ఏపీ బీజేపీలో ముసలం.. జల్లా అధ్యక్షుల మార్పుపై రగడ

అధిష్ఠానం మాటే శిరోధార్యం.. క్రమశిక్షణ కు మారు పేరు.. ఇదీ నిన్న మొన్నటి దాకా బీజేపీపై జనాలలో సాధారణంగా ఉన్న అభిప్రాయం.  అయితే ఈ అభిప్రాయాన్ని మార్చుకోక తప్పని అనివార్య పరిస్థితులను స్వయంగా ఆ పార్టీ అగ్రస్థానమే కల్పిస్తోంది. గతానికి భిన్నంగా పార్టీ తలుపులు బార్లా తెరిచేసి సిద్ధాంత సారూప్యత ఇసుమంతైనా లేని పార్టీల నుంచి వచ్చి చేరుతున్న నాయకులకు రెడ్ కార్పెట్ పరుస్తోంది. దీంతో బీజేపీ గతంలోలా అధిష్ఠానం ఏం చెబితే దానికి తలూపేసి క్రమశిక్షణతో మెలిగే నాయకుల సంఖ్య రాను రాను మారిపోతోంది. గతంలో బీజేపీ ఏ పార్టీ సంస్కృతినైతే వేలెత్తి చూపి ప్రత్యామ్నాయంగా ఎదిగిందో..  ఇప్పుడు అదే కాంగ్రెస్ సంస్కృతిని అనుసరిస్తూ.. ఆ పార్టీని మించి పోయింది.

ఇక తాజాగా ఏపీ బీజేపీలో లుకలుకలు బయటపడ్డాయి. ఏపీ బీజేపీ జిల్లా కమిటీల మార్పు విషయంలో పార్టీలో తిరుగుబావుటా ఎగిరింది. ప్రస్తుత అధ్యక్షుడు సోము వీర్రాజు పదవీ కాలం ఇంకా ముగియకుండానే, ఆయన పదవిలో ఉండగానే జిల్లా కమిటీల మార్పు ప్రక్రియ మొదలు కావడం బీజేపీలో అసమ్మతి, అసంతృప్తి జ్వాలలు ఎగసిపడేలా చేసింది. జిల్లా అధ్యక్షుల మార్పునకు రాష్ట్ర నాయకత్వం శ్రీకారం చుట్టగానే అసమ్మతి భగ్గు మంది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మురళీధరన్ కు ఇష్టం లేకుండానే, ఆయన ప్రమేయం లేకుండానే  పెద్ద ఎత్తున జిల్లా అధ్యక్షులనుమార్చేందుకు రాష్ట్ర నాయకత్వం నడుం బిగించింది.  

పార్టీ నిబంధనల ప్రరాకం  ఓటింగు ద్వారా  ఎన్నికల ప్రక్రియలో గెలిచిన తమను తొలగించి,   నామినేషన్ పద్ధతిలో మరొకరిని నియమించేందుకు సోము వీర్రాజు చేస్తున్న ప్రయత్నాలను పార్టీ లో  మెజారిటీ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.   
బీజేపీ జాతీయ అధ్యక్షుడు నద్దా తో పాటే రాష్ట్రాల పార్టీ అధ్యక్షుల పదవీ కాలం కూడా వచ్చే ఏడాది ఫిబ్రవరితో ముగియనుంది.  
నిన్న మొన్నటి వరకూ బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా మరోసారి నడ్డాకు అవకాశం ఖాయమన్న ప్రచారమే జరుగుతూ వచ్చింది. అయితే హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ పరాజయంతో సీన్ రివర్స్ అయ్యింది. సొంత రాష్ట్రంలో పార్టీని విజయపథంలో నడిపించలేని  నడ్డా ఇక జాతీయ స్థాయిలో బీజేపీని ఎలా గెలిపించగలరన్న విమర్శలు వెల్లువెత్తుతున్న నేపపథ్యంలో నడ్డాకు స్థాన  భ్రంశం తప్పదన్నప్రచారం జోరందుకుంది.  

నడ్డా స్థానంలో అమిత్‌షాకు సన్నిహితుడైన కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్‌ను పార్టీ అధ్యక్షునిగా ఎన్నుకునే అవకాశాలున్నయన్న ప్రచారం ఇప్పుడు జరుగుతోంది.  ఈ నేపథ్యంలోనే రాష్ట్రాల అధ్యక్షుల మార్పు చర్చ కూడా జరుగుతోంది. ఆ చర్చలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు ఉద్వాసన ఖాయమని వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే  జిల్లా అధ్యక్షుల మార్పు ప్రక్రియకు ఏపీ బీజేపీ రాష్ట్ర నాయకత్వం శ్రీకారం చుట్టడం కలకలానికి కారణమైంది. తమను తప్పించి నామినేషన్ ద్వారా కొత్త అధ్యక్షులనున నియమించేందుకు ససేమిరా అంగీకరించబోమంటూ వారు తిరుగు బావుటా ఎగుర వేస్తున్నారు. ఒకవైపు సోము వీర్రాజునే తొలగిస్తున్నారన్న ప్రచారం జరుగుతుంటే, ఆయన తమను ఏ విధంగా తొలగిస్తారని  జిల్లా అధ్యక్షులు  నిలదీస్తున్నారు.   

Teluguone gnews banner