వైకాపా నేతపై సీబీఐ కేసు
posted on Mar 6, 2015 8:25AM
ఆవు చేలో పడి మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా? వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నిత్యం కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ముఖ్యమంత్రి అవుదామని ఆయన కలలుగంటుంటే, ఆయన జైలుకి తిరిగి వెళ్ళేరోజు ఎంతో దూరం లేదని తెదేపా నేతలు బల్లగుద్ది మరీ వాదిస్తున్నారు. ఆయనపై ఉన్న సీబీఐ కేసులు ఎప్పుడు తెలుతాయో ఎవరికీ తెలియదు గానీ, కొత్తగా మరో సీబీఐ కేసు ఆయన పార్టీకే చెందిన మాజీ యంపి కొత్తపల్లి సుబ్బారాయుడిపై నమోదు అయ్యింది.
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపూర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ లో నకిలీ పత్రాలు సమర్పించి రూ 5.73 కోట్లు తీసుకొని తమను మోసగించారంటూ బ్యాంక్ అధికారులు ఆయనపై పిర్యాదు చేయడంతో సీబీఐ కేసు నమోదు చేసి విచారణ మొదలుపెట్టింది. ఆయనతో బాటు ఆయనకు సహకరించిన బ్యాంక్ చీఫ్ మేనేజర్, ముగ్గురు ఫీల్డ్ ఆఫీసర్లపై కూడా సీబీఐ కేసు నమోదు చేసింది. ఆయన 2011-2013 సం.ల మధ్య కాలంలో బ్యాంక్ కి నకిలీ దృవపత్రాలను సమర్పించి రూ 5.73 కోట్లు అప్పుగా తీసుకొని 22 చేపల చెరువులు నిర్మించుకొన్నారని బ్యాంక్ అధికారుల ఆరోపణ.