జీరో ఎఫ్ఐఆర్ అంటే ఏంటీ? ఎప్పుడు పెడతారు? కేసు తీవ్రత పెరుగుతుందా? 

ఏబిన్ ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణపై ఏపీ సీఐడీ జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. రిటైర్డ్ ఐఏఎస్ లక్ష్మీనారాయణ ఇంట్లో సోదాల సందర్భంలో విధులకు ఆటంకం కలిగించారంటూ రాధాకృష్ణపై కేసులు పెట్టారు. దీంతో జీరో ఎఫ్ఐఆర్ హాట్ హాట్ గా మారింది. అసలు జీరో ఎఫ్ఐఆర్ అంటే ఏమిటి? దాని వల్ల లాభం ఏంటి? కేసు తీవ్రత పెరుగుతుందా? బాధితులకు ప్రయోజనమా.. నష్టమా? అన్న చర్చ సాగుతోంది. 

ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే.. ఆ సమయమానికి తమకు సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్ కు వెళుతుంటారు.. అయితే  కొన్ని సార్లు వారికి చేదు అనుభవం ఎదురవుతుంటుంది. ఇది మా పరిధిలోకి రాదు అని పోలీసులు ఫిర్యాదు తీసుకోవడానికి నిరాకరిస్తుంటారు. మరో పోలీస్ స్టేషన్ కి వెళ్లండి అని ఉచిత సలహా ఇస్తుంటారు. దీంతో బాధితులు తమ నివాసం ఏ స్టేషన్‌ పరిధిలోకి వస్తుందో తెలుసుకుని, ఫిర్యాదు చేసే లోపు ఘోరాలు జరిగిపోతుంటాయి. ప్రాణాలు పోతుంటాయి. ఈ సమస్యను అధిగమించేందుకు జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని గతంలో ఉత్తరప్రదేశ్, కర్నాటక హైకోర్టులు తీర్పులు ఇచ్చాయి. ఇది అన్ని రాష్ట్రాల పోలీసు మాన్యువల్‌లోనూ ఉంది. అయినా ఎక్కడా అమలు కాలేదు. అయితే హైదరాబాద్ శివారులో జరిగిన దిశ ఘటన తర్వాత పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే  ఉన్నతాధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. జీరో ఎఫ్ఐఆర్ ని తెరపైకి తెచ్చారు. 

జీరో ఎఫ్ఐఆర్ అంటే..

* పోలీస్ స్టేషన్‌ పరిధితో నిమిత్తం లేకుండా తమకు సమీపంలో ఉండే ఏ పోలీస్ స్టేషన్‌కైనా బాదితులు సాయం కోసం వెళ్లొచ్చు. 
* అక్కడి పోలీసులు ఫిర్యాదు తీసుకుని సంబంధిత స్టేషన్‌కు సమాచారం అందజేయాలి. 
* తక్షణమే బాధితులకు తగిన సాయం అందజేయాలి. 
* పోలీస్ స్టేషన్లలో ప్రతి ఏటా జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకూ వరుస నంబర్లతో ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేస్తుంటారు. 
* జీరో ఎఫ్‌ఐఆర్‌లో నంబర్‌ ఇవ్వకుండానే కేసు నమోదు చేస్తారు.

దిశ ఘటన తర్వాత ఆయా కేసుల ప్రాధాన్యం, తీవ్రతను బట్టి పరిధులతో సంబంధం లేకుండా జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని పోలీస్‌ స్టేషన్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాయి. పోలీస్‌ స్టేషన్‌కు ఫిర్యాదు చేసేందుకు వచ్చేవారిని పరిధుల పేరుతో తిరస్కరించకుండా.. కేసు పెట్టదగిన తీవ్రమైన నేరాలకు సంబంధించి తప్పనిసరిగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని ఆర్డర్స్ ఇచ్చారు. ప్రతి పౌరుడు జీరో ఎఫ్ఐఆర్ గురించి తెలుసుకోవాలి. అవగాహన ఏర్పరచుకోవాలి. ఎప్పుడైనా పోలీస్ స్టేషన్ కు వెళ్లినప్పుడు.. మా పరిధిలోకి రాదు అని పోలీసులు తప్పించుకోవడానికి వీల్లేదు. ఆ సమయంలో జీరో ఎఫ్ఐఆర్ గురించి చెబితే.. ఇక పోలీసులు తప్పించుకోలేరు. కచ్చితంగా ఫిర్యాదు తీసుకోవాల్సిందే, విచారణ చేపట్టాల్సిందే. 

జీరో ఎఫ్ఐఆర్ వల్ల అంత ఉపయోగం ఉంటుందా?

పోలీసులకు మనం ఏదైనా ఫిర్యాదు ఇస్తే దాన్ని నమోదు చేసుకుంటారు. దాన్ని ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్‌ఐఆర్) అంటారు. ఇది నేరం ఎక్కడ జరిగితే ఆ ప్రాంతానికి సంబంధించిన పోలీస్ స్టేషన్లో మాత్రమే ఇవ్వాలి. కానీ జీరో ఎఫ్‌ఐఆర్ అంటే నేరం ఎక్కడ జరిగిందన్నదాంతో సంబంధం లేకుండా, దగ్గర్లో లేదా అందుబాటులో లేదా తెలిసిన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయవచ్చు. తరువాత ఆ స్టేషన్ వారే ఆ కేసును సంబంధిత పోలీస్ స్టేషన్‌కి బదిలీ చేస్తారు. జస్టిస్ వర్మ కమిటీ నివేదిక ఆధారంగా క్రిమినల్ లా సవరణ చట్టం 2013లో ఈ జీరో ఎఫ్ఐఆర్ కాన్సెప్టును ప్రవేశపెట్టారు.

