Read more!

ధ‌ర్నాచౌక్‌కి దిగొచ్చిన దొర‌.. ధ‌ర్నా ఝ‌రూరీ హై!

ఊర‌క రారు మ‌హానుభావులు. ఇక సీఎం కేసీఆర్ అయితే అస‌లే రారు. ప్ర‌జా ముఖ్య‌మంత్రిగా ఉండాల్సిన సీఎం.. ప్ర‌గ‌తి భ‌వ‌న్ ముఖ్య‌మంత్రిగా, ఫామ్‌హౌజ్ ముఖ్య‌మంత్రిగా పేరు గాంచారు. ముఖ్య‌మంత్రి ప్ర‌జ‌ల‌కు క‌నిపించ‌డ‌మే గ‌గ‌నం. ప్ర‌జ‌ల దాకా ఎందుకు.. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేత‌ల‌కే ఆయ‌న ముఖం చూపించ‌రు. ఈట‌ల రాజేంద‌ర్‌లాంటి నాయకుడినే ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లోకి రానీయ్య‌లేదు. టీవీల్లో కేసీఆర్ ఫైల్ విజువ‌ల్స్‌ చూడ‌ట‌మే కానీ.. ఆయ‌న నేరుగా ద‌ర్శ‌న‌మిచ్చే సంద‌ర్భాలు అతి త‌క్కువే. ఇంత త‌క్కువ‌గా ప్ర‌జ‌ల‌కు ముఖం చూపించే సీఎం.. బ‌హుషా దేశంలో కేసీఆర్ ఒక్క‌రేనేమో. 

అలాంటి కేసీఆర్ ప్ర‌గ‌తిభ‌వ‌న్ నుంచి ధ‌ర్నాచౌక్ వ‌ర‌కూ దిగొచ్చారు. నేను సైత‌మంటూ ఇందిరాపార్క్ ద‌గ్గ‌ర మ‌హాధ‌ర్నాకు కూర్చున్నారు. కేసీఆర్ అంత‌టి వారే.. స్వ‌యానా ముఖ్య‌మంత్రే.. కేంద్రానికి వ్య‌తిరేకంగా ధ‌ర్నా చేయ‌డ‌మంటే మామూలా? అందుకే మీడియా ఫోక‌స్ మొత్తం ఆయ‌న‌పైనే. నేష‌న‌ల్ మీడియాలోనూ క‌వ‌రేజ్ వ‌చ్చింది. అదే క‌దా కేసీఆర్‌కు కావ‌ల‌సింది.. అందుకే క‌దా ముఖ్య‌మంత్రి హోదాలో ధ‌ర్నాకు దిగింది. ఇది అంతం కాదు ఆరంభం మాత్ర‌మే.. కేంద్రం దిగొచ్చే వ‌ర‌కూ రైతు ప‌క్షాన పోరాడుతూనే ఉంటాం.. అంటూ పెద్ద పెద్ద స్టేట్‌మెంట్లూ ఇచ్చేశారు. 

ఉద్య‌మం సమ‌యంలోనూ ఇలానే రాజ‌కీయ ప్ర‌సంగాలు ఇచ్చేవారు కేసీఆర్‌. కానీ, అంత ఉద్వేగ పోరులోనూ ఎన్న‌డూ ఇలా ధ‌ర్నాకు కూర్చున్న‌ది లేదు. పార్టీతో, ప్ర‌జ‌ల‌తో ధ‌ర్నాలు చేయించే వారే కానీ, కేసీఆరే స్వ‌యంగా ఇలా ధ‌ర్నాకు దిగిన సంద‌ర్భాలు అత్యంత అరుదు. అలాంటిది.. ఇప్పుడు ఏమంత అవ‌స‌రం వ‌చ్చిందో ఏమో గానీ, ముఖ్య‌మంత్రి హోదాలో ధర్నాచౌక్‌లో యావ‌త్ మంత్రివ‌ర్గ ప‌రివారాన్ని వెంటేసుకొని మ‌రీ మ‌హాధ‌ర్నా చేప‌ట్ట‌డం రాజ‌కీయంగా ఆస‌క్తిక‌రంగా మారింది. 

కేసీఆర్‌ను ప్ర‌గ‌తి భ‌వ‌న్ నుంచి బ‌య‌ట‌కు లాగిన ఘ‌న‌త మాదేన‌ని బీజేపీ వ‌ర్గాలు ఆ క్రెడిట్‌ను త‌మ ఖాతాలో వేసుకుంటున్నాయి. హుజురాబాద్ ఓట‌మి భ‌యంతోనే కేసీఆర్ ఇలా ధ‌ర్నా పాలిటిక్స్ చేస్తున్నార‌ని విమ‌ర్శిస్తున్నాయి. ఇక కాంగ్రెస్ అయితే.. కేసీఆర్‌-బీజేపీ క‌లిసి ఆడుతున్న ధ‌ర్నా డ్రామా ఇదంతా అంటూ మండిప‌డుతున్నాయి. ఎవ‌రు ఏమ‌న్నా.. సీఎం కేసీఆర్ ధ‌ర్నాకు దిగ‌డం మాత్రం హైలైట్ అనే చెబుతున్నారు. ఇదంతా రాజ‌కీయ ఎత్తుగ‌డేన‌ని అంతా భావిస్తున్నారు. ధ‌ర్నాలు చేయ‌డం కాదు.. ముందు వ‌రిపై ద‌గా చేయ‌డం మానండంటూ కేంద్ర‌రాష్ట్ర ప్ర‌భుత్వాల‌పై మండిప‌డుతున్నారు రైతులు.