సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన.. ఆసుపత్రి నుంచి శ్రీ తేజ్ డిశ్చార్జ్

 

సంధ్య థియేటర్ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీ తేజ్  హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. గత ఏడాది డిసెంబర్ 4న పుష్ప-2 రిలీజ్ సందర్భంగా, సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్ 5 నెలలుగా కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. శ్రీతేజ్ కళ్లు తెరిచి చూస్తున్నాడని, కండిషన్ స్టేబుల్‌గా ఉందని తండ్రి భాస్కర్ తెలిపారు. ఈ ఘటన తర్వాత హీరో అల్లు అర్జున్‌తో సహా థియేటర్ యాజమాన్యంపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కేసులో బన్నీనీ  ఏ11 నిందితుడిగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి అరెస్టు చేశారు. 

ఆ తర్వాత హైకోర్టు బెయిల్ మంజూరు చేసినా.. బెయిల్ పేపర్లు ఆలస్యం కావటంతో ఆయన ఓ రోజు రాత్రి మొత్తం చంచల్‌గూడ జైలులో ఉండాల్సి వచ్చింది. అనంతరం అల్లు అర్జున్ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటాననని హామీ ఇచ్చారు. అయితే ఘటన జరిగి ఇప్పటికే దాదాపు 5 నెలలు గడిచిపోవటంతో చాలా మంది ఈ ఘటనను మర్చిపోయారు కూడా. ప్రస్తుతం బాలుడి ఆరోగ్య పరిస్థితి కాస్త నిలకడగా ఉండటంతో డాక్టర్లు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. ఇక్కడి నుంచి రిహాబిలిటేషన్‌ కేంద్రానికి తరలించాలని వైద్యులు సూచించారు. అక్కడ 15 రోజుల పాటు ఉంచి ఫిజియోథెరఫీ వంటివి నిర్వహించాక ఇంటికి తీసుకెళ్లొచ్చని సూచించినట్లు సమాచారం

Teluguone gnews banner