సాధారణంగా పోలీసుల కేసులు అన్నిటికీ ఎఫ్ఐఆర్ నంబరు ఉంటుంది. కానీ ఇలా తమ పరిధి కాని కేసులను తీసుకునేప్పుడు ఆ నంబర్ ఇవ్వకుండా సున్నా నంబర్ ఇస్తారు. తరువాత దాన్ని సంబంధిత స్టేషన్‌కి బదిలీ చేశాక, ఆ రెండవ స్టేషన్ వారు ఎఫ్ఐఆర్ నంబరు ఇస్తారు. ముందుగా జీరో నంబర్‌తో నమోదు చేస్తారు కాబట్టి దీన్ని జీరో ఎఫ్ఐఆర్ అంటారు. అంతేకాదు నంబర్ జీరో ఇచ్చారు కాబట్టి ఆ ఎఫ్ఐఆర్ విలువ ఏ మాత్రం తగ్గదు. ఆ నివేదిక విలువ, చట్టపరమైన ప్రక్రియ అంతా మామూలే. అంటే నంబర్ తప్ప మిగతా అన్ని విషయాల్లోనూ జీరో ఎఫ్ఐఆర్ మామూలు ఎఫ్‌ఐఆర్‌తో సమానమే. ఈ విధానం వల్ల ప్రజలకు సరైన పోలీస్ స్టేషన్ తెలుసుకునే బాధ మాత్రమే తప్పుతుంది. అలాగే స్టేషన్‌కి వచ్చిన ఎవర్నీ పోలీసులు వెనక్కు, వేరే స్టేషన్‌కి పంపడానికి వీలుండదు.

ఏ కేసులో అయితే కోర్టు అనుమతి లేకపోయినా పోలీసు వారు నేరుగా అరెస్టు చేయవచ్చో దాన్ని కాగ్నిజబుల్ కేసులు అంటారు. తమ దృష్టికి వచ్చిన వెంటనే పరిధితో, ఫిర్యాదుదారు ఎవరు అనే దాంతో సంబంధం లేకుండా కేసు నమోదు చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉంటుంది.బాధితులు, కుటుంబ సభ్యులు, సాక్షులు, నేరస్తులు, పోలీసులు, జడ్జీల ఆదేశాలు, లేదా నేరం గురించి తెలిసిన ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చు. దాని ప్రకారం కేసు నమోదు చేయాల్సిందే.ఒక్క మాటలో చెప్పాలంటే నేరం జరిగిన ప్రాంత పరిధితో సంబంధం లేకుండా ఏ స్టేషన్లో అయినా కేసు పెట్టగలగడమే జీరో ఎఫ్ఐఆర్. దానికి మగ, ఆడ సంబంధం లేదు. అందరికీ వర్తిస్తుంది.

కర్ణాటక హైకోర్టు 2019 సెప్టెంబరు 19న ఒక రిట్ పిటిషన్ విషయంలో జీరో ఎఫ్ఐఆర్ కచ్చితంగా అమలు చేయాలని తీర్పు ఇచ్చింది. తన ఉత్తర్వుల్లో భాగంగా, జీరో ఎఫ్ఐఆర్ గురించి 2014 ఫిబ్రవరి 6న కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఉత్తర్వులను ప్రస్తావించింది. ఆ ఉత్తర్వుల ప్రకారం పోలీస్ అధికారి ఇష్టాఇష్టాలతో సంబంధం లేకుండా నేరం గురించి తెలిసిన వెంటనే కేసు కచ్చితంగా తీసుకోవాలని కేంద్ర హోంశాఖ చెప్పింది. దానికంటే ముందే 2013 నవంబరులో సుప్రీంకోర్టు లలిత కుమార్ వర్సెస్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కేసులో దీనికి సంబంధించిన మార్గదర్శకాలు ఇచ్చింది. పోలీసుల శిక్షణలో కూడా జీరో ఎఫ్ఐఆర్ గురించి చేర్చాలని కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాల డీజీపీలనూ ఆదేశించింది. ఇదే అంశంపై అన్ని రాష్ట్రాల ఛీఫ్ సెక్రటరీలకూ కేంద్ర హోంశాఖ 2015 అక్టోబర్ 12న ఒక లేఖ రాసింది.

ఒకవేళ ఎవరైనా పోలీసు అధికారి ఎఫ్ఐఆర్ రాయడానికి తిరస్కరిస్తే ఐపీసీ సెక్షన్ 166 ఏ కింద ఏడాది శిక్ష, జరిమానా విధించవచ్చు. అలాగే సీఆర్పీసీ సెక్షన్ 154 ప్రకారం ఫిర్యాదు చేసే వాళ్లు నోటితో చెప్పిన వివరాలు కూడా పోలీసుల రాసుకుని, కింద సంతకం తీసుకోవాలి. అలాగే ఒక కాపీ ఉచితంగా అందివ్వాలి. రిజిస్టర్లో సంతకం పెట్టాలి.

ఇలా జీరో ఎఫ్ఐఆర్ కింద నమోదయిన సంచలన కేసులు కూడా ఉన్నాయి. ఆశారాం బాపు కేసులో.. ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్‌లో జరిగితే, కేసు దిల్లీలోని కమలా మార్కెట్ స్టేషన్లో నమోదు అయింది. తరువాత దాన్ని రాజస్థాన్‌కి బదిలీ చేశారు.