కులం ముద్రకు తెలుగుదేశం అతీతం

కులం పేరుతో రాజకీయాలు చేసి తెలుగుదేశం పార్టీని దెబ్బకొట్టాలన్న వైసీపీ యత్నాలు ఫలించలేదు. తెలుగుదేశం పార్టీ ఎప్పటికప్పుడు కులం రంగు అంటని పార్టీగా తనను తాను రుజువు చేసుకుంటూనే వస్తోంది. అసలు తెలుగుదేశం పార్టీపై కులం ముద్ర వేయాలన్న ప్రయత్నాలు జగన్ తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాం నుంచీ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే ప్రయత్నాలు జరిగాయి. ఎప్పటికప్పుడు సామాజిక సమీకరణాల విషయంలో తన నిష్పాక్షికతను తెలుగుదేశం పార్టీ రుజువు చేసుకుంటూ వస్తూనే ఉంది.  అయితే జగన్ సొంతంగా వైసీపీ పార్టీని ఏర్పాటు చేసుకున్న తరువాత ఆ ప్రయత్నాలు మరింత ముమ్మరమయ్యాయి. రాష్ట్ర విభజన తరువాత జరిగిన తొలి ఎన్నికలలో అంటే 2014 ఎన్నికల్లో  ఓటమి తరువాత  తెలుగుదేశం పార్టీని  కులతత్వ పార్టీగా చిత్రీకరించగలిగితేనే తమకు రాజకీయ ఉనికి ఉంటుందని జగన్ భావించారు. ఒక అక్కడ నుంచి అదే పనిగా రాజకీయ వ్యూహకర్తలు, సోషల్ మీడియా ప్రచారం, మీడియా మేనేజ్‌మెంట్  ఇలా ఒకటేమిటి అన్ని మార్గాల ద్వారా తెలుగుదేశంకు కుల ముద్ర అంటగట్టడమే లక్ష్యంగా ముందుకు సాగిన జగన్ ఆ దిశగా ఓ మేరకు సఫలీకృతులయ్యారనే చెప్పాలి.   అయితే తెలుగుదేశం పార్టీ సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమం, అభ్యున్నతి కోసం పాటుపడే పార్టీ అని  నిరూపించుకుంది.  

2024 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ  జనసేన, బీజేపీలతో పొత్తు పెట్టుకుని పోటీలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. ఈ పొత్తులో భాగంగా సీట్ల పంపకం విషయంలో తెలుగుదేశం ఒకింత ఇబ్బందులు ఎదుర్కొంది. జనసేన పార్టీతో సీట్ల సర్దుబాటు విషయంలో ఎటువంటి ఇబ్బందులూ ఎదురు కాలేదు. కానీ బీజేపీ విషయానికి వచ్చేసరికి రాష్ట్రంలో ఏ మాత్రం ఓటు స్టేక్ లేని ఆ పార్టీకి పది అసెంబ్లీ, ఆరు లోక్ సభ స్థానాలు కేటాయించడంపై పార్టీ వర్గాల్లో ఒకింత అసంతృప్తి వ్యక్తం అయిన మాట వాస్తవం. అయితే రాష్ట్రంలో దుర్మార్గ పాలనకు అంతం పలకాలన్న లక్ష్యంతో నడుస్తున్న పార్టీ అధిష్ఠానం అభిప్రాయాలకు విలువ ఇచ్చిన క్యాడర్ ఓ మూడు స్థానాల విషయంలో మాత్రం సర్దుకు పోలేకపోతున్నది.  ఆ మూడు స్థానాలూ అరకు, అనపర్తి, నరసాపురం. ఆ మూడు స్థానాలనూ పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ త్యాగం చేయడాన్ని పార్టీ క్యాడర్ జీర్ణించుకోలేకపోతున్నది. ఇక్కడే తెలుగుదేశం పార్టీకి ఒక కులం రంగుపులమడానికి వైసీపీ చేసిన ప్రచారం ఎంతటి అవాస్తవమో తేటతెల్లమైంది. ఒక వైపు వైసీపీలో రెడ్డి సామాజకి వర్గానికి ఉన్న ప్రాధాన్యత మరే సామాజిక వర్గానికీ లేదని  అధికారుల నియామకం నుంచి పార్టీ టికెట్ల కేటాయింపు వరకూ ప్రతి విషయంలోనూ రుజువు అవుతున్నది. అదే తెలుగుదేశం విషయానికి వచ్చేసరికి అన్ని సమాజిక వర్గాలకూ సమప్రాధాన్యత కనిపిస్తున్నది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ క్యాడర్ అసంతృప్తితో రగిలిపోతున్న మూడు స్థానాలలోనూ కూడా తెలుగుదేశంకు కమ్మ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులు లేరు. పొత్తులో భాగంగా ఆయా స్థానాలలో తెలుగుదేశం టికెట్ దక్కక నిరాశ చెందిన అభ్యర్థులెవరూ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు కారు. 

