబుతోంది. అయితే ప్రస్తుతం ఏపీలో రాజధాని విశాఖకు తరలింపు నేపథ్యంలో బోర్డు పరిస్థితి ఏంటనేది సందిగ్ధంలో పడింది. విభజన చట్టం ప్రకారం విజయవాడకు తరలిస్తారా లేదా హైదరాబాద్ లోనే కొనసాగిస్తారా అనేది తాజా బోర్డ్ మీటింగ్ లో స్పష్టత వచ్చే అవకాశముంది.