అవకాశాల నిచ్చెన అందిస్తే, ప్రపంచంలోని పిల్లలంతా ప్రయోజకులే... యూనిసెఫ్ ఫౌండేషన్ డే 2024..!
posted on Dec 11, 2024 @ 9:30AM
సాధారణంగా ఏ తల్లిదండ్రులైనా ‘పిల్లలే మా ఆస్తి, వారిని పెంచి, పోషించి వారి కాళ్ళ మీద వారు నిలబడితే అదే చాలు’ అని అంటుంటారు. అదే లక్ష్యంగా పని చేస్తారు కూడా. అయితే పిల్లల భవిష్యత్తు బాగుపడటానికి అన్ని సౌకర్యాలు కల్పించే, అన్ని అవకాశాలు అందుకునేలా ప్రోత్సహించే తల్లిదండ్రులు ఉంటే పిల్లలకి ఎటువంటి ఇబ్బందీ లేదు. వారి హక్కులకి వచ్చిన ఆటంకమేమీ ఉండదు. కానీ ఈ ప్రపంచంలో చాలా మంది పేద, బలహీన వర్గాల్లోని పిల్లలు ఇప్పటికీ కనీస సౌకర్యాలకి, సామాన్య హక్కులకి దూరమైపోతున్నారు. అలాంటి పేద, బలహీన వర్గాల పిల్లల తల్లిదండ్రుల స్థానంలో నిలబడి, వారికి సాయం అందించి, భవిష్యత్తుకి భరోసా ఇవ్వటానికి, అలాగే అత్యవసర సహాయం అందించటానికి ఒక సంస్థ ప్రాణం పోసుకుంది. అదే ‘యూనిసెఫ్’(UNICEF).
యూనిసెఫ్ చరిత్ర:
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అత్యవసర అవసరాలకు పరిష్కారంగా, యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ (యూనిసెఫ్)ను 1946సంవత్సరం, డిసెంబర్ 11వ తేదీన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ స్థాపించింది. కాలక్రమంలో ఇది ఐక్యరాజ్యసమితి వ్యవస్థలో శాశ్వత భాగంగా మారింది. దీని ప్రధాన కార్యాలయం న్యూయార్క్ సిటీలో ఉంది. ప్రారంభంలో ఇది రెండో ప్రపంచ యుద్ధ ప్రభావిత ఐరోపాలోని ప్రజలకు ఆహారం, బట్టలు, ఆరోగ్య సంరక్షణ సేవలు అందించేది. కానీ ప్రస్తుతం ఈ సంస్థ 190 కంటే ఎక్కువ దేశాలలో వివిధ కార్యకలాపాలతో, పిల్లల మేలుకోసం ప్రపంచ సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు సాగుతోంది. ఈ సంస్థ శిశు మరణాలను తగ్గించడంలో, విద్యను మెరుగుపరచడంలో, పేద పిల్లలకు మద్దతు ఇచ్చే పనుల్లో అనేక విధాలుగా తోడ్పాటు అందించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా పిల్లల హక్కులు, సంక్షేమం కోసం గణనీయంగా కృషి చేసింది. యూనిసెఫ్ చేసిన ఈ పని ప్రపంచవ్యాప్తంగా గుర్తించబడింది. అందులో 1965లో యుద్ధాల వల్ల ప్రభావితమైన పిల్లలకు సహాయం చేయడంలో యూనిసెఫ్ చేసిన కృషికి నోబెల్ శాంతి బహుమతి కూడా దక్కింది.
యూనిసెఫ్ ఫౌండేషన్ డే:
యూనిసెఫ్ స్థాపించినదానికి గుర్తుగా ప్రతీ సంవత్సరం డిసెంబర్ 11న యూనిసెఫ్ ఫౌండేషన్ డే జరుపుకుంటారు. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా పిల్లల సంక్షేమంపై యూనిసెఫ్ ప్రభావాన్ని గుర్తుచేసుకుంటారు. విద్య అందించడం, అత్యవసర సహాయం చేయడం, పిల్లల హక్కులకు మద్దతు ఇవ్వడం ద్వారా యూనిసెఫ్ పిల్లల జీవితాలను మెరుగుపరచడంలో పోషిస్తున్న కీలక పాత్రని గుర్తించడం, దాని కృషిని కొనియాడటం ఈ రోజు ముఖ్య ఉద్దేశ్యం. . ఈ ఏడాది డిసెంబర్11న యూనిసెఫ్ 78వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది.