ఆరకు ఎస్టీ రిజర్వుడు స్థానం. ఆ స్థానంలో గత మూడున్నరేళ్లుగా పార్టీ కోసం కష్టపడి పని చేసిన దన్నుదొర పొత్తులో భాగంగా సీటు త్యాగం చేయాల్సిరావడాన్ని క్యాడర్ అంగీకరించలేకపోతున్నది. పార్టీ కోసం నిలబడిన దొన్నుదొరకే ఇక్కడ పోటీ చేసే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. 

ఇక అనపర్తి విషయానికి వస్తే ఇక్కడ  పొత్తులో భాగంగా బీజేపీ అభ్యర్థిని సమర్ధించడానికి నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి అన్యాయం జరిగిందని క్యాడర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నది. తమ మద్దతు నల్లమిల్లి రామకృష్ణారెడ్డికే అని స్పష్టం చేస్తోంది. ఆయన స్వతంత్ర అభ్యర్థిగా నిలబడితే ఆయన వెంటే ఉంటామని స్పష్టం చేస్తోంది. ఇందుకు కారణం గత ఐదేళ్లుగా నల్లమిల్లి పార్టీ కోసం నిలబడ్డారు. జగన్ ప్రభుత్వం నుంచి ఎన్నో వేధింపులను ఎదుర్కొన్నారు.  ఇక నరసాపురంలో క్షత్రియ సామాజికవర్గానికి చెందిన రఘు రామకృష్ణంరాజు కు తెలుగుదేశం క్యాడర్ మద్దతుగా నిలబడింది.  జగన్ మోహన్ రెడ్డి అరాచక పాలనపై   అలుపెరగని పోరాటం చేసిన రఘురామకృష్ణం రాజుకు అన్యాయం జరగడానికి వీల్లేదని పట్టుబడుతోంది. ఈ మూడు సీట్ల విషయంలో తెలుగుదేశం క్యాడర్ గట్టిగా నిలబడింది. వీరి విషయంలో పునరాలోచించాలని అధిష్ఠానాన్ని కోరుతోంది.  

పొత్తులో భాగంగా సీటు కోల్పోయిన వారిలో దేవినేని ఉమ, పరిటాల శ్రీరామ్‌, ఆలపాటి రాజా తదితర కమ్మ నేతలూ ఉన్నారు. క్యాడర్ వారి పట్ల సానుభూతి చూపుతున్నది, అయితే  అరకు, అనపర్తి, నరసాపురం సీట్ల విషయంలో మాత్రం పోరాడుతోంది.  ఈ ఉదాహరణ చాలు తెలుగుదేశం పార్టీకి కులం రంగు పులమడానికి అవకాశం లేదని చెప్పడానికి.   పార్టీపై కులం ముద్ర వేయడానికి గత పదేళ్లుగా (విపక్షంలో ఉన్న ఐదేళ్లు, అధికార పార్టీగా ఐదేళ్లు) వైసీపీ చేసిన దుష్టపన్నాగాలు, ప్రయత్నాలూ ఫలించలేదనడానికి ఇంత కంటే నిదర్శనం ఏం కావాలి.