మారింది అధినాయకుడు మాత్రమే! కాంగ్రెస్ తీరు కాదు
posted on Apr 25, 2013 @ 12:56PM
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా రాహుల్ గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టిన నాటినుండి ఆయన చేస్తున్న ఆకర్షణీయమయిన ప్రసంగాలు, పార్టీ ప్రక్షాళన, అధికార వికేంద్రీకరణం, అవినీతిరహితమయిన ప్రభుత్వాల ఏర్పాటు వంటి మాటలు విని, ఆయన గుర్రంపై ఎక్కి,వచ్చితన దగ్గరున్నమంత్రం దండంతో అటు స్వంత పార్టీని, ఇటు దేశాన్నిసమూలంగా మార్చేస్తాడని ఎవరూ భావించకపోయినా, కనీసం పార్టీపరంగా కొన్ని మంచి మార్పులు తీసుకువచ్చి, పార్టీని తన పాత పందానుండి బయట పడేస్తాడని మాత్రం చాల మంది ఊహించారు. కానీ, మాటలు వేరు, చేతలు వేరన్నట్లు ఉంది ఆయన పద్ధతి. కర్ణాటక శాసనసభకి త్వరలో జరగనున్న ఎన్నికల ప్రచారంలో విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ మానిఫెస్టోలో అంశాలను గమనిస్తే మారింది అధినాయకుడు మాత్రమే! తప్ప కాంగ్రెస్ తీరు, ఆలోచనలు కాదని అర్ధం అవుతుంది.
మానిఫెస్టోలో ప్రకటించిన తాయిలాలు కొన్ని:
కేజీ రూ.1బియ్యం నెలకి 30 కేజీలు ఒక్కో ఇంటికి
కాలేజీ విద్యార్దులకు ల్యాప్ టాపులు
పీయుసీ విద్యార్దులకు డిజిటల్ నోట్ట్ బుక్స్ (టాబ్లెట్ పీసీలు)
పాడి రైతులకు పాల మీద లీటరుకు రూ.4 సబ్సీడి
వ్యవసాయదారులకు రుణాల మాఫీ వ్యవసాయదారులకు రూ.2లక్షల వరకు వడ్డీలేని రుణాలు వ్యవసాయదారులకు రూ.4లక్షల వరకు కేవలం 3 శాతం వడ్డీతో రుణాలు (బహుశః ఈ రుణాలు వారు తిరిగి చెల్లించలేకపోతే వచ్చే సాధారణ ఎన్నికలలో వాటిని మాఫీ చేస్తారేమో!)
ఇక రాహుల్ గాంధీ ప్రచారంలో కూడా ‘కాంగ్రెస్ మార్క్’ కొట్టవచ్చినట్లు కనబడుతోంది. ఒక వైపు కేంద్రంలో రోజుకొక కుంభకోణం బయటపడుతుంటే, తమను ఎన్నుకొంటే కర్ణాటకలో మాత్రం స్వచ్చమయిన పరిపాలన అందిస్తామని నొక్కి వక్కాణిస్తున్నారు. ఆయన స్వంత పార్టీలో, స్వంత ప్రభుత్వంలో, ఇంకా చెప్పాలంటే స్వంత కుటుంబంలో (బావగారు రాబర్ట్ వాద్రాభూముల భాగోతాలు) వెలుగు చూస్తున్న భాగోతాలను మరిచి, బీజేపీ అవినీతిని ప్రస్తావించడం చూస్తే అద్దాల మేడలో కూర్చొని రాళ్ళు విసురుతున్నట్లు ఉంది.
65 ఏళ్లుగా దేశాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ సాధించిన ఘనకార్యాలు చెప్పుకొని ఓట్లు కోరే బదులు, ప్రతిపక్ష ప్రభుత్వం అవినీతి గురించి మాట్లాడుతూ తమకి ఒట్లేయమని కోరడం చూస్తే, ఎవరు పగ్గాలు చెప్పటినా పార్టీకి అనుకూలంగా వారే మారాలి తప్ప కాంగ్రెస్ పార్టీని ఎన్నడూ, ఎవరూ మార్చలేరని అర్ధం అవుతోంది.
రాహుల్ గాంధీ తన ఆలోచనలను, ఆశయాలను కనీసం కర్ణాటక రాష్ట్రంలో ‘పైలట్ ప్రాజెక్టు’గా అమలుచేసి చూపినా ఆయన నాయకత్వం పట్ల ప్రజలలో నమ్మకం పెరిగి ఉండేది. ఒకవేళ అక్కడ సఫలం కాలేకపోతే, అప్పుడు రాబోయే సాధారణ ఎన్నికలలో మళ్ళీ కాంగ్రెస్ మార్క్ రాజకీయాలు చేసుకొనే అవకాశం ఉంది. కానీ, రాహుల్ గాంధీ కూడా ఇప్పుడు అంత రిస్క్ తీసుకొనే మూడ్ లో లేరు.