2021 నుండి తెలుగులోనూ ఐఐటీ జేఈఈ పరీక్ష

 

తెలుగు విద్యార్థులకు తీపి కబురు అందించింది కేంద్రం. ఇకపై జేఈఈ మెయిన్ పరీక్షను తెలుగులో కూడా నిర్వహించనున్నారు. ఈ మేరకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు సమాచారం. పరీక్ష నిర్వహణపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏకి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ఈ నిర్ణయాన్ని 2021 లో నిర్వహించే పరీక్షల నుంచి అమలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. 

ప్రస్తుతం జేఈఈ మెయిన్ పరీక్షను ఇంగ్లిష్, హిందీ భాషల్లో నిర్వహిస్తున్నారు. తాజా ప్రతిపాదన ప్రకారం ఇకపై తెలుగుతో పాటు అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మరాఠి, ఒడియా, తమిళం, ఉర్దూ భాషలోనూ నిర్మించనున్నారు. జేఈఈ పరీక్షలను ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలనే డిమాండ్లు చాలా ఏళ్ల నుంచి ఉన్నాయి. కానీ దీనిపై గత ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. మోదీ సర్కారు మాత్రం కీలక నిర్ణయం తీసుకోవటం గమనార్హం. జేఈఈ మెయిన్ పరీక్షకు ఆయా రాష్ట్రాల నుంచి వచ్చే దరఖాస్తుల సంఖ్యను బట్టి ఆ ప్రాంతీయ భాషల్లో పరీక్ష నిర్వహించాలని నిర్ణయించింది. ప్రఖ్యాత ఇంజినీరింగ్ విద్యా సంస్థలైన ఐఐటీ, ఎన్ఐటీల్లో చదువుకోవాలన్నది ప్రతి విద్యార్థి కల..కానీ అదంత సులువు కాదు. సబ్జెక్టు పై అవగాహన ఉండి భాష సమస్యతో జేఈఈ మెయిన్ పరీక్షకు దూరమవుతున్న వారిని దృష్టిలో పెట్టుకొని కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. 

ఏటా తెలంగాణ , ఆంధ్రా నుండి సుమారు రెండు లక్షల మంది విద్యార్థులు జేఈఈ మెయిన్ పరీక్షకు హాజరవుతారు. ప్రస్తుతం జేఈఈ మెయిన్ పరీక్షను ఇంగ్లిష్, హిందీ భాషల్లో నిర్వహిస్తున్నారు. ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు ఈ పరీక్ష అందని ద్రాక్షగానే మారింది. అదే సమయంలో గ్రామీణ ప్రాంతాలు ప్రభుత్వ విద్యాసంస్థల నుంచి కూడా పలువురు విద్యార్థులు సత్తా చాటుతున్నారు. ఇలాంటి వారికి జేఈఈ మెయిన్ ను తెలుగులో నిర్వహిస్తే ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది. ఇంగ్లిష్ భయం తొలగిపోయి ఉత్తమ ర్యాంకులు సాధించే అవకాశం ఉంటుంది. అయితే ఆ విద్యార్థులకు ఎన్ఐటీల్లో సీట్లు వస్తే పరిస్థితి ఏంటనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ఎన్ఐటీ చదువులు పూర్తిగా ఇంగ్లీషుమయం.