చేతులు జోడించిన సోనియా ... శాంతించిన ములాయం
posted on Mar 22, 2013 7:27AM
సమాజ్ వాదీ పార్టీతో తన రాజకీయ జీవితం ప్రారంభించిన బేణీ ప్రసాద్ వర్మ ప్రస్తుతం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. పార్లమెంటులో బేణీ ప్రసాద్ సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ కు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని విమర్శలు గుప్పించారు. దీంతో ఎస్పీ నేతలు బేణీ ప్రసాద్ వర్మను కేబినేట్ మంత్రి హోదా నుండి తొలగించాలని, ములాయం సింగ్ కు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని పట్టుబట్టారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్ ములాయంకు నచ్చజెప్పడంతో పాటు లోక్ సభలో సోనియా బుధవారం చేతులు జోడించి బేణీప్రసాద్ రాజీనామాకు పట్టుపట్టరాదనీ ములాయంను కోరింది. దీంతో ములాయం కాస్త వెనకడుగు వేశారు. అసలే డిఎంకే యూపీఏ కు తమ మద్ధతు ఉపసంహరించుకున్న తరుణంలో 22 మంది సభ్యులున్న సమాజ్ వాదీ పార్టీ కీలకంగా మారింది. ఇప్పట్లో మధ్యంతర ఎన్నికలు వచ్చే సూచనలు లేకపోవడంతో ములాయం సరైన సమయంకోసం ఎదురు చూస్తున్నారు. బేణీ ప్రసాద్ వర్మ కూడా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల నాథ్ తో కలిసి మీడియా సమావేశంలో ములాయంపై తాను చేసిన అనుచిత వ్యాఖ్యలకు విచారం వ్యక్తం చేశారు.