Read more!

రావాలి జగన్.. కావాలి జగన్! గ్రేటర్ లో ప్రత్యేక ప్రచార రథం  

రావాలి జగన్.. కావాలి జగన్. ఈ నినాదం రాసి ఉన్న బ్యానర్లు, ఫ్లెక్సీలు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కొన్ని చోట్ల దర్శనమిస్తున్నాయి. ప్రచార రథాలకు ఇదే నినాదాన్ని పెద్దగా రాయించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈ నినాదంతో వైసీపీ ప్రచారం చేసింది. రావాలి జగన్.. కావాలి జగన్ అన్న పాటలు మార్మోగాయి. ఇప్పుడు అదే నినాదం గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లోనూ కొన్ని చొట్ల వినిపిస్తోంది. ఈ నినాదం  విన్న వారంతా జీహెచ్ఎంసీలో పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థులు ఇలా ప్రచారం చేస్తున్నారేమోనని భావించారు. కాని వైసీపీ గ్రేటర్ ఎన్నికలకు దూరంగా ఉంది. వైసీపీ పోటీ చేయకున్నా రావాలి జగన్ .. కావాలి జగన్ నినాదం వినిపిస్తుండటం ఇప్పుడు గ్రేటర్ లో చర్చగా మారింది. 

 

రావాలి జగన్.. కావాలి జగన్ నినాదంతో ప్రచారం చేస్తున్నది వైసీపీ నేతలు కాదు టీఆర్ఎస్ నేతలు. గులాబీ లీడర్లు ఇలా ప్రచారం చేస్తుండటం మరింత ఆసక్తిగా మారింది. రావాలి జగన్.. కావాలి జగన్ బ్యానర్ తో టీఆర్ఎస్ అభ్యర్థి ప్రచారం చేస్తున్న వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఏపీ ముఖ్యమంత్రి  జగన్ ను తమ స్నేహితుడిగా చెబుతుంటారు సీఎం కేసీఆర్. జగన్ కూడా కేసీఆర్ ను పొగుడుతుంటారు. దీంతో తమ పార్టీ అధినేత మిత్రుడైన జగన్ పార్టీ నినాదాన్ని టీఆర్ఎస్ నేతలు ఉపయోగించుకుంటాన్నరంటూ కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. హైదరాబాదీలకు జగన్ ముద్దులు కావాలట అంటూ మరికొందరు సెటైర్లు వేస్తున్నారు.  

అయితే గ్రేటర్ ఎన్నికల్లో ఈ నినాదం  వెనక అసలు సోర్టీ మాత్రం మరోలా ఉంది. జగద్గిరిగుట్ట నుంచి  టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అభ్యర్థి పేరు జగన్. గత ఎన్నికల్లో ఈయన ఇక్కడి నుంచి విజయం సాధించారు. సిట్టింగ్ కార్పొరేటర్ గా మరోసారి బరిలో నిలిచారు. తన పేరు జగన్ కావడంతో.. కావాలి జగన్.. రావాలి జగన్ అని రాయించుకుని ఆయన ప్రచారం చేసుకుంటున్నారు. ఏపీ ఎన్నికల సమయంలో మార్మోగిన ఈ నినాదం తనకు కలిసి వస్తుందనే ఆలోచనతోనే ఇలా చేశానని చెబుతున్నారు టీఆర్ఎస్ అభ్యర్థి జగన్. ఈ విషయం తెలియని చాలా మంది.. రావాలి జగన్.. కావాలి జగన్ అని రాసి ఉన్న టీఆర్ఎస్ ప్రచార రథంపై సెటైర్లు వేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని చెబుతున్నారు.