ఎన్డీయే సర్కార్ వస్తే..చంద్రబాబు మాటే చెల్లుబాటు!
posted on May 23, 2024 @ 10:13AM
జాతీయ ప్రజాస్వామ్య కూటమి అంటే నేషనల్ డెమక్రటిక్ అలయెన్స్ (ఎన్డీఎ). ఒకప్పుడు అటల్ బిహారీ వాజ్’పేయి సారధ్యంలో 24 పార్టీల కూటమిగా కేంద్రంలో చక్రం తిప్పిన ఎన్డీఎకు ఇప్పుడు మోడీ పదేళ్ల పాలనలో ఎన్డీయేకూ అసలు పోలికే లేదు. ఇప్పుడు ఎన్డీయేలో సింగిల్ సీట్ పార్టీలు తప్ప మరేమీ మిగలలేదు. తాజాగా ఎన్నికల ముందు కూటమిలో చేరిన తెలుగుదేశం, జనసేన వినా ప్రస్తుతం ఎన్డీయేలో చెప్పుకోదగ్గ పార్టీ లేదని చెప్పడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు. ఇంత వరకు జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సారధ్యంలోని జనతా దళ్ (యు) కూటమిలో చేరడంతో.. అది పూర్తిగా ఆయన రాజకీయ స్వార్ధం కోసమే, అధికారాన్ని, ముఖ్యమంత్రి పదవినీ కాపాడుకోవడం కోసమే అయినా ఎన్డీయే ఉనికిని చాటుకోవడానికి దోహదపడిందనే చెప్పాలి.
నిజానికి, 2014 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ‘ఏకపార్టీ’ ఆధిక్యత సాధించిన రోజునే, ఎన్డీఎ కథ ఇక ముగిసినట్లేనని పరిశీలకులు విశ్లేషణలు చేశారు. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత మొదటిసారిగా లోక్ సభలో బీజేపీ సొంతగా సాధారణ మెజారిటీ (272)కంటే 10 సీట్లు అదనంగా (282) గెలిచి చరిత్రను తిరగ రాసింది. అలాగే, 2019 ఎన్నికల్లో బీజేపీ సొంత బలమే 303 కు చేరింది. మరో వంక ప్రతిపక్ష కూటమి, యూపీఎకు సారధ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ దినదిన ప్రవర్థమానంగా దిగజారి ప్రాంతీయ పార్టీల పంచన చేరే పరిస్థితికి చేరుకుంది.
అయినా 2014లో, 2019లో బీజీపీ ప్రధాని మోడీ సారధ్యంలో ఎన్డీఎ సంకీర్ణ ప్రభుత్వాలే ఏర్పాటు చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ మొదటి మంత్రివర్గంలో తెలుగు దేశం, శివసేన, అకాలీదళ్, సహా అనేక ప్రాంతీయ పార్టీలు భాగస్వాములుగా ఉన్నాయి. అయితే ఆ తర్వాత ఏమి జరిగింది అన్నది చరిత్ర. ఎవరి కారణాలు వారికీ ఉన్నా, ఒక్కొక్క పార్టీ ఎన్డీఎకి దూరమవుతూ వచ్చాయి.
2019 ఎన్నికల్లోనూ అకాలీ దళ్, శివసేన, పాశ్వాన్ పార్టీ ఎల్’జేపీ, ఎఐఎడిఎంకే, జేడీ(యు)సహా అప్నా దళ్, ఆల్ ఝార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ వంటి మరికొన్ని చిన్నా చితక పార్టీలు సహా మొత్తం తొమ్మిది పార్టీలు కలిసి పోటీచేశాయి. 2024 ఎన్నికలు వచ్చే సరికి ఎన్డీయే కూటమిలో ఆ చిన్నా చితకా పార్టీలలోని కొన్ని మాత్రమే మిగిలాయి. బీజేపీ సహజ మిత్ర పక్షాలుగా చెప్పుకునే శివసేన, అకాలీ దళ్ వంటి ప్రధాన ప్రాంతీయ పార్టీలు ఏవీ ఎన్డీఎలో లేవు. పేరుకే ఎన్డీయే.. కానీ ఎన్డీయేలో ఉన్న పార్టీలు ఏవీ రాజకీయంగా ప్రభావం చూపగలిగే పార్టీలు కాదు. ఏ పార్టీకి కూడా లోక్ సభలో ఒకటి రెండు స్థానాలకు మించి లేవు.
ఈ నేపథ్యంలోనే పదేళ్ల మోడీ పాలన సహజంగానే ప్రజలలో కొంత వ్యతిరేకత మూటగట్టుకుంది. ముఖ్యంగా రైతులు, నిరుద్యోగులు మోడీ సర్కార్ పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ ప్రమాదాన్ని గుర్తించిన బీజేపీ మళ్లీ ఎన్డీయేలో ప్రధాన ప్రాంతీయ పార్టీల ఆవశ్యకతను గుర్తించింది. ఆ క్రమంలోనే తెలుగుదేశం పార్టీని ఎన్డీయే గూటికి చేర్చుకుంది. ఇప్పుడు ఎన్డీయేలో ఉన్న ప్రధాన పార్టీ అనేది ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ మాత్రమే.
ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ఐదు విడతల పోలింగ్ పూర్తియిన తరువాత చూసుకుంటే.. బీజేపీ సొంతంగా సాధారణ మెజారిటీ సాధిస్తుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అదే జరిగితే కేంద్రంలో మళ్లీ తెలుగుదేశం పార్టీయే ఎన్డీయేలో బీజేపీ తరువాత అతి పెద్ద పార్టీగా అవతరించే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అంటే విభజన సమస్యల పరిష్కారం, ఏపీకి సహకారం విషయంలో చంద్రబాబు కేంద్రంపై ప్రభావమంతంగా ఒత్తిడి తీసుకురాగలరని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.ఆయన మాటకే ఎక్కువ చెల్లుబాటు ఉంటుందని అంటున్నారు.