ఐయామ్ విత్ బాబు.. ఏపీ అంతటా ఇదే నినాదం.. ఎన్నికలోస్తే తడాఖా చూపుతామంటన్న జనం

స్కిల్ స్కాం అంటూ చంద్రబాబుపై మోపిన అభియోగాలు కోర్టుల్లో నిలవవని న్యాయనిపుణులు, మాజీ ఐఏఎస్ లు, చివరాఖరికి సుప్రీం కోర్టు మాజీ న్యాయవాదులు కూడా బలంగా చెబుతున్నారు. కానీ విచిత్రంగా ఆ నిలబడని అభియోగాల కారణంగానే ఆయన గత పక్షం రోజులుగా రాజమహేంద్రవరం జైలులో ఉన్నారు.

దేశ విదేశాలలో ఆయన అరెస్టును నిరసిస్తూ ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. అన్ని చోట్లా ఆందోళనలు నిరాటంకంగా కొనసాగుతుంటే.. తెలుగు రాష్ట్రాలలో మాత్రం ఆంక్షల నడుమ.. ఐటీ ఉద్యోగులు, వ్యాపారులు, తెలుగుదేశం శ్రేణులూ పట్టువదలకుండా ఉద్యమిస్తున్నారు. లాఠీలకు, అరెస్టులకు బెదరకుండా నిలబడుతున్నారు. ఈ మధ్యలో ఇటు ఏసీబీ కోర్టు, అటు హైకోర్టులో చంద్రబాబుకు ఊరట లభించలేదు. ఏసీబీ కోర్టు చంద్రబాబును రెండు రోజులు సీబీఐ కస్టడీకి అనుమతించగా, హై కోర్టు చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను కొట్టివేసింది. ఇక రెండు రోజుల సీఐడీ విచారణ పూర్తయిన తరువాత ఏసీబీ కోర్టు చంద్రబాబు రిమాండ్ ను పొడిగించింది.

మరో వైపు చంద్రబాబు హైకోర్టు  తన  క్వాష్ పిటిషన్ ను కొట్టివేస్తూ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం ను ఆశ్రయించారు. అలాగే ఏసీబీ కోర్టులో బెయిలు పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండూ కూడా సోమవారం ( సెప్టెంబర్ 25)న విచారణకు రానున్నాయి. దీంతో రాజకీయవర్గాలే కాకుండా సామాన్యులు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. చంద్రబాబును ఏపీ సీఐడీ అరెస్టు చేసిన విధానం అత్యంత అప్రజాస్వామికంగా, అక్రమంగా, అన్యాయంగా ఉందన్న విషయంలో ఎవ్వరిలోనూ భిన్నాభిప్రాయమే కనిపించడం లేదు. చివరాఖరికి వైసీపీలోకి కొందరు నేతలు, శ్రేణులూ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు కూడా. అసలే తీవ్రమైన ప్రజావ్యతిరేకతను ఎదుర్కొంటున్న తరుణంలో చంద్రబాబును అప్రజాస్వామికంగా, అక్రమంగా కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా అర్ధరాత్రి అరెస్టుతో తమ పరిస్థితి మరింత దయనీయంగా మారిందనీ, ఎక్కడో మిణుకు మిణుకు మంటున్న గెలుపు ఆశలు కూడా ఆవిరైపోయాయనీ పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు ప్రైవేటు సంభాషణల్లో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇక అరెస్టు తరువాత చంద్రబాబు పక్షం రోజులుగా జైలులో ఉండటం.. జనం స్వచ్ఛందంగా ఐయామ్ విత్ బాబు అంటూ రోడ్లపైకి రావడం, పోలీసులు మొత్తం రాష్ట్రాన్నే జైలుగా మార్చేసినట్లుగా, రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ విధించిన విధంగా ఆంక్షలు అమలు చేయడంతో జనంలో ఆగ్రహజ్వాలలు ఎగసి పడుతున్నాయి. ఎన్నికలు ఎప్పుడొస్తాయా? జగన్ సర్కార్ ను ఎప్పుడు గద్దెదించుదామా అని ఎదురు చూస్తున్నారు. ఈ విషయాన్ని పలువురు వారి వారి నియోజకవర్గాల ఎమ్మెల్యేల ముఖంమీదనే చెప్పేశారంటే పరిస్థితి తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు. 

