ఫోనే లేకుండా నంబరెక్కడిది జగన్ రెడ్డీ!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తాను చెప్పే అబద్ధాలు గోడకట్టినట్లు కాదు కదా కనీసం తడికె కట్టినట్లు కూడా ఉండటం లేదు. ఎప్పటికప్పుడు అవాస్తవాలు ప్రచారంలోకి తీసుకురావడం, అడ్డంగా దొరికిపోయి నవ్వుల పాలు కావడం జగన్ కు ఒక ఆనవాయితీగా, ఒక అలవాటుగా మారిపోయింది. మనమంతా సిద్ధం బస్సుయాత్రలో భాగంగా జరిగిన గులకరాయి దాడిని హత్యాయత్నంగా అభివర్ణించి ఎన్నికలలో సానుభూతి లబ్ధి కోసం చేసిన ప్రయత్నం ఎలా బూమరాంగ్ అయ్యిందో తెలిసిందే.

గాయం తగిలిందంటూ డజను మంది డాక్టర్ల బృందంతో చికిత్స చేయించుకుని అందుకు సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో వైరల్ చేసి, గాయానికి పెద్ద పట్టీ వేసుకుని మరీ ప్రచారం నిర్వహించిన జగన్ ఆ పట్టీ తీసేయగానే నుదుటిపై గాయానికి సంబంధించి చిన్న మచ్చ, గీత కూడా లేకపోవడం వైద్య శాస్త్రంలోనే అద్భుతంగా అభివర్ణిస్తూ నెటిజన్లు ఓ రేంజ్ లో కామెంట్లు పెట్టారు. ఆయన ఐదేళ్ల పాలనలో ఇటువంటి అద్భుతాలు ఎన్నో జరిగాయి.   తాజాగా ఒక చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ తనకు ఫోనే లేదంటూ ఓ బ్రహ్మాండమైన విషయం వెల్లడించారు. జగన్ తనకు ఫోన్ లేదు అని చెప్పి నెటిజనులకు అడ్డంగా బుక్కైపోయారు. ఫోన్ లేదు అని చెప్పి ఊరుకోకుండా ఆయన ఒక వేళ ఫోన్ ఉన్నా ఆ ఫోన్ నంబర్ కూడా తనకు తెలియదని మరో  మాట అన్నారు. ఫోన్ లేకుండా నంబర్ ఎందుకు ఉంటుంది జగన్ భాయ్ అంటూ నెటిజనులు జోకులు పేలుస్తున్నారు.  

ఇంకా స్పష్టంగా జగన్ తన ఫోన్ బాగోతం ఎలా చెప్పారంటే... తన దగ్గర ఫోన్ లేదు అన్నారు. అలా అని ఊరుకోకుండా  ఫోన్ నంబర్ కూడా లేదు. అసలు నా ఫోన్ నెంబర్ నాకే తెలియదు అని సాగదీశారు. ఫోనే లేకపోతే.. నంబర్ ఎక్కడ నుంచి వస్తుంది సీఎం గారూ అని నెటిజనులు నిలదీస్తున్నారు. అదే సమయంలో ఉన్న రాజధానిని నిర్వీర్యం చేసేసి మూడు రాజధానులు కట్టేసినట్లే లేని ఫోన్ కు కూడా నంబర్ ఉందేమో అంటూ జోకులేస్తున్నారు.  

అదే సమయంలో  పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీకి నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా జగన్ తన అఫిడవిట్లో పోన్ నంబర్ ఇచ్చారు. ఆ ఫోన్ నెంబర్ ఎ9849904123. ఫోన్ లేని జగన్ కు నంబర్ ఎలా వచ్చింది. అసలు తనకే తెలియని నంబర్ ను అఫిడవిట్లో ఎలా పేర్కొన్నారు.  అంటూ నెటిజనులు ప్రశ్నలు సంధిస్తుండటంతో అసలా ఇంటర్వ్యూ ఇవ్వనేల.. ఇచ్చితిని పో ఫోన్ బాగోతం గురించి చెప్పనేల? అంటూ జగన్  తల బాదుకుంటూ ఉండొచ్చు.