Read more!

ప్రజలారా టీ తాగొద్దు.. ప్లీజ్!

  కాస్తంత త‌ల‌నొప్పిగా వుందంటే ఓ అర‌క‌ప్పు టీ తాగ‌డానికే ఆలోచిస్తాం. చిన్న‌పాటి మాత్ర‌ కంటే గుక్కెడు టీ తాగ‌డానికి యావ‌త్ మాన‌వ‌ లోకం స‌ర‌దాతో కూడిన నిర్ణ‌యం తీసుకుంటుంది. టీ తాగ‌డంలో మ‌జాయే వేర‌ప్పా సిద్ద‌ప్పా.. అంటారు ఉద్యోగులంతా. అదీ నిజ‌మే. టీకి కాలం, స‌మ‌యం, ప్రాంతాల‌తో బొత్తిగా సంబంధం లేదు. కానీ చిత్రంగా పాకిస్తాన్ కొత్త ప్ర‌భుత్వంలో  ప్ర‌ణాళికా శాఖ మంత్రి అహ‌సాన్ ఇక్బాల్‌ మాత్రం  ఆ దేశ ప్ర‌జ‌ల‌కు బాబూ కాస్తంత టీ పిచ్చి త‌గ్గించుకోండ్రా నాయ‌న‌లారా! వీలైతే మొత్తంగా టీ తాగడం మానేయండి అని సందేశ మిచ్చార‌ట‌!   దయచేసి టీ అలవాటుకు దూరం కండి అంటే బతిమాలుకుంటున్నారు.   విన‌డానికి చాలా చిత్రంగా వున్నా, పాక్ మంత్రి సీరియస్ గానే దేశ ప్రజలను టీ మానేయ మంటున్నారు. 

ఇమ్రాన్ ఖాన్‌ను  ఏప్రిల్‌లో గ‌ద్దె దించేసిన త‌ర్వాత ప్ర‌ధాని అయిన సాబాజ్ ష‌రీఫ్ దేశ ఆర్ధిక ప‌రిస్థితిని  మెరుగుప‌రుస్తాన‌ని ప్ర‌మాణం చేసేరు. టీ సంగ‌తేమిటంటే.. ప్ర‌పంచ దేశాల్లో టీని దిగుమ‌తిని చేసుకుంటున్న దేశాల్లో పాకిస్తాన్ మొద‌టి స్థానంలో వుంది. 220 మిలియ‌న్ల జ‌నాభా వున్న పాక్ లో త‌ర‌త‌మ భేదాలు లేకుండా అంద‌రూ రోజుకూ క‌నీసం మూడు క‌ప్పుల టీ తాగుతుంటార‌ట‌.

ప్ర‌తీయేటా ఈ టీ దిగుమ‌తికి ప్ర‌భుత్వ సెంట్ర‌ల్ బ్యాంక్  నిధుల నుంచి సుమారు 600 మిలియ‌న్ డాల‌ర్లు ఖ‌ర్చు చేస్తోంది. అలాంట‌పుడు ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో దేశ ఆర్ధిక స్థోమ‌త‌ను బ‌ల‌ప‌రిచేందుకు ఇలాంటి చిన్న‌పాటి త్యాగాలు చేయాల్సిందే న‌ని మంత్రి గారి ఉప‌దేశం. ఆయ‌న స‌ల‌హా విన‌డానికి త‌మాషాగా వున్న‌ప్ప‌టికీ ఒక విధంగా ఈ మాత్రం త్యాగ‌నికి ప్ర‌జ‌లు సిద్ధపడక తప్పదేమో! అందునా ఆర్ధిక ప‌రిస్థి తులు స‌రిగా లేన‌పుడు! కానీ మంత్రిగారి విన్నపం పట్ల ప్రభఉత్వం తీవ్ర నిర‌స‌న‌నే  ఎదుర్కొంటోంది.