యూనిసెఫ్ చేసే పనులు..
టీకాలు, ఆరోగ్య కార్యక్రమాల ద్వారా పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం. బాలికల జీవన పరిస్థితులను మెరుగుపరచడం. పేద వర్గాలలో శిశు మరణాలను తగ్గించడం. ప్రకృతి విపత్తులు, యుద్ధాల వంటి అత్యవసర సమయాల్లో సహాయం అందించడం. పిల్లలకి సమాన విద్యావకాశాలను అందిస్తూ, లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడం చేస్తుంది. మరొక ముఖ్య విషయం ఏమిటంటే.. 190 కంటే ఎక్కువ దేశాలలో కార్యకలాపాలు నిర్వహిస్తూ ప్రతి పిల్లవాడికి మౌలిక అవసరాలు, హక్కులు అందించేలా కృషి చేస్తోంది.
యూనిసెఫ్ 1946లో స్థాపించబడినప్పటి నుండి నేటి వరకు పిల్లల జీవితాలని మెరుగుపర్చటంలో విశేషమైన ప్రగతిని నమోదు చేసింది.
యూనిసెఫ్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్లు మిలియన్ల కొద్దీ పిల్లలను నివారించదగిన వ్యాధుల నుండి రక్షించాయి. ఉదాహరణకు, 2018లో, 65.5 మిలియన్ల మంది పిల్లలకు పొలియో వంటి ఐదు వ్యాధులపై వ్యాక్సిన్లు అందించింది.
సుమారు 4 మిలియన్ మంది తీవ్ర కుష్టు వ్యాధితో బాధపడుతున్న పిల్లలకి చికిత్స అందజేసింది. వారికి సహాయపడే పోషక ఆహారం, చికిత్సలు అందించింది.
12 మిలియన్ల మంది పిల్లలకు విద్యా అవకాశాలను అందించింది. నాణ్యమైన విద్యను అందించడం, పాఠశాలలో లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడం మీద దృష్టి పెట్టింది. యూనిసెఫ్ చేస్తున్న ఈ ప్రయత్నాలు భవిష్యత్ తరం కోసం ఒక బలమైన పునాది వేయడంలో సహాయపడుతున్నాయి.
బాల హక్కుల ఒప్పందాన్ని దాదాపు అన్ని దేశాలు ఆమోదించేందుకు యూనిసెఫ్ కృషి చేసింది. ఇది పిల్లలపై హింస, దుర్వినియోగం, దోపిడీని నివారించడానికి గల మార్గాన్ని సుగమం చేసింది.
1965లో యుద్ధ ప్రభావిత పిల్లలకు సహాయం చేయడంలో యూనిసెఫ్ కృషికి నోబెల్ శాంతి బహుమతి లభించింది. దీంతో ఇది ప్రపంచ గుర్తింపుని పొందింది.
యూనిసెఫ్ అత్యవసర సమయాల్లో కూడా వేగంగా స్పందించి, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సేవలు, సహాయ కార్యక్రమాలని చేస్తోంది.
2018లో 90 దేశాలలో 285 మానవతా అత్యవసర పరిస్థితులకు స్పందించింది. ప్రకృతి విపత్తులు లేదా ఘర్షణల కారణంగా ఎదురయ్యే సంక్షోభ సమయంలో అవసరమైన వనరులను సమీకరించి, తక్షణ సహాయాన్ని అందించడంలో సమర్థవంతంగా పనిచేసింది.
కోవిడ్-19 మహమ్మారి సమయంలో, యూనిసెఫ్ తన వ్యూహాలను సరిచేసుకుంది. ఇది ఆరోగ్య సమస్యలను పరిష్కరించడమే కాకుండా, విద్య, మానసిక ఆరోగ్యంపై ఏర్పడిన ప్రభావాలను ఎదుర్కొనడంపై కూడా దృష్టి పెట్టింది.
ఇలా యూనిసెఫ్ ప్రపంచ వ్యాప్తంగా జరిగే ప్రతి సంక్షోభంలోనూ, ప్రతి విపత్తులోనూ పిల్లలకు అపన్న హస్తాన్ని అందిస్తోంది.
*రూపశ్రీ.