ఏపీ ఫలితాలపై కేసీఆర్ బానిసల ఊహలు!!

చంద్రబాబు నాయుడు అంటే కేసీఆర్‌కి విపరీతమైన ద్వేషం. ఎందుకంటే, ఆ రోజుల్లో కేసీఆర్ తోక కట్ చేసింది చంద్రబాబు. అలా తోక కట్ చేయడం వల్లే కేసీఆర్ తెలంగాణ ఉద్యమం చేశాడు. యువతరం ఆత్మబలిదానాల వల్ల తెలంగాణ వస్తే, దాన్ని తన గొప్పగా కలరింగ్ ఇచ్చి, పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఘోరమైన పాలన అందించాడు. తాను ముఖ్యమంత్రి అవడానికి పరోక్షంగా చంద్రబాబు కారణం అయినప్పటికీ కేసీఆర్‌కి చంద్రబాబు అంటే ద్వేషం. కేసీఆర్ అధికారంలో వున్న పదేళ్ళకాలంలో చంద్రబాబు మీద ఆయన చేయని కుట్ర లేదు.. పన్నని కుతంత్రం లేదు.. ఇప్పుడు తెలంగాణ ప్రజల చేత ఛీ కొట్టించుకుని, అధికారం కోల్పోయిన కేసీఆర్ ఇప్పటికీ చంద్రబాబు మీద విషం కక్కుతున్నాడు. ఏపీలో జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తాడని తన దగ్గర సమాచారం వుందని వీలైనచోటల్లా ఎవరూ అడక్కపోయినా చెబుతూ నోటి దురద తీర్చుకుంటున్నాడు. 
చంద్రబాబు శిష్యుడు రేవంత్‌రెడ్డి దెబ్బకి అధికారం కోల్పోయిన కేసీఆర్ లబోదిబో అంటున్నాడు. ఇలాంటి సమయంలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే కేసీఆర్ తట్టుకోగలడా.. అటు గురువు, ఇటు శిష్యుడు అధికారంలో వుంటే కేసీఆర్ కుళ్ళుకుని, క్రుంగి కృశించిపోతాడు. అందుకే చంద్రబాబు అధికారంలోకి రాడు అని విషప్రచారం చేయడానికి కేసీఆర్ వెనుకాడటం లేదు. మొన్నటి ఎన్నికలలో ఈయన గెలుస్తాడో, గెలవడో ఈయనకి తెలియదుగానీ, ఏపీ ఎలక్షన్ల గురించి ఈయన జోస్యం చెబుతున్నాడు. ఈసారి పార్లమెంట్ ఎన్నికలలో 17 స్థానాలున్న తెలంగాణలో ఒక్క స్థానం కూడా బీఆర్‌ఎస్‌కి వచ్చే అవకాశాలు లేవని సర్వేలు చెబుతున్నాయి. తనకు గెలవటం చేతకాదుగానీ, చంద్రబాబు ఓడిపోతాడని ఈయన పనికిమాలిన జోస్యాలు చెబుతున్నాడు.

కేసీఆర్ వ్యవహారం అలా వుంటే, కేసీఆర్ మోచేతి నీళ్ళు తాగుతూ బతుకులు వెళ్ళదీస్తున్న ఆయన సొంతమీడియాలో పనిచేసే బానిసలు కూడా ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాడు అంటూ కథనాలు వండుతున్నారు. వాటిని సోషల్ మీడియాలో వ్యాప్తి చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు అరెస్టు అయినప్పుడు పొరుగు రాష్ట్రం గొడవలు మా రాష్ట్రంలో ఎందుకు అంటూ వదరుగా మాట్లాడిన కేటీఆర్ మనుషులు ఇప్పుడు పొరుగు రాష్ట్రం ఎన్నికల గురించి ఎక్కడలేని ఇంట్రస్టు చూపిస్తూ కథనాలు వ్యాప్తి చేస్తున్నారు. 

బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలు ఇప్పటికే చెత్తకుండీలో వేసేశారు. ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్ పార్టీ డైరెక్ట్.గా డంపింగ్ యార్డుకు చేరుకుంటుంది. బీఆర్ఎస్ డంపింగ్ యార్డుకు చేరుకుంటే కేసీఆర్ మోచేతి నీళ్ళు తాగుతూ బతికే జనాలకు పోషణ వుండదు. అందుకే చంద్రబాబు మీద విష ప్రచారం చేస్తూ, తాము చేస్తున్న విష ప్రచారం నిజం కావాలని కోరుకుంటున్నారు. ప్రజలు మాత్రం వీళ్ళ ఆకతాయితనాన్ని గమనిస్తున్నారు.