జగన్ హాజరుకాకపోయినా సీబీఐ కోర్టు ఎందుకు ఊరుకుంటోంది... అసలేమిటి కారణం?

 

వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చేది లేదని తేల్చిచెప్పి దాదాపు నెలరోజులైపోతోంది. అప్పుడే మూడు శుక్రవారాలు గడిచిపోయాయి. కానీ, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇప్పటివరకు సీబీఐ కోర్టుకు హాజరుకాలేదు. అయితే, వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వడం కుదరదని, తప్పనిసరిగా శుక్రవారం... శుక్రవారం హాజరుకావాల్సిందేనంటూ న్యాయస్థానం తేల్చిచెప్పినా మూడు వారాలుగా జగన్మోహన్ రెడ్డి ఎందుకు కోర్టుకు రాలేదనేది చర్చనీయాంశంగా మారింది. అయితే, ఏదో ఒక కారణం చెబుతూ మూడు వారాలుగా సీబీఐ కోర్టుకు హాజరుకాలేదని తెలుస్తోంది. కొన్ని వారాలుగా ప్రతి శుక్రవారం జగన్ లాయర్లు సీబీఐ కోర్టులో వివిధ కారణాలతో పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. ఫలానా కారణంతో ఈ వాయిదాకి హాజరుకాలేకపోతున్నారంటూ కోర్టుకు విన్నవిస్తూ వస్తున్నారు. సీబీఐ న్యాయస్థానం కూడా అంతే వెసులుబాటు కల్పిస్తూ కనికరిస్తూ వస్తోంది. అయితే, ఈసారైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీబీఐ కోర్టు హాజరవుతారా? లేదా? అనేది హాప్ టాపిక్ గా మారింది. 

అయితే, వరుసగా మూడు వాయిదాలకు హాజరుకాకపోతే నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ఇచ్చే అవకాశముంటుంది. కోర్టుకు ఆ అధికారం ఉంటుంది. అయితే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని వారాలుగా ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరుకావడం లేదు. పైగా, వ్యక్తిగత మినహాయింపు కోరుతూ జగన్ దాఖలు చేసుకున్న పిటిషన్ ను కొట్టివేసిన తర్వాత వరుసగా మూడు వారాలు కోర్టుకు రాలేదు. ఈ లెక్కన నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ఇవ్వాలి. అయితే, ఇది సామాన్యులకు మాత్రమే వర్తిస్తుందని న్యాయ నిపుణులు అంటున్నారు. ప్రజాప్రతినిధులకు, అందున ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి కొన్ని సెక్షన్ల ప్రకారం మినహాయింపు ఉంటుందని చెబుతున్నారు. సెక్షన్‌ 317 సీఆర్ పీసీ ప్రకారం డిస్పెన్స్ రిట్ పిటిషన్(DISPENCE RIT PITITION) కింద ఆబ్సెంట్ పిటిషన్ (ABSENT PITITION) వేస్తే కోర్టుకు హాజరుకాకపోయినా ఎలాంటి ఇబ్బంది ఉండదని న్యాయ నిపుణులు అంటున్నారు. అయితే, ఈ పిటిషన్ ను ఏ వారానికి ఆ వారం సరైన కారణాలతో వేస్తేనే న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంటుందని... ఇఫ్పుడు జగన్మోహన్ రెడ్డి లాయర్లు కూడా అదే చేస్తున్నారని అంటున్నారు.

అయితే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉండటంతో... నిత్యం ఏదో ఒక అధికారిక కార్యక్రమం ఉండటం సహజం. అలాగే, సీఎంను కలవడానికి దేశ విదేశీ ప్రముఖులు వస్తూనే ఉంటారు. ఇలా, ప్రముఖులతో భేటీలు, ఆ సమావేశం యొక్క ఇంపార్టెన్స్, జగన్మోహన్ రెడ్డి కచ్చితంగా ఉండాల్సిన పరిస్థితిని వివరిస్తూ ఏ వారానికి ఆ వారం పిటిషన్ ను దాఖలు చేస్తుండటంతోనే సీబీఐ కోర్టు మినహాయింపు ఇస్తోందంటున్నారు. మరి, ఇది ఎంతవరకు నిజమో... ఒకవేళ నిజమే అయితే... ఇలా ఎంతకాలం ఊరుకుంటుందో... ఎన్ని వారాలు మినహాయింపు ఇస్తుందో చూడాలి.