Read more!

పోస్ట్ డేటెడ్ రాజీనామా పత్రం

 

ఏ ముహూర్తాన కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నారోగానీ.. అన్నీ ఆయనకు ఎదురొస్తున్నాయ్. తన తప్పేలేకుండా ఎంత జాగ్రత్తగా మ్యానేజ్ చేయాలనుకున్నా చాలా విషయాలు, సంగతులు అస్సలు కంట్రోల్లోకి రావడం లేదు.

 

ప్రతిపక్షాలమాట ఎలా ఉన్నా అధికారపక్షంలోనే ఉన్న విపక్షాలనుంచి ఎదురౌతున్న ఒత్తిడి, తెలంగాణ అంశం కిరణ్ కి కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయ్. ఇప్పుడు చార్మినార్ భాగ్యలక్ష్మీ దేవాలయం ఎపిసోడ్ కారణంగా ఎంఐఎం ఏకంగా మద్దతుని ఉపసంహరించింది.

 

కిరణ్ కుమార్ రెడ్డిమీద రోజుకో ఫిర్యాదు, పూటకో కంప్లైంట్ చందంగా కాంగ్రెస్ అధిష్ఠానానికి నిమిష నిమిషానికీ చాడీలు చేరిపోతున్నాయ్. ఇప్పుడు ఎంఐఎం మద్దతు ఉపసంహరణ వ్యవహారంలో సోనియా కిరణ్ పై మండిపడుతున్నట్టు సమాచారం.

 

కిరణ్ కుమార్ ని కుర్చీలో కూర్చేబెట్టేరోజే ఎప్పుడు అడిగితే అప్పుడు రాజీనామా చేయాలన్న షరతునుకూడా అధిష్ఠానం విధించిందని వినికిడి. ఆ మేరకు కిందటిసారి సీఎం ఢిల్లీకెళ్లొచ్చినప్పుడు తారీఖు వేయకుండా తన రాజీనామాపత్రాన్ని సమర్పించొచ్చారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

 

ఇప్పుడు ఎంఐఎం మద్దతు ఉపసంహరణ ఎపిసోడ్ పుణ్యమా అని కిరణ్ కుమార్ సమర్పించిన రాజీనామా పత్రంపై తారీఖుని వేసుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ అధిష్ఠానానికొచ్చేసిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఎప్పట్నుంచో ప్రచారంలోఉన్న సీఎం మార్పిడి కథనం ఇప్పుడు మళ్లీ తెరమీదికొచ్చింది.

 

నేడోరేపో కిరణ్ కుమార్ రెడ్డిని కుర్చీనుంచి దింపేస్తారన్న ప్రచారం ఊపందుకుంది. కొత్త ముఖ్యమంత్రి ఎంపిక కోసం జరుగుతున్న పోటీలో మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి కుమారుడు శశిధర్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి పోటీలో ఉన్నట్టు ఢిల్లీవర్గాల సమాచారం.