Read more!

ఇది ఎవరూ ఊహించని దారుణం!

సరిగ్గా నెల రోజుల క్రితం.. మహబూబ్‌నగర్ జిల్లా గార్ల మండలం  అంకన్నగూడెం గ్రామం.. ముద్దులొలికే చిన్నారులు మూడేళ్ళ లోహిత, ఏడాది వయసున్న జశ్విత తమ కోసం పాలు సిద్ధం చేస్తున్న తల్లి వైపు ప్రేమగా చూస్తున్నారు. ఆ తల్లి లోహితకు గ్లాసులో, జశ్వితకి బాటిల్లో పాలు పోసి ఇచ్చింది. ఆకలి మీద వున్న ఇద్దరు పిల్లలూ పాలు తాగారు. అంతే, విషం కలిపిన ఆ పాలు తాగిన ఇద్దరు చిన్నారులు క్షణాల్లో నురగలు కక్కుకుంటూ, కిందపడి గిలగిలా కొ్ట్టుకుంటూ చనిపోయారు. ఇదంతా అక్కడే వుండి చూస్తున్న ఆ చిన్నారుల తల్లిదండ్రులు అనిల్, దేవి ముఖాల్లో ఎంతమాత్రం బాధ కనిపించడం లేదు. తన పేగు తెంచుకుని పుట్టిన ఇద్దరు పిల్లలు బాధతో విలవిలలాడుతూ కన్ను మూసినా ఆ తల్లిలో ఎంతమాత్రం జాలి కనిపించడం లేదు. ఇద్దరు పిల్లలూ చనిపోయారని నిర్ధారించుకున్న తర్వాత ఆ కిరాతక తల్లిదండ్రులు ఇద్దరూ ఇంట్లోంచి బయటకి వెళ్ళిపోయారు. కొద్దిసేపటికి అనిల్ తండ్రి వెంకన్న ఇంటికి వచ్చి ఈ దారుణం చూశాడు. ఈ వార్త కాసేపట్లో ఊరంతా పాకిపోయింది. 

బయ్యారం మండలంలోని రాయికుంట గ్రామంలో అనిల్ ఇటుకల బట్టీలో పనిచేసేవాడు. అనిల్‌కి అదే గ్రామానికి చెందిన దేవితో పరిచయమైంది. ఆ పరిచయం ప్రేమగా మారింది. వీరి ప్రేమకు పెద్దలు కూడా అభ్యంతరం చెప్పలేదు. ఐదేళ్ళక్రితం ఇద్దరికీ పెళ్ళి చేశారు. పెళ్ళయ్యాక కొంతకాలం సజావుగా వీరి కాపురం సాగింది. ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. ఆ తర్వాతే వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. అడపాదడపా గొడవపడుతూనే వుండేవారు. వీరిమధ్య సయోధ్య కుదర్చడానికి పెద్దలు ప్రయత్నాలు చేస్తూనే వున్నారు. మరి ఏమైందో ఏమో.. తమ కుటుంబ సమస్యను పరిష్కరించుకోవాలంటే పిల్లల్ని చంపడమే కరెక్టని అనుకున్నారేమోగానీ, ఈ ఇద్దరూ కలసి తమ పిల్లలకు పాలతోపాటు విషం ఇచ్చి చంపేశారు.  ఆ తర్వాత ఇద్దరూ ఇంట్లోంచి వెళ్ళిపోయారు.

పసికందులను చంపి పరారైన తల్లిదండ్రులు అనిల్, దేవి కోసం గత నెల రోజులుగా పోలీసులు గాలిస్తూనే వున్నారు. ఇప్పుడు అందరికీ షాకింగ్ న్యూస్ తెలిసింది. అనిల్, దేవి మృతదేహాలు అడవిలో చెట్టుకు వేలాడుతూ కనిపించాయి. పిల్లలను చంపిన తర్వాత అడవికి వెళ్ళిన ఈ ఇద్దరూ అప్పుడే ఉరి వేసుకున్నారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. చనిపోయి నెలరోజులు కావడంతో వీరి మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితికి చేరుకున్నాయి. అనురాగం, ఆప్యాయతలతో అన్యోన్యంగా ఉండాల్సిన కుటుంబం వివాదాల కారణంగా ఇలా అంతమైపోవడం దారుణమని స్థానికులు బాధపడుతున్నారు.