Read more!

సోంత చెల్లెలే నమ్మడం లేదు.. జనం ఎలా నమ్ముతారు జగన్?

జగన్ పై జరిగిన గులకరాయి దాడి ఒక్క సారిగా యావత్ రాష్ట్రంలో సంచలన వార్త అయిపోయింది. ఎలాంటి శషబిషలూ లేకుండా ఈ దాడిని తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి దాడులకు ఆస్కారం ఉండకూడదని నిర్ద్వంద్వంగా చెప్పేశారు. సీఎంపైనే దాడి అంటే భద్రతా వైఫల్యం ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవాలని, భద్రతా వైఫల్యానికి కారకులైన పోలీసు అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పరిస్థితులపై ఎన్నికల సంఘం వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు. 

కానీ ఈ మొత్తం వ్యవహారంలో వైసీపీ తీరే అనుమానాస్పదంగా కనిపించింది. దాడి విషయంలో విపక్ష నేత చంద్రబాబు ప్రమేయం ఉందని చెప్పడానికి వైసీపీ తెగ తహతహలాడిపోతోంది. ఈ ఉత్సాహంలో జగన్ పై దాడి విషయంలో భద్రతా లోపం ఇసుమంతైనా లేదనీ, పోలీసులు వారి విధినిర్వహణలో బ్రహ్మాండంగా పని చేస్తున్నారని కితాబు కూడా ఇచ్చేసింది. స్వయంగా ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముందుకు వచ్చి మరీ  పోలీసులను వెనకేసుకు వచ్చారు. దీంతో ఈ దాడి జగన్ కోసం జగన్ చేత జగనే చేయించుకుని సింపతీ కోసం పాకులాడుతున్నారన్న అనుమానాలు అన్ని వర్గాల నుంచీ వ్యక్తం అయ్యాయి. పరిశీలకుల విశ్లేషణలు సైతం ఆ దిశగానే ఉన్నాయి. 

ఇవన్నీ పక్కన పెడితే ఈ దాడి విషయంలో జగన్ స్వంత చెల్లెలు షర్మిల స్పందన చూస్తూ తన అన్నపై దాడి జరిగిందని ఆమె ఏ మాత్రం నమ్మడం లేదని స్పష్టమౌతున్నది. మాజీ ముఖ్యమంత్రి స్వంత జిల్లా చిత్తూరులో ఆమె ఆదివారం (ఏప్రిల్ 14) ప్రచారం నిర్వహించారు. ఆ ప్రచారంలో ఆమె జగన్ పై దాడి అంశాన్ని ఏ మాత్రం ప్రస్తావించలేదు. జగన్ ఐదేళ్ల పాలనా వైఫల్యాలపై విమర్శలు గుప్పించారు. ఆయన వాగ్దానాల వైఫల్యాలపై నిలదీశారు.  

అంటే జగన్ జనం సానుభూతి పొందాలన్న ఉద్దేశంతోనే ఉద్దేశపూర్వకంగా తనపై తానే దాడి చేయించుకున్నారని షర్మిల భావిస్తున్నారా అన్న చర్చ మొదలైంది. ఈ సందర్భంగా నెటిజనులు మహేష్ బాబు హీరోగా నటించిన అతడు సినిమాను గుర్తు చేస్తున్నారు. ఆ సినిమాలో కూడా విజయం కోసం ప్రజల సానుభూతి పొందేందుకు రాజకీయ నాయకుడు తన మీద దాడికి తానే సుపారీ ఇచ్చుకుంటాడు. తూటా పేలాలి.. తనకు తగలాలి కానీ ప్రాణాపాయం ఉండకూడదు అని ఒప్పందం కుదుర్చుకుంటాడు. ఇప్పడుు గులకరాయి దాడితో జగన్ పై జరిగిన హత్యాయత్నం సంఘటన ఆ సినిమాను స్ఫురింప చేస్తోందని నెటిజనులు అంటున్నారు.