హైదరాబాద్ లో రిపబ్లిక్ వేడుకల ప్లేస్ ఎందుకు మారిందో  తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే

జెండా వందనం ఇంత మొక్కుబడిగా జరుగుతుందని మన స్వాతంత్య్ర సమర యోధులు, జాతీయ నాయకులు గతంలో ఎవరూ ఊహించి ఉండరు. వారిప్పుడు ఎవరూ లేరు గనక బతికిపోయారు. లేకపోతే ఇప్పటి మన నాయకుల నిర్లక్ష్య వైఖరికి నిలువెల్లా కుంగిపోయి ఉండేవారు. జాతీయ జెండాను చూస్తేనే దేశభక్తితో పులకించిపోతారు పసిపిల్లలు. ఏడాదికి రెండుసార్లు వచ్చే ఈ జాతీయ పండుగ దినాల కోసం పాఠశాలల్లో అయితే దాదాపు 15 రోజుల ముందు నుంచే ప్రిపరేషన్స్ జరుగుతూ ఉంటాయి. ఆ రోజున పిల్లలకు ఓ రెండు చాక్లెట్లో, ఒక జిలేబీనో ఇస్తారు. అంతదానికే వారు ఆ 15 రోజులూ దేశభక్తి గీతాలాపనలతో, ఆట పోటీల్లో పర్ఫామెన్స్ కోసం ఎన్నో కసరత్తులు చేస్తుంటారు. అసలు ఏ పండుగకూ లేనంత జోష్ ఈ జాతీయ పర్వ దినాలకే వస్తుందంటే అతిశయోక్తి కాదు. కానీ అదేం విచిత్రమో తెలంగాణ ప్రభుత్వం మాత్రం గణతంత్ర వేడుకలను చాలా లైట్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. 

తెలంగాణలో స్వాతంత్య్ర వేడుకలను గోల్కొండ కోటలో, గణతంత్ర వేడుకలను పబ్లిక్ గార్డెన్ లో జరుపుకుంటున్నారు. సంప్రదాయాన్ని అనుసరించి ఆగస్టు 15న ముఖ్యమంత్రి జెండా ఎగరేస్తుండగా, జనవరి  26 నాడు గవర్నర్ పతాకావిష్కరణ చేస్తున్నారు. అయితే ఈసారి గవర్నర్ తమిళిసై గణతంత్ర ఉత్సవ  ఏర్పాట్లపై  రాజ్ భవన్ అధికారులతో సమావేశమయ్యారు. కోవిడ్-19 విజృంభిస్తున్న దృష్ట్యా అందుకు తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలను వారు సూచించారని, ఆ మేరకు తగిన ఏర్పాట్లు చేసుకుంటూ గణతంత్ర వేడుకలు నిర్వహించుకోవడం జరుగుతుందని ఓ ట్వీట్ చేశారు. 

ఈ విషయం మీదనే రాష్ట్ర ప్రజలందరూ విస్తుపోతున్నారు. దేశంలో గణతంత్ర వేడుకలన్నీ ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. అటు ఢిల్లీలో కేంద్రం కూడా పెద్దఎత్తున ఏర్పాట్లు చేసింది. జెండావిష్కరణ సమయంలో స్వల్ప మార్పులు మినహా, ఉత్సవానికి ఇచ్చే ప్రాధాన్యతను ఎక్కడా తగ్గించకపోవడం గమనించాలి. అసలింకా ఢిల్లీలోనే పెద్దసంఖ్యలో కోవిడ్ కేసులు పెరుగుతుండడం కూడా గమనించాలంటున్నారు విశ్లేషకులు. ఇక్కడ రాష్ట్రంలో కూడా కేసులు ఒకరోజు తగ్గుతూ, ఒకరోజు పెరుగుతూ కనిపిస్తున్నాయి. అయినా ఎలాంటి కఠినమైన ఆంక్షలు విధించే అవకాశం లేదని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలే చెబుతున్నారు. మరోవైపు సినిమా హాళ్లు నడుస్తున్నాయి. మందు దుకాణాల్లో జోష్ ఎక్కడా తగ్గడం లేదు. అన్ని షాపింగ్ మాల్స్ తెరిచే ఉంటున్నాయి. వ్యాపార సంస్థలన్నీ వ్యాపారం చేసుకుంటున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులంతా విధులు నిర్వహిస్తున్నారు. ఆర్టీసీ బస్సులు ఫుల్లుగానే వెళ్తున్నాయి. ఇక్కడెక్కడా కనిపించని కోవిడ్-19 ఒక్క గంటసేపు నిర్వహించుకునే గణతంత్ర వేడుకలనే టార్గెట్ చేసిందా అంటూ సామాన్య జనం ప్రశ్నిస్తున్నారు. 

అది కూడా ఎప్పుడూ నిర్వహించుకునే పబ్లిక్ గార్డెన్ లో కాకుండా ఈసారి గవర్నర్ ఉండే రాజ్ భవన్ లోనే జెండా వందనానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. పతాకావిష్కరణ తరువాత గవర్నర్ తమిళిసై తన అధికారిక పర్యటనలో భాగంగా పాండిచ్చేరి వెళ్లిపోతున్నారు. ఉదయం 9 గంటలకే ఆమె ప్రత్యేకమైన హెలికాప్టర్ లో బయల్దేరతారని, ఈ లోగానే జెండావందన కార్యక్రమం పూర్తవుతుందని సమాచారం. రాష్ట్రంలో జరిగే గణతంత్ర వేడుకలకు ముఖ్యమంత్రి, పలువురు సీనియర్ బ్యూరోక్రాట్లు హాజరవడం ఆనవాయితీ. రాష్ట్రంలో జరిగే ఈ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం, అనుమతి లేకుండా జరగదు కదా. దేశమంతా ఎంతో గర్వంతో వేడుకలు జరుగుతున్న క్రమంలో కోవిడ్ పేరు చెప్పి తెలంగాణలో మాత్రం ఇంత నిర్లక్ష్యం చేస్తారా అన్న ప్రశ్నలు అన్ని వర్గాల ప్రజల నుంచీ వినిపిస్తున్నాయి. స్వాతంత్య్రాన్ని, గణతంత్రాన్ని తూతూ మంత్రంగా జరుపుకునే దారుణమైన పరిస్థితి కన్నా దయనీయమైంది ఈ దేశానికి మరోటి లేదని ఈ దేశాన్ని ప్రేమించే ఆబాలగోపాలం ఆక్రోశిస్తోంది. దీనికి ఎవరు, ఏ రకంగా జవాబు చెప్తారో చూడాలి.