Read more!

రంజాన్ ప్రార్థనలకు హైకోర్టు నో

రంజాన్ సామూహిక ప్రార్థనలకు అనుమతించాలని కోరుతూ ఓ మసీదు ట్రస్టు వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. కొవిడ్-19 ఉధృతి తీవ్ర స్థాయిలో ఉన్నందున సామూహిక ప్రార్థనలకు అనుమతించడం కుదరదని తేల్చి చెప్పింది. మత విశ్వాసాన్ని అనుసరించే హక్కు ముఖ్యమే అయినా.. పౌరుల సంక్షేమం అంతకంటే ముఖ్యమని ధర్మాసనం స్పష్టం చేసింది. 

రంజాన్ మాసం దృష్ట్యా తమ మసీదులో రోజుకు ఐదు సార్లు ప్రార్థనలు చేసుకునేందుకు ముస్లింలకు అనుమతి ఇవ్వాలంటూ దక్షిణ ముంబైలోని జుమా మసీదు ట్రస్ట్ బోంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. విచారణ చేపట్టిన ఇద్దరు సభ్యుల ధర్మాసనం.. ‘‘ మత విశ్వాసాలు అనుసరిస్తూ, వేడుకలను జరుపుకునే హక్కు ముఖ్యమైనదే అయినప్పటికీ.. ప్రజా భద్రత, పౌరుల సంక్షేమం అంతకంటే ముఖ్యమైన, సర్వోన్నతమైనదని గమనించాలి.’’ అని కోర్టు అభిప్రాయపడింది.

తమ మసీదు ఎకరం స్థలంలో విస్తరించి ఉందనీ.. ఒకేసారి 7 వేల మంది సమావేశమయ్యేందుకు సరిపోతుందని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఒక్కో విడతకు కనీసం 50 మందినైనా రంజాన్ సమయంలో ప్రార్థనలు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని ట్రస్ట్ కోరింది. కొవిడ్-19కి సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని కూడా కోర్టుకు విన్నవించింది. అయితే పిటిషనర్ వాదనను అదనపు ప్రభుత్వ ప్లీడర్ జ్యోతి చవాన్ తీవ్రంగా వ్యతిరేకించారు. మహారాష్ట్రలో ప్రత్యేకించి ముంబైలో పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉందని ఆమె కోర్టుకు నివేదించారు. ‘‘ఏ మతానికి మేము మినహాయింపు ఇవ్వలేము. ప్రత్యేకించి ఈ 15 రోజుల్లో అది ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదు. ఈ దశలో మేము ఎలాంటి రిస్క్ తీసుకోలేం. ప్రజలంతా సహకరించాలి.’’ అని చవాన్ అన్నారు. 

ప్రజలు తమ విశ్వాసాలను కొనసాగించడంపై ప్రభుత్వం ఎలాంటి నిషేధం విధించలేదని.. అయితే వాటిని ప్రజలు తమ ఇళ్ల దగ్గరనే చేసుకోవాలని ఆమె స్పష్టం చేశారు. ప్రభుత్వ న్యాయవాది వాదనతో ఏకీభవించిన ధర్మాసనం... ప్రస్తుతం కరోనా ఉధృతి తీవ్రంగా ఉన్నందున పిటిషనర్ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోలేమంటూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసింది. కొవిడ్-19 సంక్షోభం కారణంగా గతంలో కూడా దేశంలోని అనేక కోర్టులు మతాలకు అతీతంగా సామూహిక ప్రార్థనలకు అనుమతి నిరాకరించిన విషయాన్ని కోర్టు గుర్తుచేసింది.