16 నెలల జైలు.. పదేళ్లుగా బెయిలు! జగన్ కు గుర్తు చేస్తున్న నెటిజనులు!

ఎదుటి వారు చేసేవన్నీ తప్పులు.. నేను మాత్రమే సుద్దపూసను అన్నభ్రమల్లో జగన్ పూర్తిగా మునిగిపోయారు. ఐదేళ్లు అధికారంలో ఉన్నా ఎన్నడూ  మీడియా ముందుకు రాలేదు కానీ.. ఎన్నికలలో ఓటమి భయం వెంటాడుతుంటే.. అనివార్యంగా తన గురించి తను చెప్పుకోవడానికి ఏం లేకపోయినా.. విపక్షాలపై విమర్శలు గుప్పించడానికి ఆయన వద్ద ఉన్న పడికట్టు రాళ్ల వంటి మాటలను మరో సారి విసర్జించేందుకు జగన్  మీడియా ముందుకు వచ్చారు. ఇందు కోసం ఆయన ప్రెస్ మీట్ ఏమీ పెట్టలేదు. ఒక ప్రముఖ జాతీయ చానల్ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. 

ఆ ఇంటర్వ్యూలో మరో సారి పర నింద.. అంటే మరేమీ లేదు చంద్రబాబుపై అక్కసు వెళ్లగక్కుకోవడానికే పరిమితమయ్యారు. అలా చేసే క్రమంలో స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్టై 52 రోజులు జైలులో ఉండటానికి కారణం ఆయన తప్పు చేయడమేనని చెప్పారు. బెయిలు వచ్చినంత మాత్రాన ఆయన తప్పు చేసినట్లు కాదనీ వాకృచ్చారు. బెయిలు పొందే హక్కు, అవకాశం అందరికీ ఉంటుందని, అలాగే చంద్రబాబుకూ బెయిలు వచ్చిందనీ చెప్పారు. అంతే కాదు స్కిల్ కేసులో చంద్రబాబు తప్పించుకోలేరనీ కూడా జోస్యం చెప్పారు. 

పాపం విపక్ష నేతపై ఆరోపణలు, విమర్శలు గుప్పించే తొందరలో తాను 16 నెలలు జైలులో ఉండి బెయిలు మీదే బయటకు వచ్చారన్న సంగతి కన్వీనియెంట్ గా మర్చిపోయారు.  కానీ నెటిజనులు మాత్రం ఈ ఇంటర్యూ ఆధారంగా జగన్ ను ఏకి పారేస్తున్నారు.  చంద్రబాబు నాయుడు 52 రోజులు జైల్లో ఉంటే నేరం చేశారనుకుంటే, మరి అక్రమాస్తుల కేసులో 16 నెలలు జైల్లో ఉండి వచ్చిన జగన్  ఎంత నేరం చేశారో? అంటూ ట్రోల్ చేస్తున్నారు. అలాగే జగన్ గత పదేళ్లుగా బెయిలు మీదే ఉన్న సంగతిని గుర్తు చేస్తున్నారు. 

ఇక ఇంటర్వ్యూలో తనకెదురైన ఏ ప్రశ్నకూ జగన్ సూటిగా సమాధానం చెప్పలేదు. తాను మేమంతా సిద్ధం బస్సు యాత్ర సందర్భంగానూ, అంత కంటే ముందు బటన్ నొక్కుడు సభల సందర్భంగానే ఇచ్చిన ప్రసంగాలనే  ప్రతి ప్రశ్నకూ సమాధానంగా చెప్పేశారు. కొన్ని ప్రశ్నలకైతే సమాధానం దాట వేశారు. సంక్షేమ పథకాల లబ్ధిదారులే గెలిపిస్తారు అన్న విశ్వాసం ఉన్నప్పుడు అంత మంది సిట్టింగులను ఎందుకు మార్చారన్న ప్రశ్నకు ఇది చాలా పెద్ద ప్రశ్న అంటూ ఇప్పుడు సమాధానం చెప్పడానికి వీలు కాదన్నట్లుగా దాటవేశారు.