Read more!

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు బహుజనుల సెగ

బీఎస్పీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ గూటికి చేరి లోక్ సభ ఎన్నికలలో ఆ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన బీఎస్పీ మాజీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు బహుజనుల సెగ గట్టిగా తగిలింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో బీఎస్పీ అభ్యర్థిగా సిర్పూర్ నియోజకర్గం నుంచి పోటీ చేసి పరాజయం పాలైన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. ఆ తరువాత బీఎస్పీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ గూటికి చేరారు.

అలా చేరడానికి ముందు లోక్ సభ ఎన్నికలలో బీఆర్ఎస్ తో బీఎస్పీ పొత్తు పెట్టుకుంటున్నట్లు ఏకపక్షంగా ప్రకటించారు. అయితే బీఎస్పీ అధినేత్రి మాయావతి పోత్తును గుర్తించలేదు. ఏ పార్టీతోనూ బీఎస్పీకి పొత్తు లేదని విస్పష్టంగా ప్రకటించారు. దీంతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీకి రాజీనామా చేసి కారెక్కేశారు. ఇలా కారెక్కారో లేదో అలా బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆయనను నాగర్ కర్నూల్ లోక్ సభ నియోజవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించి టికెట్ ఇచ్చేశారు. అయితే ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో ఆయన పోటీ చేసిన సిర్పూర్ నియోజకవర్గ పరిధిలో బహుజనులు ప్రవీణ్ కుమార్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఆయనను బహుజన ద్రోహిగా అభివర్ణిస్తున్నారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో  సిర్పూరు నియోజ‌కవ‌ర్గంలో బీఆర్ఎస్ కార్యక‌ర్తల స‌మావేశంలో పాల్గొనేందుకు ప్రవీణ్ కుమార్ హాజరు కానున్న తరుణంలో ఆయనకు వ్యతిరేకంగా కొమురం భీం జిల్లా కౌటలలో పెద్ద ఎత్తున పోస్టర్లు వెలిశాయి.  ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీని వీడి బీఆర్ఎస్ లో చేరడంనూ  బహుజనుల వ్యతిరేత ఆయన పోటీ చేస్తున్న నాగర్ కర్నూల్ లోక్ సభ నియోజకవర్గంలో ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు.