నువ్వా-నేనా ?.. దాడి ప్రతిదాడులతో యుద్ధ వాతావరణంలో అమెరికా-ఇరాన్

రెండు దేశాలు ఎక్కడ తగ్గటం లేదు.. నేనంటే నేను అంటూ దాడులు చేస్తూనే ఉన్నాయి. ఇరాన్ మిలిటరీ కమాండర్ సులేమాణి హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించింది ఇరాన్ ప్రభుత్వం. ఇరాక్ లోని అమెరికా స్థావరాలపై గురిపెట్టి.. అమెరికా స్థావరాలైన అల్లాసత్, ఇర్బిల్ ఎయిర్ బేస్ లపై ఇరాన్ రాకెట్ దాడులు చేసింది. అమెరికా స్థావరంపై కనీసం 12 కు పైగా రాకెట్లను ప్రయోగించినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో అమెరికా సైనికులకు జరిగిన నష్టం పై ఇంకా స్పష్టత రాలేదు. ఎయిర్ బేస్ లపై దాడిని పెంటగాన్ ధ్రువీకరించింది. ఈ దాడిలో జరిగిన నష్టం పై అమెరికా అంచనా వేస్తోంది. ఇరాక్ లో ఇరాన్ రాకెట్ దాడులను అధ్యక్షుడు ట్రంప్ నిశితంగా గమనిస్తున్నారని అన్నారు అమెరికా రక్షణ శాఖ అధికారి. తాము కూడా సరైన సమయంలో బదులిస్తామని అమెరికా రక్షణ శాఖ ప్రకటించింది. దాడులపై పూర్తి నివేదికను ట్రంప్ కు సమర్పించామని ఆయన దానిపై తదుపరి చర్యలు తీసుకుంటారని వైట్ హౌజ్ వెల్లడించింది. ఇరాన్ దాడుల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తీవ్రరూపం దాల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.