Read more!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఓవర్ డ్రాఫ్ట్ సెగ!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గడిచిన ఐదు ఆర్ధిక సంవత్సరాల్లో మొత్తం 47,682.87 కోట్ల రూపాయల ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాన్ని పొందింది. దేశం మొత్తం మీద ఓవర్ డ్రాఫ్ట్ (ఓ.డి.) అత్యధిక మొత్తం పొందిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తొలి స్థానంలో నిలవటంతో, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి భవిష్యత్ లో ఏ విధంగా ఉంటుందనే విషయంలో ఆందోళనలు మొదలయ్యాయి. 2014-15 ఆర్ధిక సంవత్సరం నుంచి 2019-2020 జనవరి 23 వ తేదీ వరకూ, ఎక్కువ మొత్తం ఓ.డి. తీసుకున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండడటం ఆర్ధిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఐదు ఆర్ధిక సంవత్సరాలలో  ఓ.డి. పొందిన రోజులే 188 దినాలుగా నమోదు అయినట్టు, సమాచార హక్కు చట్టం (ఆర్టి ఐ యాక్ట్) కింద భారతీయ రిజర్వ్ బ్యాంకు (ఆర్బిఐ) వెల్లడించింది. 

వివరాల్లోకి  వెళితే, 2014-15 లో 14 రోజులకు గాను 4,313 కోట్లు, 2015-16 లో 6 రోజులకు గాను 95. 38 కోట్లు, 2016-17 లో 6 రోజులకు గాను 1,295.22 కోట్లు, 2017-18 లో 38 రోజులకు గాను 8,625. 81 కోట్లు, 2018-19 లో 88 రోజులకు గాను 19,616.71 కోట్లు, 2019 ఆర్ధిక సంవత్సరం మొదలనప్పటి నుంచి ఈ ఏడాది జనవరి 23 వరకూ మొత్తం 36 రోజులకు గాను 13, 736. కోట్ల రూపాయల ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకుందని ఆర్బీఐ.. ఆర్టిఐ చట్టం కింద సమాచారం పొందు పరిచింది.

తెలుగు దేశం పార్టీ అధికారం చేపట్టినప్పటి నుంచి, గడిచిన ఏడాది అంటే 2018-19 వరకూ అత్యధికంగా, 2018-19 లోనే ఆ ప్రభుత్వం అత్యధికం గా 88 రోజులకు గాను 19,616.71 కోట్ల రూపాయల ఓవర్ డ్రాఫ్ట్ మొత్తాన్నిడ్రా చేసింది. ఇప్పుడా పెను భారాన్ని, వైఎస్ఆర్సిపీ ప్రభుత్వం కూడా మోయాల్సిన పరిస్థితి రావటం తో, 2019 ఆర్ధిక సంవత్సరం మొదలైనపట్టి నుంచీ , ఈ ఏడాది జనవరి 23 వరకూ కేవలం 36 రోజులలో 13,736.75 కోట్ల రూపాయల ఓ.డి. సౌకర్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం వినియోగించింది.

నిజానికి ఓవర్ డ్రాఫ్ట్ పరిమితి మించి పోతోందంటూ, రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక శాఖ కార్యదర్శి షంషేర్ సింగ్ రావత్ కు, నిరుడు జూన్ 11, జూన్ 12 తేదీల్లో ఆర్బీఐ జనరల్ మేనేజర్ అరవింద్ కుమార్ రెండు లేఖలు కూడా పంపారు. 2019 జూన్ 10 వ తేదీ నాటికి ఓవర్ డ్రాఫ్ట్ మొత్తం 699. 99 కోట్ల రూపాయల మొత్తం గా నమోదైందని, ఆ త్రైమాసికం లో 16 రోజులు ఓ.డి. సౌకర్యాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పొందిందనీ, వరసగా 14 రోజుల పాటు ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ఓ.డి. పొందిన పక్షం లో రిజర్వ్ బ్యాంక్ చెల్లింపులు నిలిపివేసే పరిస్థితి ఏర్పడుతుందని కూడా ఆ లేఖలో ఆర్బీఐ జనరల్ మేనేజర్ అరవింద్ కుమార్ హెచ్చరించారు. నిరుడు జూన్ 12 వ తేదీన ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం 17 వరస పని దినాల్లో 339. 17 కోట్ల రూపాయల ఓ.డి. పొందినట్టు పేర్కొన్నారు. తక్షణమే ఓవర్ డ్రాఫ్ట్ మొత్తాన్ని తిరిగి చెల్లించే ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆ లేఖలో ఆయన రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక శాఖ కార్యదర్శిని కోరారు.

మొత్తం ఓవర్ డ్రాఫ్ట్ లెక్కలను పరిశీలించిన ఆర్ధిక నిపుణుల విశ్లేషణ ప్రకారం..రాష్ర ఆర్ధిక పరిస్థితి అంట ఆశాజనకం గా లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. తెలుగు దేశం ప్రభుత్వం అప్పచెప్పిన ఓవర్ డ్రాఫ్ట్ లెక్కల నుంచి బయటపడాలంటే, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధికక్రమశిక్షణ చర్యలను తక్షణం చేపట్టాలని వారు సూచిస్తున్నారు.