కడప ఓటు.. ఒకటి అటు.. ఒకటి ఇటు.. అవినాష్ పనైపోయిందా?

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. గెలుపు ఓటములపై సర్వేలన్నీ వార్ వన్ సైడే అని చెబుతున్నాయి. అధికార పార్టీ నేతల తీరులో కానీ, స్వయంగా ఆ పార్టీ  అధినేతలో కూడా ఓటమి భయం ప్రస్ఫుటమౌతోంది. ఎన్నికలు స్వేచ్ఛగా, సజావుగా జరుగుతాయన్న నమ్మకం లేదని  స్వయంగా జగన్ ప్రకటించి కాడె పడేసినట్లు చెప్పేశారు. దీంతో వైసీపీ శ్రేణులలో నైరాశ్యం కానవస్తోంది. ఇవన్నీ ఆ పార్టీ ఎన్నికల ప్రచారంలో ప్రతిఫలిస్తున్నాయి. ఇక ఉద్యోగులు, టీచర్లు నభూతో అన్న చందంగా పెద్ద ఎత్తున పోస్టల్ బ్యాలెట్ ను ఉపయోగించుకున్నతీరు కూడా వైసీపీ ఓటమి ఖాయమన్న సంకేతాన్నే ఇచ్చింది. 

అయితే రాష్ట్ర మంతో ఒకెత్తు అయితే రాయలసీమది ఒక్కటీ ఒకెత్తు. మరీ ముఖ్యంగా కడప జిల్లా పరిస్థితే వేరు అని అంతా అంటుంటారు. కడప జిల్లాలో వైఎస్ ముద్ర అత్యంత బలంగా ఉంటుంది. ఆయన సీఎం కావడానికి ముందు నుంచీ కూడా కడప అంటే కాంగ్రెస్ కంచుకోట అని చెప్పుకున్నా.. ఆ జిల్లాలో కాంగ్రెస్ బలం మొత్తం వైఎస్ బలమేనన్నది తెలిసిందే. వైఎస్ మరణానంతరం వైఎస్ బలం, బలగం జగన్ కు బదలీ అయిపోయింది. 2014, 2019 ఎన్నికలలో ఇది స్పష్టంగా కనిపించింది. 2024 ఎన్నికలలోనూ అదే పరిస్థితి అని అంతా భావించారు. అయితే షర్మిల కాంగ్రెస్ రాష్ట్ర పగ్గాలు చేపట్టి, కడప ఎంపీగా పోటీలోకి దిగడంతో కడపలో కూడా స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. అలా అని వైఎస్ ను అభిమానించేవారంతా ప్లేటు ఫిరాయించి.. జగన్ కు దూరం జరిగి షర్మిల పంచకు వచ్చేసిన పరిస్థితీ లేదు.

ఇప్పుడు ఏపీలో సార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. దీంతో వైఎస్ అభిమానులంతా ఒక నిర్ణయానికి వచ్చేశారు. కడపలో ఒక ఓటు అటు, ఒక ఓటు ఇటు అని డిసైడైపోయారు. అంటే కడప లోక్ సభ స్థానంలో  ఒక  పార్టీ అభ్యర్థికి ఓటేస్తే, ఆ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ స్థానాలలో మరో పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని కడప ఓటర్లు భావిస్తున్నారని పరిశీలకుల విశ్లేషణ. వారి విశ్లేషణ ప్రకారం అసెంబ్లీ ఎన్నికల వద్దకు వచ్చే సరికి వైఎస్ కుమారుడైన జగన్ పార్టీ వైసీపీ అభ్యర్థికి, కడప లోక్ సభ ఎన్నికలలో వైఎస్ కుమార్తె వైఎస్ షర్మిలకు ఓటు వేయాలని మెజారిటీ జనం భావిస్తున్నారు. అదే జరిగితే కడప లోక్ సభ వైసీపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి పనైపోయినట్లే అనడంలో సందేహం లేదు.

కడప లోక్ సభ లో వైసీపీ ఓట్లను భారీగా షర్మిల తన ఖాతాలో వేసుకుంటారు. తెలుగుదేశం కూటమి ఓట్ల లో ఎటువంటి చీలికా ఉండదు. దీంతో అవినాష్ కు అంటే వైసీపీకి భారీ నష్టం వాటిల్లుతుంది. వైసీపీ ఓట్లలో భారీ చీలిక అనివార్యమని షర్మిల ప్రచారానికి వస్తున్న విశేష జనస్పందనే చెబుతోంది. దీంతో  కడప లోక్ సభ ఎన్నికలలో పోటీ కాంగ్రెస్, తెలుగుదేశం కూటమి మధ్యే అన్న వాతావరణం కనిపిస్తోంది.  వైసీపీ వీరభక్త హనుమాన్ వంటి కేడర్, నేతలూ కూడా వైఎస్ కుమార్తెకు ఓ ఓటు వేద్దాం అన్న అభిప్రాయాన్నే వ్యక్తం చేస్తున్నారు.