ఇక స్కిల్ కేసు విషయానికి వస్తే చంద్రబాబు బెయిలుపై బయటకు రావడం కంటే.. ఈ కేసులో తాను నిర్దోషిననీ, కనీసంగా కూడా పద్ధతులు, ప్రొసీజర్, నిబంధనలు పాటించకుండా అరెస్టు చేశారనీ నిరూపించుకునే బయటకు రావాలని భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. అందుకే క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టులో క్వాష్ పిటిషన్ కొట్టివేసినా.. ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయించారు. న్యాయనిపుణుల అభిప్రాయం ప్రకారం హైకోర్టు క్వాష్ పిటిషన్ ను మెకానికల్ గా కొట్టివేసిందంటున్నారు. దర్యాప్తులో జోక్యం చేసుకోరాదంటూ ఎప్పుడో సుప్రీం కోర్టు ఉత్తర్వులను ఆధారం చేసుకునే ఈ తీర్పు ఇచ్చిందనీ, అరెస్టు తీరే అక్రమం అంటూ చంద్రబాబు తరఫు న్యాయవాదుల వాదనను పరిగణనలోనికి తీసుకోలేదనీ చెబుతున్నారు. 
ఇక సామాన్యజనమైతే.. చంద్రబాబు క్వాష్ పిటిషన్ కొట్టివేత.. వివేకా హత్యకేసులో నిందితుడు భాస్కరరెడ్డికి బెయిలును పోలుస్తూ.. జగన్ సర్కార్ వ్యవస్థలను ఏ స్థాయిలో మేనేజ్ చేస్తోంది అనడానికి అదే తార్కానంగా చెబుతూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే వివేకా హత్య కేసులో ఏ8ను అరెస్టు చేయడానికి వెళ్లి కూడా సీబీఐ రిక్తహస్తాలతో వెనుదిరిగిన సంఘటనను గుర్తు చేస్తున్నారు. ఆధారాలున్నాయి, అవినాష్ ను అరెస్టు చేసి విచారించాలి  అని కోర్టులో సీబీఐ విస్పష్టంగా చెప్పి, అందుకు కోర్టు అనుమతి తీసుకున్న తరువాత కూడా స్థానిక పోలీసుల సహకారం లేదు, శాంతి భద్రతల సమస్య వస్తుందంటూ సాకులు చెప్పి ఆయనను అరెస్టు చేయకుండా వదిలేసిన సంగతిని గుర్తు చేస్తున్నారు. జగన్ సర్కార్ పూర్తిగా నియంతృత్వ ధోరణిలో, కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నదనీ, ప్రభుత్వాన్ని, ప్రభుత్వ విధానాలనూ వ్యతిరేకించేవారిపై అక్రమంగా కేసులు బనాయిస్తూ రాష్ట్రంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అన్నిటికీ మించి మంత్రులు కూడా తరువాత ఎవరెవరి అరెస్టు కాబోతున్నారో బహిరంగంగా ప్రకటిస్తుండటం, సీఐడీ చీఫ్ స్కిల్ కేసు దర్యాప్తు వివరాలను ఊరూరా మీడియా సమావేశాలు పెట్టి మరీ వివరిస్తుండటంతో రాష్ట్రంలో రాజ్యాంగం అమలు అవుతోందా? అన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.  

రాష్ట్రంలో ఒక విధమైన ఎమర్జెన్సీ అమలులో ఉందన్న భావన ప్రజలలో బలంగా వ్యక్తం అవుతున్నది. 1975లో ఎమర్జెన్సీ అనుభవించని జనం ఆ తదుపరి ఎన్నికలలో అప్పటి కేంద్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా అయితే చిత్తుచిత్తుగా ఓడించారో.. వచ్చే ఎన్నికలలో జగన్ సర్కార్ ను అలాగే చిత్తుచిత్తుగా ఓడిస్తాం అని ప్రతిన పూనుతున్నారు. ఇప్పటి వరకూ రాజకీయాలతో సంబంధం లేని తటస్థులు కూడా రోడ్లపైకి వచ్చి చంద్రబాబుకు సంఘీభావం తెలపడం చూస్తుంటే.. సామాన్య  ప్రజానీకం నుంచి మేధావులు మధ్య తరగతి ప్రజలు మొదలు, అన్ని వర్గాల ప్రజల నుంచి జగన్ సర్కార్ పట్ల వ్యక్తం అవుతున్న ఆగ్రహం ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతోంది. ఆ విషయం స్పష్టంగా తెలుస్తున్నా జగన్ మాత్రం తన ప్రసంగాలలో, పార్టీ సమావేశాలలో,శాంతి భద్రతల సమీక్షల్లో ఇంకా అరెస్టులు ఉంటాయి అంటూ పేర్లతో సహా ప్రస్తావిస్తూ ఆదేశాలు జారీ చేయడం చూస్తుంటే నిండా మునిగిపోయాం.. ఇక చలేమిటి? అని సంకేతాలిస్తున్నట్లు కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

ఇక వైసీపీ నేతలు, శ్రేణులూ కూడా తమ నాయకుడు జగన్ రెడ్డి తాను మునిగిపోవడమే కాకుండా, పార్టీనీ, తమనూ కూడా ముంచేయడానికే రెడీ అయిపోయారని అంటున్నారు. ఇక వచ్చే ఎన్నికలలో చంద్రబాబు అరెస్టు ప్రభావం అధికార వైసీపీపై తీవ్ర ప్రతికూలత చూపడం ఖాయమని ఇటీవలి సీఓటర్ సర్వే తేల్చి చెప్పేసింది. చంద్రబాబు అరెస్టు రాజకీయ కుట్రేనని జనం భావిస్తున్నారని కుండబద్దలు కొట్టేసింది. వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం విజయం ఖాయమనీ, చంద్రబాబు ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో అడుగుపెట్టడం ఖాయమనీ సర్వే పేర్కొంది. ఈ నేపథ్యంలోనే వైసీపీ నేతలు పలువురు ఓటమికి మాసికంగా సిద్ధమైపోయారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.