ఏపీ పోలింగ్ సరళి ఎలా ఉండబోతోందో చెప్పేసిన పోస్టల్ బ్యాలెట్!

ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ సరళి ఎలా ఉండబోతోందో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ తీరు తేల్చి చెప్పేసింది. ఏపీలో ప్రభుత్వోద్యోగులు, టీచర్లు మున్నెన్నడూ ఎరుగని విధంగా ఓ విధమైన కసితో పోస్టల్ బ్యాలెట్ ను ఉపయోగించుకున్న తీరు ప్రభుత్వంపై వారి వ్యతిరేకత, ఆగ్రహం ఏ స్థాయిలో ఉందో తేటతెల్లం చేసింది. పోస్టల్ బ్యాలెట్ ను  ఉపయోగించుకుని ఓటేసి ఊరుకోలేదు. తాము ఓటు వేశామని చేతికి సిరా చుక్క గుర్తుతో ఫొటోలు తీసుకుని సామాజిక మాధ్యమంలో పోస్టు చేసి.. మిగిలిన వారిని కూడా వారి ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రోత్సహించారు. అందుకే గతంలో  ఈ సారి ఏపీలో పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకుని ఓటు వేసిన వారి సంఖ్య గత రికార్డులన్నిటినీ బ్రేక్ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 13 లక్షల మంది ప్రభుత్వోద్యోగులు ఉంటే వారిలో దాదాపు ఐదు లక్షల మందికి పైగా ఎన్నికల విధుల్లో ఉన్నారు. అలా ఎన్నికల విధులలో పాల్గొంటున్న ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ కోసం రిజిస్టర్ చేసుకున్నారు.  
  
గత ఎన్నికలలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసిన వారి సంఖ్య 2 లక్షల 38 వేల మంది అయితే.. ఈ సారి అలా ఓటు హక్కు వినియోగించుకున్న వారి సంఖ్య రెట్టింపు కంటే ఎక్కువ. రాష్ట్రంలోని పాతిక పార్లమెంటరీ నియోజకవర్గాలలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా పడిన ఓట్ల సంఖ్య 4లక్షల 44 వేల 216, అదే 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు  4,44,218 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. ఈ సంఖ్యే ప్రభుత్వంపై ప్రభుత్వోద్యోగులలో ఉన్న వ్యతిరేకత, ఆగ్రహం ఏ స్థాయిలో ఉందో ప్రస్ఫుటంగా చూపుతోంది. ఒక వేళ ప్రభుత్వంపై ఉద్యోగులకు పాజిటివ్‌ ఇమేజ్‌ ఉంటే ఓటు వేయడానికి ఆసక్తి చూపించరు కానీ వ్యతిరేకత ఉంటేనే ఓటు రూపంలో చూపిస్తారు.

అంతే కాకుండా మేధావులుగా, విద్యావంతులుగా ప్రభుత్వోద్యోగుల మొగ్గు ఒక్క వారికి సంబంధించినదే అయి ఉండదు. ఒపీనియన్ మేకర్స్ గా వారు సమాజంలోని  ఇతర వర్గాలను కూడా ప్రభావితం చేయగలరు. అందుకే పోస్టల్ బ్యాలెట్ ల ఫలితం వెలువడిన వెంటనే  ఎన్నికల ఫలితం ఎలా ఉంటుందో అర్ధమైపోతుందని రాజకీయ పండితులు చెబుతుంటారు.    ఐదేళ్లుగా తమకు అన్యాయం చేస్తూ, వేధింపులకు, అవమానాలకు గురి చేసిన ప్రభుత్వంపై కసితోనే ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ను ఉపయోగించుకున్నారన్న అభిప్రాయమే సర్వత్రా వ్యక్తం అవుతోంది. పోస్టల్ బ్యాలెట్ ఈ నెల 13న జరగబోయే ఓటింగ్ సరళి ఎలా ఉంటుందో కూడా చెప్పేసిందని అంటున్నారు.